టాటా..బైబై
ఇక ఎవరి దారి వారిదే
త్వరలో కొత్త పొత్తులు
వాసన్ బహిరంగ ప్రకటన
తదుపరి కెప్టెన్ సమాయత్తం
వీసీకే, వామపక్షాలు కూడా
సంక్షేమ కూటమి శుభం కార్డు
ప్రజా సంక్షేమ కూటమికి టాటా.. బైబై చెప్పేందుకు అందులోని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఆ కూటమితో పొత్తు ముగిసిందంటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ వ్యాఖ్యానించారు. తదుపరి ఇదే వ్యాఖ్యను అందుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. ఆయన బాటలో తలా ఓ దారి అన్నట్టుగా వీసీకే, వామపక్షాలు నడిచేందుకు నిర్ణయించాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రజా సంక్షేమ కూటమి అడ్రస్సు గల్లంతైనట్టే.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామే అని జబ్బలు చరిచిన డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి ఫలితాలు చెంప పెట్టే. ఈ కూటమిలోని డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అందరి కన్నా,ఈ ఎన్నికల్లో భారీ నష్టాన్ని డీఎండీకే, సీపీఎం, సీపీఐలు చవిచూశాయి. ఇక, కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్ జీవం పోసిన సీకే వాసన్‌కు తొలి ఎన్నికలే పెద్ద షాక్. డీఎంకే గొడుగు నీడన రాజకీయ పయనం సాగించి ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరిన వీసీకేకు కోలుకోలేని దెబ్బ తప్పలేదు.
ఇక, ఎండీఎంకే అంటారా..?. గత ఎన్నికల్ని బహిష్కరించిన ఆ పార్టీకి, తాజా ఫలితాల ఓ లెక్కే కాదు. ఎన్నికల అనంతరం ఆ కూటమిలో బీటలు వారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అయితే, కూటమి కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో మాత్రం తమ కూటమిలో చీలికకు అవకాశం లేదని, ప్రజల కోసం ఒకే గళం, ఒకే నినాదంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ కూటమికి టాటా..బైబై అని స్పందించడంతో అదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు మిగిలిన పార్టీలు సిద్ధమయ్యాయి.
టాటా.. బైబై :
చెన్నైలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లాల నేతలతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సమాలోచించారు. ఇందులో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక టాటా గుడ్ బై అంటూ ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వరకు మాత్రమేనని ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాసన్ వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల సమయంలో తమ కంటూ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించామని గుర్తు చేశారు.
ఆ కూటమి ఆ ఎన్నికలతో ముగిసిందని, ఇక తమ పయనం బలోపేతం అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు వివరించారు. స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది తేల్చుతామని వ్యాఖ్యానించారు. సందర్భానుచితంగా, సమయానుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కొత్త పొత్తు ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు.
కెప్టెన్ కూడా :
వాసన్ అధికారికంగా ప్రకటించి కూటమి నుంచి బయటకు వెళ్లడంతో ఆ బాటను అనుసరించేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలతో సమీక్షను ముగించిన విజయకాంత్ ఇక, భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామన్న అధికారిక ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదే సమయంలో సమీక్షల సమయంలో నాయకుల అభిప్రాయాల్ని విన్న విజయకాంత్, వారి అభిష్టానికి అనుగుణంగా నడచుకునే విధంగా వ్యవహరించడమే కాకుం డా, కొన్ని సందర్భాల్లో తిరగబడే విధంగా వ్యాఖ్యల్ని సంధించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన నాయకులకు దూకుడుకు కల్లెం వేసే రీతిలో అవసరం అయితే, పార్టీని రద్దు చేయడం, లేదా మరో పార్టీలోకి విలీనం చేయడానికి తాను వెనుకాడబోనంటూ విజయకాంత్ హెచ్చరించి ఉండటం గమనించాల్సిన విషయమే.
ఇక, ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమీ లేని దృష్ట్యా, మళ్లీ డీఎంకేకు దగ్గరయ్యే విధంగా వీసీకే నేత తిరుమా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే రీతిలో డీఎంకే అధినేత కరుణానిధికి అనుకూల వ్యాఖ్యల్ని అందుకుని ఉండటం ఆలోచించాల్సిందే. అదే విధంగా వామపక్షాలు సైతం కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు మాత్రమే ఇక కలిసి నడిచే రీతిలో కార్యాచరణను సీపీఎం, సీపీఐ వర్గాలు సిద్ధం చేసి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. స్థానిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు కలిసి కట్టుగా సాగితే, తమకు పట్టున్నచోట్ల గెలుపు బావుటాకు మార్గం సుగమం అవుతుందన్న ధీమాతో ఆ పార్టీల వర్గాలు ఉండడం విశేషం.