భారత్ అంటే ఢిల్లీనే కాదన్న మోడీ
Published Sat, Oct 19 2013 4:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలిచే దిశగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. వాజ్‌పేయి పాలనపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. అదే సమయంలో యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. అంతర్జాతీయ సదస్సులు ఢిల్లీలో మాత్రమే నిర్వహిస్తుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నానగర్, న్యూస్‌లైన్:చెన్నైలోని మద్రాస్ వర్సిటీ సెంటనరీ ఆడిటోరియంలో పాల్కీవాలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మారకోపన్యాస సభ శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేంద్ర మోడీ ప్రసంగించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి పాలనను పొగడ్తలతో ముంచెత్తారు. ఆనాడు దేశంలో కరువుకాటకాలున్నా, ధరల పెరుగుదల, అవినీతి, కుంభకోణాలు, లంచగొండితనాలు లేవన్నారు. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు సార్లు అణ్వస్త్ర పరీక్షలు జరిపిన ఘనత వాజ్‌పేయి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అదే సమయంలో యూపీఏ పాలనను తూర్పారబట్టారు.
ముఖ్యంగా విదేశాం గ మంత్రిపై విమర్శలు చేశారు. చైనా భారత భూభాగంలో ఆక్రమణలు జరిపిన రెండు రోజుల వ్యవధిలోనే ఆయన చర్చల కోసం అంటూ చైనా వెళ్లారన్నారు. అసలు సమస్యను చర్చించకుండా బీజింగ్ నగరం ఎంతో అందంగా ఉందని, అవకాశం ఉంటే తాను బీజింగ్‌లోనే ఉండిపోతానని వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక విదేశాంగ మంత్రి చేసే పని ఇదా అని ప్రశ్నించారు. సామాన్యులకు రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అన్నారు. 1902లో ఒక చైనా రచయిత భారతీయులను గురించి చాలా పేలవమైన వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. సరిహద్దులు ఆక్రమణకు గురవుతుంటే మౌనంగా చూస్తూ కూర్చునేది ఒక్క భారతీయులే అని ఆ రచయిత వంద సంవత్సరాల కిందటే ఊహించి రాశారన్నారు. దానిని మన విదేశాంగ మంత్రి రుజువు చేశారని అన్నారు.
పర్యాటకం కలుపుతోంది
ఇండియా అండ్ వరల్డ్ అనే అంశంపై మోడీ చేసిన ప్రసంగం సభికులను ఆలోచింపజేసింది. టైజం విషయంలో వాజ్‌పేరుు ప్రపంచాన్ని శాంతియుత దేశాలు, హింసాత్మక దేశాలు అనే రెండు భాగాలుగా విడగొట్టారన్నారు. తద్వారా భారత్‌కు పెద్ద పీఠ వేశారని అన్నారు. టైజం దేశాలను విడగొడుతుందని, పర్యాటకం దేశాలను మనతో కలుపుతుందని తెలిపారు. ఒక్క పర్యాటకం వలనే భారత్‌కు మూడు ట్రిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోందన్నారు. ఇచ్చి పుచ్చుకోవడం మానవ సంబంధాల్లో ప్రధానపాత్ర పోషిస్తుండడం ఎంతో విచారకరమన్నారు.
టైజం, సైబర్ క్రైం అనే వాటిని మానవతా విలువలు అనే అడ్డుగోడతో నిలువరించాలని పిలుపునిచ్చారు. భారతదేశం బృహత్ భారతమని, విద్యా భారతం అని ఆయన కితాబిచ్చారు. దేశాభివృద్ధికి ఆర్థిక, వాణిజ్య రంగాలను బలోపేతం చేయూల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ రంగాలను యూపీఏ ప్రభుత్వం తమ స్వప్రయోజనాలకు, స్వార్థానికి వాడుకుని దేశ ప్రగతిని తుంగలో తొక్కిందని విమర్శించారు. భారత్ అంటే ఢిల్లీ మాత్రమే కాదన్నారు. అంతర్జాతీయ సదస్సులను ఢిల్లీలోనే ఎందుకు నిర్వహించాలని ప్రశ్నించారు. వాటిని తమిళనాడులో, మిగతా రాష్ట్రాలలో ఎందుకు నిర్వహించరని నిలదీశారు.
పుస్తకావిష్కరణ
ప్రముఖ పాత్రికేయుడు అరుణ్‌శౌరీ రచించిన సెల్ఫ్ డిసెప్షన్ అండ్ చైనా పాలసీస్‌రూ. అనే పుస్తకాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. తొలి ప్రతిని తుగ్లక్ పత్రికా సంపాదకుడు చో రామస్వామికి అందజేశారు. అనంతరం అరుణ్ శౌరీ మాట్లాడుతూ ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం పేరు బలహీనమైతే చేతులు బంధించబడతాయి అని, చివరి అధ్యాయం పేరు బలోపేతమైన చేతులు బంధాలను తెంచుకుంటాయని పేరు పెట్టానని అన్నారు. ప్రస్తుతం భారతదేశం ముఖ్యంగా విదేశాంగ శాఖ మొదటి అధ్యాయం పేరులో ఉందన్నారు. ఇకనైనా ఈ శాఖ తన వైఖరి మార్చుకుని చివరి అధ్యాయం పేరుతో బానిసత్వానికి చరమగీతం పాడాలన్నారు.
అమెరికా అవలంబించిన విధానాలు నేడు ఆ దేశాన్నే మట్టుబెట్టే స్థితికి వచ్చాయని వెల్లడించారు. భారతీయ రాజకీయ నాయకులు తమ మెదళ్లకు పదునుపెట్టి చైనా విధానాలను తిప్పికొట్టాలని సూచించారు. నరేంద్ర మోడీ వంటి నాయకులు దేశాన్ని ముందుకు నడిపించగలిగితే వచ్చే శతాబ్దంలో భారతే ప్రపంచ దేశాలలో అగ్రగామి అవుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. ఇదిలావుండగా సభను ప్రారంభిస్తూ చో రామస్వామి తాను రాజకీయాలను మాట్లాడబోనని చెబుతూనే నరేంద్ర మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో నానీపాల్కీవాలా ఫౌండేషన్ ట్రస్టీలు అరవింద్ దత్త, ఎన్‌ఎల్ రాజా, డాక్టర్ దుర్గా లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement