సీట్లకు పట్టు
Published Wed, Feb 12 2014 3:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సీట్ల పందేరం కమలనాథులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒక రాజ్యసభతో పాటుగా తమకు పది లోక్‌సభ సీట్లు ఇస్తే దోస్తీకి రెడీ అన్న సంకేతాన్ని పీఎంకే పంపింది. తమకు పట్టున్న స్థానాలకు సైతం మిత్రులు పట్టుబడుతుండటంతో కమలనాథులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమిగా వెళ్లాలంటే ఇలాంటి చిక్కులు తప్పవని బీజేపీ గుర్తించి సర్దుబాటు చేయూలని భావిస్తోంది.
సాక్షి, చెన్నై : తమ నేతృత్వంలో కూటమికి బీజేపీ ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ కూటమిలోకి ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు, మక్కల్ దేశియ కట్చి, పుదియ నిధి కట్చి చేరాయి. పీఎంకే, డీఎండీకేలను తమ వైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. డీఎండీకే తమ చేతికి చిక్కకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంతో ఇక ఆ పార్టీతో మంతనాలు ముగించేద్దామన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చా రు. పీఎంకే ఆచితూచి అడుగులు వేసి చివరకు దోస్తీకి రెడీ అవుతోంది. అయితే, సీట్ల పందేరం చిక్కుల్లో పడే వేస్తోంది. రెండు రోజుల క్రితం వండలూరు వేదికగా జరిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కావడంతో కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పవనాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.ో తమకు పలాన అంటే, పలాన సీటు కావాలంటూ మిత్రులు పట్టుబడుతుండడంతో కమలనాథులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.
సీట్లకు పట్టు:
బంధం పదిలం కావడంతో సీట్ల పంపకాలపై బీజేపీ మిత్రులు దృష్టి కేంద్రీ కరించారు. తమకు ఏడంటే ఏడు సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌తో ఎండీఎంకే నేత వైగో చర్చల్లో ఉన్నారు. ఆ సీట్లు ఇచ్చేందుకు సానుకూలత బీజేపీలో ఉన్నా, అందులో కొన్ని స్థానాలు తమకు పట్టున్న నియోజకవర్గాలు కావడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఐజేకే ఏకంగా ఐదు సీట్లను కోరుతుండటం కమలనాథుల్ని విస్మయంలో పడేసినట్టు సమాచారం. ఈ పార్టీ నేత, ఎస్‌ఆర్‌ఎం అధినేత పచ్చముత్తు పారివేందన్‌కు ఆర్థిక బలం ఉన్నా, ఐదు సీట్లు ఆశించడంపై పెదవి విరుస్తున్నారు. ఆ పార్టీకి ఐదు సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కొంగునాడు తదితర పార్టీలు తలా రెండు సీట్లు ఆశిస్తున్నా, పీఎంకే పది సీట్లను, ఒక రాజ్య సభ సీటును కోరుతుండటం కమలనాథులను ఉక్కిరి బిక్కి రి చేస్తున్నట్టు సమాచారం. తాము పన్నెండు లేదా, పదమూడు సీట్లలో పోటీకి ముందుగానే నిర్ణయం తీసుకున్నా, మిత్రుల పట్టుతో తమ సీట్లకు గండి పడే ప్రమాదం ఉందన్న ఆందోళనను బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టున్న స్థానాల మీదే మిత్రులు కన్నేసి ఉండటంతో వారికి నచ్చ చెప్పేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సీట్ల పందేరం ఎక్కడ బెడిసి కొడుతుందో, ఇది కూటమి మీద ఎక్కడ ప్రభా వం చూపుతుందోనన్న ఆందోళన సైతం కమలనాథులు వెంటాడుతుండటం గమనార్హం. నాగర్ కోవిల్ నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, దక్షిణ చెన్నై నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్, అరక్కోణం నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు చక్రవర్తి పోటీకి ఉత్సాహాన్ని చూపుతున్నట్టు కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisement