తమిళనాడు ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు.
చిత్తూరు : తమిళనాడు ఎర్ర చందనం కూలీల ఎన్కౌంటర్కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడిస్తామని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు. వైగో హెచ్చరికల నేపథ్యంలో ఆయన్ని చిత్తూరు జిల్లా సరిహద్దులోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వ్యూహం రచించారు. గుడిపాల చెక్పోస్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వైగో రాయవేలూరులో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
మరోవైపు వైగోకు మద్దతుగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.
చిత్తూరులో భారీ బందోబస్తు
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని వైగో చేసిన ప్రకటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ ఎన్‌కౌంటర్‌పై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయని ఏపీ నుంచి తమిళనాడుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఏపీ, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి
చిత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడు వాసులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గాంధీనగర్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళవాసుల్ని సరిహద్దు ప్రాంతంలో ఆంధ్రా పోలీసులు అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.