బలమైన పార్టీలతో పొత్తు కుదిరిందని సంబరపడుతున్న బీజేపీకి మిత్ర పక్షాలు బీపీ పుట్టిస్తున్నారుు. ఎండీఎంకే, పీఎంకే మధ్య సయోధ్య ‘కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా తయారైంది. సీట్ల కేటాయింపులో ఇరు పార్టీలు పట్టుబట్టడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తద్వారా అభ్యర్థుల జాబితా విడుదల వాయిదా పడింది.
ఎన్నికల్లో ఎత్తుకు పైఎత్తులు, పొత్తులతో ప్రతిపక్ష పార్టీలను చిత్తు చేసేందుకు బలమైన కూటమిగా ఏర్పడాలని అన్ని పార్టీలతోపాటు బీజేపీ సైతం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆశించినట్లుగానే రాష్ట్రంలో బలమైన కూటమిగా ఏర్పడడం తో ఆ పార్టీ నేతల్లో సంతోషం ఉరకలేసింది. రాష్ట్రంలోని రెండు బలమైన ప్రత్యర్థులుగా చలామణి అవుతున్న డీఎండీకే, పీఎంకేలు బీజేపీ కూట మిలో చేరడం వల్ల మిత్రపక్షాలుగా మారిపోయాయి. ఆ రెండు పార్టీలు తమతో జతకట్టడం వల్ల బీజేపీ నేతల్లో నెలకొన్న సంతోషం సీట్ల సర్దుబాటు చేయడంలో ఆవిరైపోయింది.
నియోజకవర్గాల పంపకాలపై బీజేపీ కూటమి మిత్ర పక్షాలతో నెల రోజులుగా సాగిన చర్చ లు దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఈ క్రమం లో శుక్రవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల ఆధ్వర్యంలో జాబితాను ప్రకటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్‌రాధాకృష్ణన్ నిర్ణయించుకున్నారు. ఉదయం 6.15 గంటలకు చెన్నై నుంచి ఢిల్లీకి విమానం టికెట్టు కూడా బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డీఎండీకే, పీఎంకే సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాంబు పేల్చారుు. సమష్టిగా సాగిన చర్చలతో రూపొందించిన తాత్కాలిక జాబితా ప్రకారం డీఎండీకేకు 14 స్థానాలు, బీజేపీకి 8, పీఎంకేకు 8, ఎండీఎంకేకు 6 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఐజేకే, కొంగునాడు, పుదియనీది కట్చి, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు ఒకటి చొప్పున కేటాయించారు.
నాలుగు స్థానాల్లో కిరికిరి: సీట్ల సర్దుబాటులో దాదాపు ఓకే అనిపించుకున్న బీజేపీకి నాలుగు స్థానాలు తలనొప్పిగా మారాయి. పొత్తు దశలోనే పీఎంకే పది స్థానాలను ఖరారు చేసుకుంది. బీజేపీ విజ్ఞప్తి మేరకు వాటిలో రెండిం టిని వదిలేసేందుకు సిద్ధమైంది. ఆరణి, అరక్కోణం డీఎండీకే కోరుతోంది. సేలంను డీఎం డీకే, బీజేపీ రెండూ కోరుతున్నారుు. కృష్ణగిరి స్థానంపై కూడా మిత్రపక్షాల్లో పోటీ నెలకొం ది. ఆరణిలో కేంద్ర మాజీ మంత్రి ఏకే మూర్తి, కృష్ణగిరిలో జీకే మణి, సేలంలో పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అరుళ్ ఆరునెలలుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆరణి, అరక్కోణం, సేలం, కృష్ణగిరి స్థానాలపై నెల కొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటల వరకు చర్చలు జరిపారు. అయినా డీఎండీకే, పీఎంకే భీష్మిం చుకోవడంతో తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆ రెండు పార్టీలు బీజేపీ కూటమి నుంచి వైదొలుగుతాయా అనే అనుమానం నెలకొంది.
దీంతో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మురళీధరరావు హుటాహుటిన శుక్రవారం చెన్నై చేరుకుని పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిత్రపక్ష పార్టీలకు సీట్లు పంపకాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన్నందున శుక్రవారం ప్రకటించాల్సిన పార్టీ జాబితాను రెండు రోజులు వాయిదా వేసినట్లు తెలిపారు.