లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చెలిమికి ఎండీఎంకే
Published Sat, Sep 21 2013 3:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చెలిమికి ఎండీఎంకే నేత వైగో ఆసక్తిగా ఉన్నారు. పార్టీ మహానాడు వేదికగా పరోక్షంగా సంకేతాలు పంపారు. పొత్తు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమతో చెలిమికి ఎండీఎంకేను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజా తెలిపారు.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ద్రవిడ పార్టీలు బీజేపీ, ఎండీఎంకేలను పక్కన పెట్టేశాయి. అసెంబ్లీ ఎన్నికల్ని బీజేపీ ఒంటరిగా ఎదుర్కొంది. ఎన్నికలకే దూరంగా ఉండిపోయింది ఎండీఎంకే. ఎన్‌డీఏ హయూంలో తమిళనాట బీజేపీ రాష్ట్ర నేతలు చక్రం తిప్పారు. ప్రస్తుతం బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించిన నేపథ్యంలో నేతల్లో నూతనోత్సాహం నిండింది. తిరుచ్చి వేదికగా జరగనున్న మోడీ సభను విజయవంతం చేయడంలో నేతలు నిమగ్నమయ్యూరు. మరోవైపు ఒంటరిగా ఉన్న ఎండీఎంకే పొత్తులపై దృష్టి పెట్టింది. రెండు రోజుల క్రితం విరుదునగర్ మహానాడు వేదికగా ఎండీఎంకే నేత వైగో తన సత్తా చాటారు. దక్షిణాదిలోని కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో తనకు పట్టుందని నిరూపించుకున్నారు. బీజేపీకి సైతం దక్షిణ తమిళనాడులో ఓటు బ్యాంక్ ఆశాజనకంగా ఉంది. దీంతో ఇద్దరూ కలిసి ఎన్నికల బరిలోకి దిగితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని వైగో గ్రహించారు. ఈ క్రమంలో బీజేపీతో కలిసి లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నారు.
పరోక్ష సంకేతాలు
బీజేపీతో దోస్తికి సిద్ధమని విరుదునగర్ మహానాడు వేదికగా వైగో పరోక్ష సంకేతాలు పంపారు. మహానాడులో ప్రసంగించిన వైగో డీఎంకేపై దుమ్మెత్తి పోశారు. అన్నాడీఎంకే చీత్కారంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈలం తమిళుల్ని పొట్టన పెట్టుకుందంటూ కాంగ్రెస్‌పై సమరభేరి మోగించారు. చివరగా బీజేపీ పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. ఈలం తమిళుల కోసం మాజీ ప్రధాని వాజ్‌పేయి కృషి చేశారంటూ ప్రశంసించారు. అలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు ద్వారానే ఈలం తమిళులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రత్యర్థితో కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ బీజేపీతో చెలిమికి పరోక్షంగా సంకేతాలిచ్చారు. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకేతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర నేతలు అంత ఆసక్తిగా లేరు. ఆ పార్టీలు ఇచ్చే ఒకటి రెండు సీట్లు వద్దనే తలంపులో ఉన్నారు. ఈలం మద్దతు పార్టీల్ని ఏకం చేసి తమ నేతృత్వంలోనే ఓ కూటమి ఏర్పాటుకు యోచిస్తున్నారు. దక్షిణాది జిల్లాల్లో పట్టున్న పార్టీలతో కలసి గెలుపు తథ్యంగా కూటమి ఆవిర్భావానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆహ్వానం
వైగో సంకేతాల గురించి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హెచ్.రాజాను మీడియూ కదిపింది. తమతో చెలిమికి ఎండీఎంకేను ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఈలం తమిళుల సంక్షేమం కోసం వాజ్‌పేయి ప్రభుత్వం చేసిన కృషి తమిళాభిమానులందరికీ తెలుసునని వివరించారు. ఈలం సంక్షేమాన్ని కాంక్షిస్తూ దక్షిణ తమిళనాడు వేదికగానే ఉద్యమాలు బయలుదేరాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈలం తమిళులకు సమాన అవకాశాల కల్పన డిమాండ్‌తో బీజేపీ సైతం ఉద్యమిస్తోందని వివరించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈలం తమిళులు, జాలర్ల సమస్యలపై కీలక నిర్ణయూలు తీసుకుంటామని ప్రకటించారు. ఈలం తమిళుల్ని అభిమానించే పార్టీలు, సంఘాలు తమతో కలిసి రావాలనుకుంటే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
Advertisement
Advertisement