18న తమిళనాడు మోడీ రాక
Published Wed, Oct 16 2013 7:21 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
మోడీ రాకను పురస్కరించుకుని చెన్నైలోని టీనగర్ పరిసరాలు నిఘా వలయంలోకి చేరాయి. కమలాలయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ కాన్వాయ్ వెళ్లే మార్గంలో మంగళవారం ట్రయల్ రన్ నిర్వహించారు.
సాక్షి, చెన్నై:బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాట పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆయన గత నెల తిరుచ్చిలో జరిగిన మహానాడుకు హాజరయ్యారు. కమలనాథుల్లో ఉత్సాహం నింపారు. ఈ నెల 18న మోడీ మరోమారు రానున్నారు. చెన్నై వైద్యరామన్ వీధిలోని పార్టీ కార్యాలయూనికి (కమలాలయం) ప్రధాని అభ్యర్థి హోదాలో తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అదే రోజున మద్రాస్ వర్సిటీలో జరిగే వేడుకకు మోడీ హాజరుకానున్నారు.
నిఘా కట్టుదిట్టం:మోడీ లక్ష్యంగా తీవ్రవాదులు వ్యూ హరచన చేసిన సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మోడీ పర్యటించే ప్రాంతాల్లో నిఘాను పటిష్టం చేయూలంటూ నగర కమిషనర్ జార్జ్ ఆదేశాలిచ్చారు. నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో ఐదువేల మందిని భద్రతా విధుల్లోకి దించారు. టీనగర్ వైద్యరామన్ వీధిలోని కమలాలయం, మద్రాస్ వర్సిటీ, మీనంబాక్కం విమానాశ్రయ పరిసరాల్లో ఈ బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యాయి. టీనగర్‌లోని పరిసరాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారుు. నిఘా నేత్రాల ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి కదలికల్ని పరిశీలిస్తున్నారుు.
తనిఖీలు: మోడీ పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలు, రహదారులను క్షుణ్ణంగా పరిశీలించారు. కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. కమలాలయాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడికి వచ్చే వారిని తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పల్లావరం సమీపంలోని ఓ లాడ్జీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ఇద్దరు కన్యాకుమారి సమీపంలో ఇటీవల జరిగిన జంటహత్యల కేసులో నిందితులుగా తేలింది. వీరిని అక్కడి పోలీసులకు అప్పగించారు.
Advertisement