పొత్తులపై చర్చలకు సిద్ధం
Published Wed, Jan 22 2014 12:26 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
లోక్‌సభ ఎన్నికల పొత్తులపై చర్చకు బీజేపీ సిద్ధం అయింది. ఈనెల 23న ఎండీఎంకేతో సీట్ల పందేరం, పొత్తులపై చర్చించనున్నది. ఆ తర్వాత డీఎండీకే, పీఎంకేతో చర్చలకు కమలనాథులు నిర్ణయించారు. ఎన్నికల్లో కూటమిపై తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామని పీఎంకే నేత రాందాసు మంగళవారం ప్రకటించారు.
సాక్షి, చెన్నై : తమ నేతృత్వంలో కూటమి ఏర్పాటు లక్ష్యంగా బీజేపీ ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. వారితో కలిసి నడిచేందుకు ఎండీఎంకే నేత వైగో సిద్ధమయ్యారు. తమ కూటమిలోకి డీఎండీకే, పీఎంకేలను ఆహ్వానించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణేశన్ నేతృత్వంలో ఓ కమిటీ సైతం ఏర్పాటైంది. ఈ నెల 23న కమలాలయంలో ఎండీఎంకేతో చర్చలకు ఈ కమిటీ సిద్ధమైంది. ఎండీఎంకే నేత వైగో నేతృత్వంలోని ఆ పార్టీ నాయకులు మాశిలామణి, గణేష్ మూర్తితో కూడిన బృందం బీజేపీ కమిటీతో చర్చలకు నిర్ణయించింది. ఏడు స్థానాల్లో పోటీ లక్ష్యంగా ఎండీఎంకే ముందుకెళుతోంది.
ఈ చర్చల ద్వారా ఆ స్థానాల కేటాయింపుపై తుది నిర్ణ యం తీసుకుంటారా? లేదా మరో చర్చకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. అదే రోజు ఈశ్వరన్ నేతృత్వంలోని కొంగునాడు పార్టీ సైతం బీజే పీతో చర్చలు జరుపనున్నది. ఈ చర్చల అనంతరం డీఎండీకేను నేరుగా కలవడం లేదా, ఢిల్లీ దూతల ద్వారా విజయకాంత్‌కు గాలం వేయడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. పీఎంకేను తమ వైపు తిప్పుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో నిర్ణయం: తమ కోసం బీజేపీ తలుపులు తెరవడం, డీఎంకే సైతం అక్కున చేర్చుకునేందుకు ప్రయత్నాల్లో ఉండటంతో పీఎంకే అధినేత రాందాసు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించే పనిలో పడ్డారు. ద్రవిడ పార్టీలతో చేతులు కలిపేది లేదని గతంలో చెప్పారు. మంగళవారం సైతం అదే పల్లవి అందుకున్నారు. అయితే, కూటమిపై తన నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని, ఒంటరిగా పోటీ చేయడమా లేదా, తమను ఆహ్వానిస్తున్న వారి తో చర్చలకు సిద్ధ పడటమా..? అన్నది తేలుస్తామని పేర్కొనడం గమనార్హం.
Advertisement