వైగో రచ్చ | BJP warns MDMK chief Vaiko for remarks against Modi | Sakshi
Sakshi News home page

వైగో రచ్చ

Published Mon, Dec 1 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

వైగో రచ్చ

వైగో రచ్చ

సాక్షి, చెన్నై :  ఎండీఎంకే నేత వైగోకు కమలనాథుల బెదిరింపు రచ్చకెక్కింది. బీజేపీ జాతీయ నేత రాజా ఇంటిని ముట్టడించేందుకు ఎండీఎంకే వర్గాలు ప్రయత్నింయి. సుబ్రమణ్య స్వామి ఏమైనా అమిత్ షానా? అని వైగో ప్రశ్నించారు. ఇకనైనా మోదీని విమర్శించొద్దంటూ ఎండీఎంకే, పీఎంకే నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. వైగో తమ కూటమిలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.
 
  లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలసి ఎండీఎంకే పయనించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం బీజేపీ తీరుపై ఎండీఎంకే నేత వైగో శివాలెత్తారు. ఈలం తమిళులు, జాలర్ల విషయంలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం వైగోకు ఆగ్రహాన్ని తెప్పించింది.  దీంతో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే పనిలో పడ్డారు. ఇది కాస్త కమలనాతుల్లో ఆగ్రహాన్ని రేపింది. బీజేపీ జాతీయ నేతలు సుబ్రమణ్య స్వామి, హెచ్ రాజా వైగోను టార్గెట్ చేసి తీవ్రంగానే స్పందించారు. తమ కూటమిలో నుంచి వెళ్లకుంటే గెంటాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే, మోదీని టార్గెట్ చేసి విమర్శలు మానుకోకుంటే, వైగోకు భద్రత కరువు అవుతుందని, కేంద్రంలో ఉన్నది తామన్న విషయాన్ని గుర్తెరగాలంటూ రాజా తీవ్రంగానే స్పందించారు. ఇది ఎండీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని రేపింది.
 
 తమ నేత భద్రతను ప్రశ్నార్థకం చేసే విధంగా రాజా వ్యాఖ్యలు చేయడాన్ని ఎండీఎంకే వర్గాలు తీవ్రం గా పరిగణించాయి. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆదివా రం ఉదయం రాజా ఇంటిని ముట్టడించేందుకు యత్నిం చారు. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. రాజా ఇంటిని ముట్టడించే ఎండీఎంకే వర్గాలను అరెస్టు చేయకుంటే, అన్నాడీఎంకే అధినేత్రి  జయలలిత బెయిల్ రద్దు కు తాను సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని సుబ్రమణ్య స్వామి హెచ్చరికలు జారీ చేయడం ఆ పార్టీ వర్గాల్లో కలవరాన్ని రేపింది. దీంతో ఎండీఎంకే వర్గాల్ని అడ్డుకునే విధంగా పోలీసులు రంగంలోకి దిగారు. రాజా ఇంటి ముట్టడికి యత్నించిన ఎండీఎంకే వర్గాలను మార్గ మధ్యలోనే అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసిన విషయాన్ని సుబ్రమణ్య స్వామికి సమాచారం రూపంలో పంపినట్టు తెలిసింది.
 
 సుబ్రమణ్య స్వామి అమిత్ షానా: కమలనాథుల చర్యపై ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా స్పందించారు. తాను గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తీవ్రంగానే విమర్శించానని గుర్తు చేశారు. అయితే, ఆయన్ను తాను కలుసుకున్నప్పుడు మర్యాద పూర్వకంగా వ్యవహరించారన్నారు. ఆ సమయంలో తాను చేసిన విమర్శలు గుర్తు చేయగా, సిద్ధాంత పరంగా చేసే విమర్శల జోలికి తాను వెళ్లబోనని పేర్కొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అదే విధంగా తాను మరెందర్నో విమర్శించానని, ఆరోపణలు గుప్పించానని, వారెవ్వరూ ఇంత వరకు తనను బెదిరించిన దాఖలాలు లేవన్నారు. అయితే, తమిళుల కోసం తాను పోరుడుతూ కేంద్ర తీరును విమర్శిస్తే బెదిరించడం శోచనీయమన్నారు.
 
 తనను బెదిరించడం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం బెదిరింపులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాజా ఇంటిని ముట్టడించే వాళ్లను అరెస్టు చేయకుంటే, జయలలిత బెయిల్ రద్దు చేయిస్తానని సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించడం శోచనీయమని, దీన్ని బట్టి చూస్తే కొందరు కమలనాథులు ఏ మేరకు బెదిరింపులతో పబ్బం గడుపుతున్నారో స్పష్టం అవుతోందన్నారు. తనను ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లమని చెప్పడానికి సుబ్రమణ్య స్వామి ఏమైనా అమిత్ షానా? ఆయనెవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 విమర్శలు వద్దు :  ఎన్డీఏ కూటమిలో ఉంటూ ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించ వద్దని ఎండీఎంకే , పీఎంకే నేతల్ని బీఊసీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. విమర్శలు వివాదాలకు దారి తీయకూడదని, అందరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు. అయితే, హెచ్ రాజా, సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలపై స్పందించక పోవడం గమనార్హం. ఎండీఎంకే నేత వైగో తమ కూటమిలోనే ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అయితే, వైగోను టార్గెట్ చేసిన కమలనాథుల చర్యల్ని పలు పార్టీల నాయకులు, తమిళాభిమాన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వైగోకు బెదిరింపు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆయనకేదైనా జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్ మురుగన్ హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement