మద్దతు వేట
సాక్షి, చెన్నై: శ్రీరంగం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రె ఫరెండంగా ఈ ఎన్నికలను మలచుకునేందుకు ఉరకలు తీస్తున్నాయి. డీఎండీకే, కాంగ్రెస్ మద్దతును కూడగట్టుకుని ఎన్నికల్లో గెలుపునకు డీఎంకే వ్యూహ రచనల్లో పడింది. డీఎండీకే, పీఎంకే మద్దతుతో అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాల్లో పడింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన శ్రీరంగం స్థానానికి ఉప ఎన్నిక రాజకీయ పక్షాల్లో ఉరుకులు పరుగులు తీయిస్తోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవశం చేసుకునేందుకు జయలలిత ఆదేశాలతో ఆ పార్టీ నేతలు, మంత్రులు నియోజకవర్గ బాట పట్టే పనిలో పడ్డారు.
తమ అభ్యర్థి వలర్మతి గెలుపు లక్ష్యంగా సుడిగాలి పర్యటనతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. శ్రీరంగం గెలుపుతో తమ అధినేత్రి జయలలిత ఏ తప్పూ చేయలేదని చాటే దిశగా అన్నాడీఎంకే శ్రేణులు పరుగులు తీస్తున్నారు. జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో వస్తున్న తొలి ఎన్నిక కావడంతో ఈ గెలుపును 2016 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మార్చుకునే పనిలో డీఎంకే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే, ఈ స్థానంలో అన్నాడీఎంకేను ఓడించి, ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద ఏ మేరకు ప్రజల్లో వ్యతిరేకత ఉందో తెలియజేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహ రచనల్లో ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే తమిళనాడులో తమ బలం పెరిగిందని నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టే పనిలో పడింది. అయితే, గెలుపు లక్ష్యంగా డీఎంకే, బీజేపీలు డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ ప్రదక్షిణలకు సిద్ధం కావడం గమనార్హం.
కీలకంగా విజయకాంత్ : ఈ ఉప ఎన్నిక బరిలో డీఎండీకే అధినేత విజయకాంత్ తన అభ్యర్థిని నిలబెట్టేది అనుమానమే. ఈ దృష్ట్యా, ఆ పార్టీ మద్దతును తమకు అనుకూలంగా మలచుకునేందుకు డీఎంకే, బీజే పీలు పరుగులు తీస్తున్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్ మద్దతుతోపాటుగా కాంగ్రెస్‌ను తమ వైపు తిప్పుకున్న పక్షంలో ఆ ఓటు బ్యాంక్ కలసి వస్తే గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమా డీఎంకే అధినేత కరుణానిధిలో నెలకొంది. పీఎంకే సైతం తమకు మద్దతు ఇస్తుందన్న ఆశాభావంతో తమ అభ్యర్థి ఆనంద్‌కు అండగా నిలవాలని ఇప్పటికే ప్రతి పక్షాలకు కరుణానిధి పిలుపు నిచ్చారు. మిగిలిన పక్షాల ఓట్లు తమ ఖాతాలో వేసుకోవడం సులభ మార్గమైనా విజయకాంత్ ఏ సమయంలో ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది.
ఈ దృష్ట్యా, ఆయన్ను ఇప్పుడే తమ వైపు తిప్పుకుని, అసెంబ్లీ ఎన్నికల కూటమికి మార్గం సుగమం చేసే విధంగా డీఎంకే వర్గాలు కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యూరట!. ఇక బీజేపీ విషయానికి వస్తే విజయకాంత్ మద్దతు రాబట్టడం లక్ష్యంగా కసరత్తుల్లో సాగుతున్నాయి. అయితే, బీజేపీ మీద విజయకాంత్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఆయన్ను శాంతింప చేసి ఆ పార్టీ మద్దతును చేజిక్కించుకునేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ మంతనాల్లో మునిగారు. విజయకాంత్‌తో సంప్రదింపులకు స్వయంగా తమిళిసై సిద్ధమవుతున్నారు. ఈ దృష్ట్యా, శ్రీరంగం ఉప ఎన్నిక మద్దతు వ్యవహారంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కీలకంగా మారడం విశేషం.