మళ్లీ తెరపైకి కెప్టెన్
చిత్ర పరిశ్రమలోనే కాదు రాజకీయాల్లోనూ కెప్టెన్‌గా పేరుగాంచిన నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటనపై దృష్టి సారించారు. ఇంతకు ముందు చిత్రపరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా రాణించిన విజయకాంత్ నడిగర్‌సంఘం అధ్యక్షుడిగా కొంత కాలం బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత రాజకీయరంగప్రవేశం చేసి డీఎండీకే పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే.
2011 శాసనసభ ఎన్నికల్లో 29 నియోజక వర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకుని ప్రతి పక్ష నేత స్థాయికి ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ను కాదు ఏకంగా కింగ్‌నే అవతానని ఆశించారు. అయితే సరైన ప్రణాళిక లేకుండా ఎన్నికల బరిలోకి దిగిన విజయకాంత్ పార్టీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే కాకుండా డిపాజిట్లనే కోల్పోయి ఇప్పుడు పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత విజయకాంత్ తన దృష్టిని నటనపై సారించారు.
ఆయన చివరిగా తన కొడుకు షణ్ముగపాండియన్‌ను హీరోగా పరిచయం చేసిన సహాబ్ధం చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.ఆ తరువాత ఎన్నికలకు రెండు నెలల ముందు తన కొడుకుతో కలిసి తమిళన్ ఎండ్రు సొల్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రం 10 రోజులు షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత ఎన్నికలు దగ్గర పడడంతో దాన్ని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ తుడుచుకుపోవడంతో ఇప్పుడు తమిళన్ ఎండ్రు సొల్ చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు.
ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొంటూ మన విజయం మరికొంత ఆలస్యం అవుతోంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. మనం అధికారాన్ని చేపడతాం. ప్రస్తుతం తాను తమిళన్ ఎండ్రు సొల్ చిత్రంపై దృష్టి సారిస్తున్నాను అంటూ ఆ చిత్ర ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో విజయకాంత్ రచయితగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.