టీనగర్ : వందవాసిలో బ్యానర్ ఏర్పాటు చేయడంలో అన్నాడీఎంకే, పీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వందవాసి తేరడి ప్రాంతంలో ముఖ్యమంత్రి జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక ప్రాంతాలలో బ్యానర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పీఎంకే తరఫున వండలూరులో జరిగే మహానాడును పురస్కరించుకుని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి పీఎంకే కార్యకర్తలు మరికొన్ని బ్యానర్లను తేరడి ప్రాంతంలో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించారు.
ఆ సమయంలో వందవాసి వెస్ట్ యూనియన్ అన్నాడీఎంకే ఉంచిన బ్యానర్‌ను తొలగించారు. ఆ స్థానంలో పీఎంకే బ్యానర్ ఏర్పాటుచేశారు. ఆ విషయం తెలిసి అన్నాడీఎంకే కార్యదర్శి అర్జునన్ వందవాసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. శుక్రవారం రాత్రి కూడా మళ్లీ పీఎంకే కార్యకర్తలు తేరడి ప్రాంతంలో అన్నాడీఎంకే బ్యానర్ ముందు తమ బ్యానర్ ఏర్పాటుచేశారు.
అన్నాడీఎంకే - పీఎంకే ఘర్షణ : ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే కార్యకర్తలు వంద మందికి పైగా అక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా వంద మందికి పైగా పీఎంకే కార్యకర్తలు కూడా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇది పార్టీ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సమాచారం అందుకున్న డీఎస్పీ బాలచంద్రన్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాల నేతలతో చర్చలు జరిపారు.
దీంతో పీఎంకే రెండవ సారి ఏర్పాటు చేసిన బ్యానర్‌ను తొలగించింది. అన్నాడీఎంకే నేతలు మొదటిసారి ఏర్పాటుచేసిన బ్యానర్ కూడా తొలగించాలని కోరారు. దీన్ని పీఎంకే కార్యకర్తలు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆపై ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. స్వల్పంగా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు మళ్లీ జోక్యం చేసుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అర్ధరాత్రి వరకు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.