పొత్తు ఖరారు
Published Mon, Jan 27 2014 12:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, చెన్నై: ఎండీఎంకే, బీజేపీల పొత్తు ఖరారు అయింది. సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక రెండు పార్టీలు చెట్టాపట్టాల్ వేసుకుని తిరగనున్నాయి. మోడీ సభ సక్సెస్ లక్ష్యంగా రెండు పార్టీల నేతలు ఆదివారం చెన్నైలో సమీక్షించారు. కమలాలయానికి వచ్చిన ఎండీఎంకే నేత వైగోకు బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ ఘన స్వాగతం పలికారు. బీజేపీ నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు కమలనాథులు విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేతో కలసి గెలుపు కూటమి లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు. తొలి విడతగా ఎండీఎంకేతో చర్చలు జరిపారు. తమతో దోస్తీకి ఎండీఎంకే నేత వైగో ముందుగానే సుముఖం వ్యక్తం చేయడం, రెండు పార్టీల ముఖ్య నాయకుల చర్చలు సత్ఫలితాల్ని ఇవ్వడంతో దాదాపుగా సీట్ల పందేరం కొలిక్కి వచ్చింది.
కమలాలయంలో వైగో: చాలా కాలం తర్వాత ఆదివారం ఎండీఎంకే నేత వైగో కమలాలయంలో అడుగు పెట్టారు. తమ కార్యాలయానికి వచ్చిన వైగో, ఆయన పార్టీ నాయకులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, జాతీయ నాయకులు మురళీధర్ రావు, ఇలగణేశన్, మహిళా నాయకులు తమిళిసై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మోడీ సభ విజయవంతంపై సమీక్షించారు. గుజరాత్‌లో మోడీ నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. మీడియా సమావేశంలో వైగో, పొన్ రాధాకృష్ణన్, మురళీ ధర్‌రావు మాట్లాడారు.
కలసికట్టుగా...: ఫిబ్రవరి 8న వండలూరులో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేతృత్వంలో సభ జరగనున్నదని గుర్తు చేశారు. ఈ సభ విజయవంతానికి రెండు పార్టీలు కలసికట్టుగా కృషి చేస్తాయని చెప్పారు. ఎండీఎంకే, బీజేపీల బంధం ఇప్పటిది కాదని, 1998 నుంచి స్నేహ పూర్వకంగానే వ్యవహరిస్తున్నాయన్నారు. యువతను ఆకర్షించడం లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నారు. ఎండీఎంకే , బీజేపీల పొత్తు ఖరారు అయిందని, డీఎండీకే, పీఎంకేలతో చర్చలు జరపాల్సి ఉందన్నారు. చర్చలు ఆశాజనకంగా ఉంటాయన్నారు. బీజేపీ, ఎండీఎంకే సీట్ల పందేరం గురించి ప్రశ్నించగా, అందుకు ఓ కమిటీ ఉందని, అది చూసుకుంటుందంటూ వైగో దాట వేశారు.
మోడీ పేరిట దుకాణాలు: నరేంద్ర మోడీ పేరిట దుకాణాల ఏర్పాటుకు బీజేపీ సిద్ధం అయింది. తమ ప్రచారంలో భాగంగా సరికొత్తగా మోడీ నామంతో టీ దుకాణాలు, హోటళ్లు ఏర్పాటుకు నిర్ణయించారు. ఇప్పటికే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన అనేక దుకాణాలు ఉన్న దృష్ట్యా, వాటి పేర్లు మార్చే రీతిలో చర్యలు చేపట్టారు. మదురైలోని నాయకులు, కార్యకర్తలు మోడీ పేరును తమ దుకాణాలకు నామకరణం చేయడం విశేషం. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు మాట్లాడుతూ, టీ దుకాణాల్ని కాంగ్రెస్ వర్గాలు అవహేళన చేశాయని గుర్తు చేశారు. దీనికి ప్రతిగా తమ నేతలు చక్కటి సమాధానాలే ఇచ్చారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆ దుకాణాలకు మరింత పేరు కల్పించడంతో పాటుగా మోడీ నామంతో తమ పార్టీకి ప్రచార అస్త్రం దక్కినట్టైందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement