నిర్ణయం వారిదే!
సాక్షి, చెన్నై : సంప్రదింపులతో చర్చలు సాగాయని, ఇక నిర్ణయం వారి చేతుల్లో అంటూ పీఎంకే, డీఎండీకేలకు పొత్తు విషయంగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. తమ వెంట పన్నెండు పార్టీలు ఉన్నాయని, ఆ ఇద్దరు కలసి వస్తే బలం పెరిగినట్టేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ కమలంకు మద్దతు ప్రకటించారు. రాష్ర్టంలో అధికారం తమదే అన్నట్టుగా గతంలో ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు, ఇక మౌనముద్రతో ముందుకు సాగుతున్నారు. ప్రాంతీయ పార్టీలు షాక్ ఇచ్చినా, చివరి క్షణంలో తమతో కలసి వస్తాయన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు.
ప్రస్తుతానికి తమతో కలిసి వచ్చిన చిన్నా చితక పార్టీల్ని అక్కున చేర్చుకున్న బీజేపీ పెద్దలు, వారికి సీట్ల పంపకాల మీద దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పూర్తిగా నిమగ్నమయ్యారు. బుధవారం అఖిల భారత ముస్లిం మున్నేట్ర కళగం నేత సదర్ అబ్దుల్లా, ఇండియ మున్నేట్ర కల్వి కళగం నేత దేవనాదం, దక్షిణ భారత ఫార్వడ్ బ్లాక్ నేత తిరుమగన్‌లతో సీట్ల పంపకాల చర్చల్లో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా, తమ వెంట పన్నెండు పార్టీలు నడిచేందుకు సిద్ధమయ్యాయని ఆయన వివరించారు. బలమైన కూటమి ఏర్పాటు చేయాలన్న కాంక్షతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించామని, డీఎండీకే, పీఎంకేలతోనూ చర్చలు సాగాయని పేర్కొన్నారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం అవుతున్నదని, ఈనెలాఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజాహితం కాంక్షించే దిశగా ఈ మేనిఫెస్టో ఉండబోతోందని, కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ద్వారానే రాష్ర్ట సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యం అని తద్వారా ప్రజల్లోకి వెళ్లబోతున్నామన్నారు. డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు, చర్చలు సానుకూలంగానే సాగాయని, అయితే, నిర్ణయం అన్నది వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు.
వారి నిర్ణయాల మేరకు తుది నిర్ణయాన్ని బీజేపీ ప్రకటిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఇప్పటికే పలువురు నటీ మణులు, నెపోలియన్ వంటి నటులు బీజేపీలో చేరిన దృష్ట్యా, త్వరలో వారు అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకునేందుకు విజయకుమార్ సిద్ధమవుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం సాగించేందుకు విజయకుమార్ వ్యాఖ్యానించినట్టుగా కమలాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.