అధికారం మాదే!
2016 అసెంబ్లీ ఎన్నికల్లో పీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందేనని, ఆ పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం తథ్యమని జోస్యం చెప్పారు. మౌళి వాకం ఘటన బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
సాక్షి, చెన్నై :పీఎంకే చెన్నై జిల్లా సర్వ సభ్య సమావేశం ఆదివారం ఎంఎండీఏలోని ఓ కల్యాణ మండపంలో జరిగింది. కేంద్ర మాజీ మంత్రి ఏకే మూర్తి నేతృత్వం వహించిన ఈ సమావేశానికి అధినేత రాందాసు, యువజన నేత అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జీకే మణి హాజరయ్యారు. ఇందులో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. పోరూర్ మౌళి వాకం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ప్రత్యేక తీర్మానం చేశారు. అలాగే, ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆందోళనకు నిర్ణయించారు. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, మంగళవారం చెన్నై వళ్లువర్ కోట్టం వద్ద భారీ నిరసనకు నిర్ణయించారు. మద్య నిషేధం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక్కో జిల్లాలో లక్ష మంది మహిళలతో సంతకాల సేకరణకు తీర్మానించారు.
గెలుపు మనదే: రాందాసు సభను ఉద్దేశించి ప్రసంగి స్తూ, 2016 ఎన్నికల్లో అధికారం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందుదొందేనని, ఆ పార్టీలతో కూటమి పెట్టుకుని పెద్ద తప్పు చేసినట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఇందుకు ఉదాహరణ లోక్ సభ ఎన్నికలేనన్నారు. ఆ ఎన్నికల్లో ఆ రెండు కూట ములకు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన కూటమి గణనీయమైన ఓటు బ్యాంక్‌ను కైవశం చేసుకుందని గుర్తు చేశారు. అలాగే, మార్పు అన్నది అటు కన్యాకుమారి నుంచి, ఇటు ధర్మపురి నుంచి బయలు దేరిందని పేర్కొన్నారు. స్థానాల్లో ప్రత్యామ్నాయ కూటమి గెలుపొందడం నిదర్శనంగా గుర్తు చేశారు. ధర్మపురిలో గెలిచామని, ఈ గెలుపు ప్రభంజనం 2016 ఎన్నికల్లోపు ప్రతిబంబించడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ జోస్యం చెప్పారు.
ఒరిగింది శూన్యం : పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు ప్రసంగిస్తూ, రాష్ట్రం నుంచి 37 మంది అన్నాడీఎంకే సభ్యులు పార్లమెంట్‌లో అడుగు పెట్టారని గుర్తు చేశారు. వారి ద్వారా తమిళులకు ఒరిగింది శూన్యమేనన్నారు. పార్లమెంట్‌లో తమిళుల వాణి ఊసే ఎత్తలేదని విమర్శించారు. తాను ఈలం తమిళుల సమస్యపై ప్రస్తావించడంతో పాటుగా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యానని గుర్తు చేశారు. చెన్నై జిల్లాలో ఇంత వరకు పీఎంకే గెలవలేదని, ఈ సారి తప్పని సరిగా ఇక్కడి నుంచి ప్రతినిధులు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అన్నారు. ఇందు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు ఇప్పటి నుంచి శ్రమించాల్సిన అవసరం ఉందని పిలుపు నిచ్చారు. ఈలం తమిళుల సమస్యను రాజకీయం చేయని ఒకే ఒక నేత రాందాసు మాత్రమేనని, మిగిలిన వాందరూ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. తమిళుల సంక్షేమ నినాదంతో ముందుకెళుతున్న పీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద పీట వేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.