
బర్తరఫ్ చేయూలి
రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని పీఎంకే అధినేత రాందాసు డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే చేస్తున్న వీరంగంతో రూ.వెయ్యి కోట్ల మేరకు ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు. ఈ నష్టాన్ని ఆ పార్టీ నుంచి భర్తీ చేసేవిధంగా న్యాయం కోసం పీఎంకే ఉద్యమిస్తుందని ప్రకటించారు.సాక్షి, చెన్నై : బుధవారం చెన్నైలో విలేకరులతో పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు మాట్లాడారు. అన్నాడీఎంకే వర్గాల వీరంగాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధినేత్రి జయలలిత తప్పు చేశారు కాబట్టే న్యాయ స్థానం శిక్ష విధించిందని, ఈ తీర్పును ఆహ్వానిస్తున్నామన్నారు. అయితే, న్యాయ స్థానం పనిగట్టుకుని, క్షక్ష సాధింపుతో తీర్పు ఇచ్చినట్టుగా అన్నాడిఎంకే శ్రేణులు ఆరోపించడం శోచనీయమని విమర్శించారు. న్యాయమూర్తులను కించ పరిచే విధంగా పోస్టర్లను ముద్రించడం, ఇందుకు పలువురు మంత్రులు వత్తాసు పలకడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం లక్ష్యంగా కొందరు మంత్రు లు వ్యవహరించారని, వీరిపై న్యాయ పోరాటం చేయనున్నామని వివరించారు.
ఇళ్లపై దాడులు చేశారు
జయలలితకు శిక్ష పడ్డ రోజు నుంచి ఇప్పటి వరకు అన్నాడీఎంకే వర్గాలు సృష్టించిన ఆరాచకాలతో రూ. వెయ్యి కోట్ల మేరకు ప్రజా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయని ఆరోపించారు. వర్తకులు కూడా తీవ్ర నష్టాన్ని చవి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక బస్సులు ధ్వంసం అయ్యాయని, రాజకీయ పక్షాల కార్యాలయాలు, ప్రజల ఇళ్లపై సైతం దాడులు జరిగాయని వివరించారు. ఈ దాడులకు పాల్పడ్డ అన్నాడీఎంకే శ్రేణులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన నష్టాన్ని ఆ పార్టీ నుంచి రాబట్టే విధంగా న్యాయ పోరాటానికి సిద్ధం అవుతున్నామన్నారు.
శాంతి భద్రతలేవీ?: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అరాచకాలు, వీరంగాలు సాగుతున్నా, పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించడం విచారకరంగా పేర్కొన్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, భయ పెట్టి, బెదిరించి నిరసనల బాట పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తు త పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు రక్షణ కల్పించాలంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకోవాలని, రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
జయ నీతివంతురాలా?: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఉత్తమురాలా..? నిజాయితీ పరురాలా? అని వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. ఆమె మీద ఎన్నో కేసులు ఉన్నాయని వివరిస్తూ, అన్ని కేసుల్లోనూ అప్పీలు మీద అప్పీలు, వాయిదాల మీద వాయిదాలతో కాలం గడుపుతున్నారని చెప్పా రు. చేసిన తప్పుకు శిక్ష పడిందని, ఆ శిక్షను అనుభవించక తప్పదన్నారు. రాష్ర్టంలో రాజకీయంగా ఇక జయలలిత శకం ముగిసిందని, ఇకనైనా ఆమె జపం మానుకుని ప్రజలకు ఇబ్బం దులు కల్గించే ప్రయత్నాలు చేయొద్దంటూ అన్నాడీఎంకే శ్రేణులకు హితవు పలికారు.
తొలగించాల్సిందే: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పథకాల్లో జయలలిత చిత్ర పటాలు ఉన్నాయని, వాటిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యాలయాల్లో మొక్కుబడిగా ఆమె ఫొటోల్ని అక్కడక్కడ తొలగించారేగానీ, పూర్తి స్థాయిలో తొలగించ లేదని ఆరోపించారు. ఆమె మాజీ కాబట్టి ఆమె చిత్ర పటాలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవానీ సింగ్ వద్దే వద్దు: కర్ణాటక ప్రభుత్వ న్యాయవాదిగా భవానీ సింగ్‌ను నియమించొద్దని రాందాసు డిమాండ్ చేశారు. జయలలిత బెయిల్ విషయంలో ఆయన ఎలాంటి అభ్యంతరం తెలపలేదని చెప్పారు. జయలలిత శిక్ష ఖరారుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి వ్యాఖ్యలు చేయక పోవడం, డీఎంకే అధినేత కరుణానిధి ఆచితూచి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు.