పీఎంకే షాడో బడ్జెట్ | PMK presents shadow budget | Sakshi
Sakshi News home page

పీఎంకే షాడో బడ్జెట్

Published Tue, Feb 11 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

PMK presents shadow budget

సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ప్రజా సమస్యల్ని తీసుకెళుతూ పీఎంకే షాడో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. విద్య, వైద్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేయాలని డిమాం డ్ చేస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించారు. దీన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు సోమవారం విడుదల చేశా రు. పొత్తుకు ఇంకా సమయం ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్‌ను దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని దాఖలుకు ముందుగా పీఎంకే షాడో బడ్జెట్‌ను విడుదల చేస్తోంది. అందులో ప్రజా సమస్యలు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు, కొత్త అంశాల్ని విశదీకరిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 13న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో తమ షాడో బడ్జెట్‌ను పీఎంకే విడుదల చేసింది. 
 
 చెన్నై ప్రెస్ క్లబ్‌లో సోమవారం జరిగిన సమావేశంలో షాడో బడ్జెట్‌ను రాందాసు విడుదల చేశారు. బడ్జెట్‌లోని అంశాల గురించి ఆయన వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో తాము సరికొత్త నిర్ణయాలతో బడ్జెట్‌లో కేటాయింపులు చేశామన్నారు. జాతీయ స్థాయి విద్యా బోధనలు, టెట్ రద్దు, తాత్కాలిక ఉద్యోగుల పర్మినెంట్ తదితర అంశాల్ని వివరించామని పేర్కొన్నారు. విద్యకు రూ.30 వేల కోట్లు కేటాయించాలన్న డిమాండ్ ను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామన్నారు. అలాగే ఆరోగ్య సేవలు మెరుగుపరచడమే లక్ష్యంగా రూ.18 వేల కోట్లు, వ్యవసాయానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 
 
 ఒక్కో పంచాయతీకి ఒక్కో ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి ఇవ్వాలని, దీనిని ఆయూ గ్రామాల్లో రైతుల అవసరాలకు ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉచితంగా ఎరువులు, విత్తనాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మద్య నిషేధం, అవినీతి నిర్మూలన, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, లైంగిక దాడులపై విచారణకు ఐఏఎస్ అధికారిని నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరారు. మదు రై, కోయంబత్తూరు, తిరుచ్చిలో మెట్రో రైలు పనులు చేపట్టాలని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల నిధి రూ. 3 కోట్లకు పెంచాలని, పదవీ విరమణ రోజే సంబంధిత ఉద్యోగికి అన్ని రకాల సెటిల్‌మెంట్‌లు పూర్తి చేయాలని కోరామన్నారు. ఈ షాడో బడ్జెట్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నామని తెలిపారు. 
 
 సమయం ఉంది
 పొత్తు గురించి సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంకా సమయం ఉందని, సరైన సమయంలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. ఇది వరకు పది మంది అభ్యర్థులతో చిట్టాను ప్రకటించామని, ఆ స్థానాల బరిలో తాము పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే, డీఎంకేలతో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు గాలాలు వేయడం సాధారణమని, అందులో భాగంగా తాము వేచి ఉన్నామంటూ బీజేపీతో పొత్తుపై సంధించిన ప్రశ్నకు పరోక్ష వ్యాఖ్య చేశారు. పొత్తు కుదిరిందా..? అని ప్రశ్నించగా ఈ విషయూన్ని బీజేపీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌ను అడగాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  పీఎంకే నాయకులు జీకే మణి, అరుణ్, ధనపాలన్, రాం ముత్తుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement