సాక్షి, చెన్నై: ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానం ప్రవేశ పెట్టాలన్న నినాదంతో పీఎంకే ఆందోళనకు శ్రీకారం చుట్టింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతృత్వంలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిం చారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని నాయకులను కలుపుకుని ఉద్యమాన్ని చేపట్టబోతున్నట్టు రాందా సు ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ఈవీ ఎంలపై నమ్మశక్యం లేదని బ్యాలెట్ పద్ధతిని మళ్లీ అమల్లోకి తీసుకురావాలన్న డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కు పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఉదయాన్నే ఆయా జిల్లాల్లోని ఎన్నికల అధికారుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, అధ్యక్షుడు జికే మణి, సీనియర్ నేత ఏకే మూర్తిల నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాలెట్ విధానం కోసం పట్టుబడుతూ నినాదాలతో నిరసన కారులు హోరెత్తించారు. ఈవీఎంలలో చోటు చే సుకుంటున్న అవకతవకలను ఎత్తి చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.ఉద్యమం: ఈ నిరసనలో రాందాసు ప్రసంగిస్తూ, ఈవీఎంలలో భారీ అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉందని ఆరోపించారు. ప్రపంచ దేశాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తుంటే, భారత దేశంలో మాత్రం అమలు చేయడం అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. అమెరికా, జర్మనీ దేశాలు ఈవీఎంలను పక్కన పెట్టి మరలా బ్యాలెట్ పద్ధతిని అనుసరిస్తున్నాయని,
దీన్ని పరిగణనలోకి తీసుకుని దేశంలో మళ్లీ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం జయలలిత 2001లో కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు వరుస విజయాలతో ఈవీఎంలను ఆమె ఆహ్వానించడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పీఎంకే శ్రీకారం చుడుతుందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని పార్టీల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఈవీఎంలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. తమిళనాడులో జరిగిన లోక్ సభ ఎన్నికలపై సీబీఐ విచారణ చేపట్టాలన్న డిమాండ్‌తో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ వేయనున్నామని ప్రకటించారు.
బ్యాలెట్ కోసం ఆందోళన
Published Tue, Jul 22 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement