మోడీపైనే అందరి దృష్టి
Published Mon, Sep 30 2013 4:32 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
రాష్ట్రంలోనూ మోడీ జపం మొదలైంది. తిరుచ్చి మహానాడు విజయవంతం కావడంతో అందరి దృష్టి మోడీపై పడింది. పార్టీల పేరెత్తకుండా మహానాడు వేదికగా ఆయన చేసిన ప్రసంగం రాజకీయ పక్షాల్ని ఆలోచనలో పడేసింది. అదే సమయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
సాక్షి, చెన్నై: ఎన్‌డీఏ అధికారంలో ఉన్న సమయంలో తమిళనాట బీజేపీ నేతలు చక్రం తిప్పారు. తర్వాత అధికారం దూరం కావడంతో చతికిలబడ్డారు. ద్రవిడ పార్టీల చీత్కారానికి గురయ్యారు. గత లోక్‌సభ ఎన్నికల మొదలు అన్ని ఎన్నికలనూ ఒంటరిగా ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ పేరును పార్టీ ప్రకటించింది. దీంతో తమిళనాడులోని బీజేపీ నేతల్లో నూతనోత్సాహం నెలకొంది. ఆయన నేతృత్వంలో తిరుచ్చి వేదికగా యువ కమలం పేరుతో ఈ నెల 26న మహానాడు నిర్వహించారు. లక్షన్నర మందిని యువజన విభాగం సమీకరించింది. తమకు పట్టున్న నియోజకవర్గాల నుంచి జనాన్ని నేతలు బాగానే తీసుకు రాగలిగారు. నేతలు ఊహించిన దానికంటే ఎక్కువగానే సభ విజయవంతమైంది.
ఆసక్తికరంగా ప్రసంగం
మహానాడు వేదికగా మోడీ ఆసక్తికరంగా ప్రసంగించారు. మోడీ ప్రసంగం యూపీఏ లక్ష్యంగా సాగింది. ద్రవిడ పార్టీల ప్రస్తావనను ఆయన తీసుకు రాలేదు. ఏ ఒక్క పార్టీ ఊసెత్తకుండా, విమర్శించకుండా మాట్లాడడం నేతల్ని ఆలోచనలో పడేసింది. హైదరాబాద్‌లో జరిగిన సభలో అన్నాడీఎంకేను పొగడ్తలతో ముంచెత్తారు మోడీ. అదే తిరుచ్చిలో ఆ పార్టీ పేరునూ ప్రస్తావించలేదు. ఈ పరిణామం అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితను ఆలోచనలో పడేసినట్లు సమాచారం. జయలలిత సైతం ప్రధాని రేసులో ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. తిరుచ్చి మహానాడు నేపథ్యంలో వారు ఆలోచనలో పడ్డారు. మోడీ ప్రసంగాన్ని డీఎంకే సైతం విశ్లేషిస్తోంది.
మోడీపైనే అందరి కన్ను
మోడీ సభకు మూడు రోజుల ముందు నుంచే ఇంటెలిజెన్స్ ద్వారా జయలలిత సర్వే చేయించినట్లు సమాచారం. ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలూ మోడీకి ఉన్నాయంటూ కొందరు, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అంటూ మరికొందరు ఆ సర్వేలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాష్ట్రంలో మోడీకి పెరుగుతున్న జనాదరణతో అన్నాడీఎంకే వర్గాలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఎన్నికల నాటికి కేంద్రంలో నెలకొనే పరిస్థితులతో మోడీకి తన మద్దతు ఇవ్వొచ్చన్న యోచనలో జయలలిత ఉన్నట్లు తెలిసింది. మరోవైపు యూపీఏ సర్కార్‌పై డీఎంకే అధినేత కరుణానిధి దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మోడీ వైపు దృష్టి మరల్చేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే బీజేపీతో జత కడదామనే ప్రతిపాదనను పార్టీలోని కొందరు నేతలు తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ బలం కేంద్రంలో తగ్గుతున్న దృష్ట్యా మోడీకి వస్తున్న ఆదరణను నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. డీఎండీకే, ఎండీఎంకే సైతం తమ దృష్టిని బీజేపీ వైపు మరల్చేందుకు సిద్ధమవుతున్నాయి.
వ్యూహాత్మకం
మోడీ సభ విజయవంతం కావడంతో రాష్ట్రంలోని బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రధాన ద్రవిడ పార్టీలతో కాకుండా ఇతర పార్టీల్ని కలుపుకుని తమ నేతృత్వంలో ఓ కూటమి ఏర్పాటుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. పొత్తుపై ఎండీఎంకే నుంచి పరోక్ష సంకేతాలు అందాయి. అలాగే డీఎండీకేను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ఉరకలు తీస్తున్నారు. మహానాడు మరుసటి రోజు చెన్నైలోనే ఉన్న బీజేపీ అధినేత రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలతో దూతలు డీఎండీకే అధినేత విజయకాంత్‌తో భేటీ అయినట్లు తెలిసింది. ఈ భేటీ సానుకూలంగా సాగినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement