‘టాడా’ రద్దు
ఎండీఎంకే నేత వైగోతో సహా తొమ్మిది మందిపై నమోదైన టాడా కేసు రద్దు చేస్తూ పూందమల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విచారణను ముగిస్తూ, సోమవారం తన తీర్పును న్యాయమూర్తి మోని వెలువరించారు. సాక్షి, చెన్నై: మదురై జిల్లా తిరుమంగళం వేదికగా జరిగిన బహిరంగ సభలో ఎండీఎంకే నేత వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎల్‌టీటీఈలకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పటి ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఆయన్ను, ఆ వేదిక మీదున్న మరో 8 మందిపై తీవ్రవాద నిరోధక చట్టం(టాడా) ప్రయోగించారు. ఎండీఎంకే నేత వైగోతో సహా 9 మందిని అరెస్టు చేసి కటకటాల్లో పెట్టారు. ఏడాదిన్నరపాటు కారాగారావాసాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఎట్టకేలకు బెయిల్ మీద బయటకు వచ్చిన వైగో తనతో పాటుగా 9 మందిపై దాఖలు చేసిన కేసును వ్యతిరేకిస్తూ ఆ చట్టం వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక కమిటీని ఆశ్రయించారు.
రద్దు: ఏళ్ల తరబడి సాగిన ఈ విచారణలో వైగోతో సహా ఎనిమిది మందికి విముక్తి కల్పించే విధంగా ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో గత్యం తరం లేక ఆ కేసును వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయినా, టాడా కోర్టు వెనక్కు తగ్గలేదు. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ కోర్టు తిరస్కరించి, విచారణ కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పన్నెండేళ్లుగా ఈ కేసు నుంచి విముక్తి పొందేందుకు న్యాయ స్థానంలో వైగో అండ్ బృందం పోరాడుతూనే ఉంది. ఈ కాలంలో ఆ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మరణించారు. ఎట్టకేలకు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ రూపంలో వైగో అండ్ బృందానికి విముక్తి కలిగింది. కేసు కొనసాగింపునకు టాడా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేసింది.
దీంతో మళ్లీ టాడా కోర్టును ఈ నెల 21న వైగో ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను వివరిస్తూ వైగో అండ్ బృందం దాఖలు చేసిన పిటిషన్‌ను టాడా కోర్టు న్యాయమూర్తి మోని పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు రద్దుకు నిర్ణయించడం, తమ ఉత్తర్వుల్ని హైకోర్టు రద్దు చేయడాన్ని పరిగణనలోకి తీసుకుని ఇక, విచారణను ముగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. వైగోతో సహా మిగిలిన వారిపై నమోదైన టాడా చట్టాన్ని రద్దు చేస్తున్నట్టు తీర్పు వెలువరించారు. దీంతో ఆ కేసు నుంచి వైగోతో సహా ఏడుగురికి పూర్తిగా విముక్తి కల్గినట్టు అయింది.