‘ఇందిరమ్మ’కు మంగళం!
సాక్షి, కాకినాడ :మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వజ్రసంకల్పంతో తలపెట్టిన ఇందిరమ్మ పథకం ఆయన ఉన్నంత కాలం లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఆ తర్వాత కూడా ముక్కుతూ..మూలుగుతూ కొనసాగింది. ఇప్పుడు రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగడం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు రాష్ర్ట విభజన.. మరొకవైపు ఆర్థిక లోటు గృహనిర్మాణశాఖపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలుగా ఈ శాఖ లావాదేవీలు స్తంభించిపోయాయి. మున్మందు కూడా ఈ శాఖ ద్వారా వివిధ గృహనిర్మాణ పథకాల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్‌కు పేదల గుండెల్లో చోటు కల్పించిన ఇందిరమ్మ పథకాన్ని చంద్రబాబు సర్కార్ రద్దు చేయనుందని అధికారులంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.
ఇందిరమ్మ పథకం ద్వారా జిల్లాలో ఫేజ్-1 కింద 92,891 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 55,785 మాత్రమే పూర్తయ్యాయి. 2935 ఇళ్లు అసలు ప్రారంభం కాలేదు. ఫేజ్-2లో 84,375 ఇళ్లు మంజూరవగా 23,072 మాత్రమే పూర్తయ్యాయి. దీనిలో 4,649 ఇళ్లు అసలు ప్రారంభం కాలేదు. ఫేజ్-3లో 69,294 మంజూరవగా 13,886 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. వీటిలో 17,352 ఇళ్లు అసలు ప్రారంభదశ కూడా దాటలేదు. ఇలా మూడు విడతల్లో ఇంకా ప్రారంభ దశ దాటని ఇళ్లు 24వేల వరకు ఉన్నాయి.
పునాది దశలో ఉన్న ఇళ్లు మరో 30,600 వరకు ఉన్నాయి.
మూడువేల ఇళ్లు లింటల్ లెవెల్‌లో ఉండగా, సుమారు 14 వేల ఇళ్లు రూప్ లెవెల్‌లో ఉన్నాయి. అధికార పగ్గాలు మారడంతో తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ మార్క్ ఇందిరమ్మ పథకాన్ని కొనసాగించే అవకాశాలు లేవని అధికారులంటున్నారు. దీంతో ఈ మొత్తం ఇళ్లన్నీ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత శాఖాధికారులంటున్నారు. మిగిలిన దశ ల్లో ఉన్న ఇళ్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులు కూడా అనుమానంగానే కన్పిస్తోంది.ఫేజ్-1లో ఇప్పటి వరకు రూ.293 కోట్లకు రూ.215కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగితే ఫేజ్-2లో రూ.246 కోట్లకు రూ.175 కోట్లు, ఫేజ్-3లో రూ.190కోట్లకు రూ.160కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఈ లెక్కన ఒక్క ఇందిరమ్మ పథకం కింద మూడు విడతలకు సంబంధించి రూ.179 కోట్ల చెల్లింపులు జరగాల్సి ఉంది. కాగా మార్చి 16వ తేదీ నుంచి చెల్లింపులను పూర్తిగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరోపక్క ఆన్‌లైన్ సేవలను కూడా పూర్తిగా నిలిపివేసింది. గత 70 రోజులుగా ఈ శాఖలో ఎలాంటి గృహనిర్మాణ సంబంధ కార్యకలాపాలు జరగడం లేదు.
ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లతో పాటు వివిధ దశల్లో ఉన్న ఇళ్లకు సంబంధించిన రూ.179 కోట్లు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నా ఆన్‌లైన్ సేవలు నిలిచి పోయాయి.. తామేమి చేయలేమంటూ అధికారులు చేతులెత్తేస్తునారు. దీంతో అప్పులు చేసుకొని ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అపాయింటెడ్ డే(జూన్-2) తర్వాత లోటు బడ్జెట్‌తో ప్రారంభమయ్యే మన రాష్ర్టంలో ఈ బకాయిలకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో అనే ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఒకపక్క లక్షలాది మంది సొంత ఇంటి కలను నెరవేర్చిన ఇందిరమ్మ పథకం పూర్తిగా అటకెక్కనుందన్న వార్తలు నిరుపేదలను ఆందోళనకు గురిచేస్తుంటే మరొకపక్క కోట్లాది రూపాయల బకాయిల విడుదలపై నీలినీడలు కమ్ముకోవడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
అప్పులపాలయ్యాను
రుణం మంజూరైందన్నారు.. ఇంటి నిర్మాణం చేపట్టాను. నువ్వు డౌట్ పడక్కర్లేదు.. నీ పేరు లిస్ట్‌లో ఉంది. నీ దరఖాస్తు కన్పించడం లేదు.. మరోసారి దరఖాస్తు చేసుకోమన్నారు.మూడు నెలలు క్రితం మరోసారి దరఖాస్తు చేసుకున్నా. ఎన్నికల కోడ్ వల్ల రుణం మంజూరు నిలిచిందన్నారు. ఇప్పుడు అడిగితే ఇందిరమ్మ పథకమే రద్దయిపోతుందని అంటున్నారు. ఇప్పట్లో నీకు రుణం మంజూరయ్యే పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వంలో చూద్దాం అంటున్నారు. నాకు రుణం మంజూరైందని చెప్పడం వల్లనే నేను గృహనిర్మాణం మొదలు పెట్టాను. ఐదు రూపాయల వడ్డీకి అప్పులు చేసి మరీ ఇంటి నిర్మాణం పూర్తి చేశాను.. ఇప్పుడు ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలో తెలియడం లేదు.
- కె. రాంబాబు, కార్పెంటర్, మోరి, సఖినేటిపల్లి మండలం.
చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి
హౌసింగ్ లోన్ వస్తుందని అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాం. రెండునెలలుగా తిప్పుతున్నారే కానీ ఇంతవరకు ఒక బిల్లు కూడా మంజూరు చేయలేదు. ఏవో సాకులు చెప్పి తిప్పుతున్నారే కానీ బిల్లుమాత్రం ఇవ్వడంలేదు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. మరోపక్క ప్రభుత్వం మారడంతో బిల్లుల మంజూరులో మరింత జాప్యం జరుగుతుందని అధికారులు అంటున్నారు. ఏమి చేయాలో పాలుపోవడంలేదు.
- తుమ్మలపల్లి మహేష్, కరప.