నిషేధించాల్సిందే
- కదంతొక్కిన మహిళా లోకం
- మద్యానికి వ్యతిరేకంగా పీఎంకే నిరసన
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మద్య నిషేధం నినాదంతో ఏళ్ల తరబడి పీఎంకే ఉద్యమిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అధికార అన్నా డీఎంకే మినహా ప్రతి పక్షాలన్నీ వేర్వేరుగా మద్య నిషేధ బాటలో పయనిస్తున్నాయి. మద్య నిషేధ నినాదం రాష్ట్రంలో ఉద్యమం ఉప్పెనలా ఎగసి పడుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో మద్యనిషేధంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని బహిర్గతం చేయాలన్న డిమాండ్ బయలు దేరింది. ఇదే డిమాండ్‌తో పీఎంకే నేతృత్వంలో సోమవారం చెన్నైలో భారీ నిరసనకు పిలుపు నిచ్చారు. ఇందుకు జాతీయ స్థాయిలో మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ నేతృత్వం వహించారు. చేపాక్కం వేదికగా జరిగిన ఈ నిరసనకు తిరువళ్లువర్, కాంచీపురం, చెన్నైల నుంచి పీఎంకే మహిళా సేన కదం తొక్కింది.
మద్యం వద్దు
చేపాక్కం అతిథి గృహాల వద్ద జరిగిన నిరసనకు వేలాదిగా మహిళా లోకం తరలి రావడంతో ఆ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. అటువైపుగా వాహన సేవల్ని పూర్తిగా నిలుపుదల చేశారు. ఈ నిరసనలో పీఎంకే సీఎం అభ్యర్థి, ఎంపీ అన్భుమణి రాందాసు మట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని వింత ఇక్కడ సాగుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వమే మద్యం విక్రయాలను సాగించి ప్రజల జీవితాలతో చెలగాటమాడటం విచారకరంగా పేర్కొన్నారు. విద్యార్థులు, యువతీ యువకులు మద్యం మత్తులో రోడ్డులో వీరంగాలు సృష్టిస్తున్న ఘటనలు చూస్తుంటే, రాష్ట్రం ఎటెళ్తోన్నదో అన్న ఆందోళన కల్గుతున్నదన్నారు.
ఇందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ తీరేనని మండిపడ్డారు. ప్రజలకు విద్య, వైద్య, ఆరోగ్య, అభివృద్ధి పరంగా దోహద పడాల్సిన పాలకులు మద్యం రక్కసి ద్వారా వారీ జీవితాల్ని, కుటుంబాల్ని సర్వనాశనం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మద్యం ద్వారా ఆదాయం కోట్లాది రూపాయల మేరకు వస్తున్నదని ప్రభుత్వం పేర్కొనడం సిగ్గు చేటుఅని విమర్శించారు. మూడు దశాబ్దాలుగా మద్య నిషేధం నినాదంతో పీఎంకే ఉద్యమిస్తూ వస్తున్నదని, ఇందుకు ఫలితాలు త్వరలో చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కళ్లబొల్లి మాటల్ని పక్కన పెట్టి, అసెంబ్లీ వేదికగా మద్య నిషేధం నినాదంపై స్పష్టతను తెలియజేయాలన్నారు. నిషేధం లక్ష్యంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పీఎంకే అధ్యక్షుడు జికే.మణి, నాయకులు ఏకే మూర్తి, కేఎం శేఖర్, ఆర్ముగం, బాల తదితరులు పాల్గొన్నారు.