కేంద్రంపై నిప్పులు చెరిగిన మోడీ
Published Fri, Sep 27 2013 3:02 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పేర్కొన్నారు. కేంద్రంలోని యూపీఏ సర్కారుపై నిప్పులు చెరిగారు. దేశంలోనే తమిళనాడు పేరొందిందని ప్రశంసించారు. అనేక అంశాల్లో తమిళనాడు, గుజరాత్ మధ్య పోలికలున్నాయని వెల్లడించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: బీజేపీ ఆధ్వర్యంలో యువ కమలం పేరుతో భారీ బహిరంగ సభను తిరుచ్చిలో గురువారం సాయంత్రం నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది వరకు జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్రమోడీ ప్రసంగించారు. తమిళులు కష్టజీవులు, రాజసం, నిజాయితీ, అంకితభావం కలవారని ప్రముఖ తమిళ కవి రామలింగం పిళ్లై చెప్పిన మాటలను ఉద్ఘాటించారు. భారతదేశంలోనే ప్రగతి పథంలో పయనించే రాష్ట్రమని మెచ్చుకున్నారు. దేశ విదేశాల్లో ఏ ప్రముఖ కంపెనీలో చూసినా తమిళ మేధావులు కనిపిస్తారన్నారు. తమిళనాడు, గుజరాత్ రెండూ సముద్రతీరాల్లో ఉన్నాయని, హార్బర్ల ద్వారా అంతర్జాతీయ వ్యాపారం సాగిస్తున్నాయని వివరించారు. స్వాతంత్య్ర పోరాటంలో గుజరాత్ నుంచి గాంధీ, తమిళనాడు నుంచి రాజాజీ పాల్గొన్నారని గుర్తుచేశారు. తమిళనాడులోని షావుకార్పేటను మినీ గుజరాత్ అంటారని, గుజరాత్లోని మణినగర్ను మినీ తమిళనాడు అంటారని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం తీరే కారణం: ప్రగతిలోనే కాదు సమస్యల్లోనూ తమిళనాడు, గుజరాత్ మధ్య పోలికలున్నాయని మోడీ తెలిపారు. తమిళజాలర్లను శ్రీలంక వేధిస్తోందని, గుజరాత్ జాలర్లను పాకిస్థాన్ హింసిస్తోందన్నారు. భారత పౌరులను ఏమైనా చేసుకోవచ్చనే ధైర్యం పొరుగుదేశాలకు కలగడానికి కారణం బలహీనమైన యూపీఏ ప్రభుత్వమేనని ఆరోపించారు. తమిళనాడుకు ఎన్నోసార్లు వచ్చానని, ఎన్నోసభల్లో పాల్గొన్నానని అన్నారు. అయితే ఈ రోజు హాజరైన జనసందోహాన్ని ఏనాడు చూడలేదని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సభకు హాజరైన యువతకు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని గద్దెదించే శక్తి ఉందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నానని వెల్లడించారు.
హమ్మయ్య!
తిరుచ్చిలో మోడీ సభ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. సభను బాంబులతో భగ్నం చేస్తామని గుర్తుతెలియని వ్యక్తి తిరుచ్చి పోలీసులను బుధవారం రాత్రి ఫోన్లో హెచ్చరించాడు. మరోవైపు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన పోలీస్ ఫక్రుద్దీన్ తదితర నలుగురు తీవ్రవాదుల ఫొటోలను సభా ప్రాంగణంలోని అన్ని ప్రవేశద్వారాలు, నగరంలోని కూడళ్ల వద్ద ఏర్పాటు చేశారు. మొత్తం మీద మోడీ సభ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement