బాబు సర్కారును రద్దు చేయాలి
- ఎండీఎంకే నేత వైగో డిమాండ్
- వేలూరులో భారీ ధర్నా, అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై/వేలూరు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో 20 మంది అమాయక కూలీలను కాల్చి చంపడానికి కారణమైన ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని మరుమలచ్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.గోపాలస్వామి(వైగో) డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఖండిస్తూ తమిళనాడులోని వేలూరులో ఎండీఎంకే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా చేపట్టారు. వైగో మాట్లాడుతూ.. దేశంలో పిట్టలను, జంతువులను కాల్చేందుకు కూడా అనుమతి కావాలని అలాంటిది అమాయక కూలీలను కాల్చేందుకు అనుమతి ఏ చట్టంలో ఉందని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీ మంత్రి ఒకరు ‘ఇది ఆరంభమే’ అనడం సరికాదని హితవు పలికారు. అనంతరం, కార్యకర్తలతో కలసి చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన వైగోను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆరని జ్వాలలు: ఏపీ ప్రభుత్వంపై తమిళనాడు ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు. బాబు ప్రభుత్వంపై ప్రజలు, ప్రజా సంఘాల నేతలు నిప్పులుగక్కుతూనే ఉన్నారు. బాబు దిష్టిబొమ్మలను పలుచోట్ల దహనం చేశారు. పుదుచ్చేరి రహదారిపై నిలిచి ఉన్న రెండు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ఒకదానిపై గురువారం అర్థరాత్రి దుండగులు పెట్రోలు పోసి తగులబెట్టారు. మద్రాసు హైకోర్టులోని జననాయక న్యాయవాదుల సంఘం సభ్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు డీఎంకే అధినేత కరుణానిధి రూ. లక్ష చొప్పున సాయం ప్రకటించారు.
చెన్నైలో బిక్కుబిక్కుమంటున్న ఆంధ్రులు
ఏపీ, తమిళనాడుల మధ్య నిత్యం రాకపోకలు సాగించే 90 బస్సులు 4 రోజులుగా నిలిచిపోయాయి. ఆందోళనకారులు ఆంధ్రావాళ్లను తమిళనాడులో బయట తిరగనీయబోమంటూ హెచ్చరికలు జారీచేయడంతో చెన్నయ్‌లోని తెలుగు వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు.
17 వరకు మార్చురీలోనే 6 మృతదేహాలు
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఆరుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాలన్న అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఘటన తమ పరిధిలోకి రాదని తెలిపింది. ఏపీ హైకోర్టు లేదా సుప్రీంలను ఆశ్రయించాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు మృతదేహాలకు అంత్యక్రియలు జరపరాదం టూ కేసును 17కి వాయిదా వేశారు. ఆరుగురి మృతదేహాలను తిరువణ్ణామలై ఆసుపత్రిలో భద్రపరిచారు.
ఢిల్లీలోనూ ప్రజాసంఘాల ఆందోళన
ఏపీ, తెలంగాణల్లో జరిగిన ఎన్‌కౌంటర్లు బూటకమని, వాటిపై న్యాయ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఢి ల్లీ సొలిడారిటీ గ్రూప్ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ భవన్ వద్ద పలు ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి.
విచారణ జరుపుతున్నాం
తమిళనాడు సీఎంకు చంద్రబాబు లేఖ
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించినట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు తెలిపారు. పన్నీర్ సెల్వం మంగళవారం రాసిన లేఖకి చంద్రబాబు శుక్రవారం ప్రత్యుత్తరం రాశారు.
హక్కుల కమిషన్ విచారణ
మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అందిన ఫిర్యాదులపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ నెల 22 నుంచి 24 వరకు హైదరాబాద్‌లో బహిరంగ విచారణ చేపట్టనుంది. తెలంగాణలో సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్, ఏపీలో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌లపై కమిషన్ తనంతట తానుగా స్పందించి నోటీసులు జారీచేసింది. వీటితోపాటు ఈ రెండు రాష్ట్రాలకూ చెందిన 84 కేసులపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపట్టనుంది.