చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల కోసం అన్ని పార్టీల్లో కసరత్తులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కొత్త కూటమి ఏర్పాటుకు తెరలేపింది. వైగో నాయకత్వంలోని ఎండీఎంకే, డాక్టర్ రాందాస్ నేతృత్వంలోని పీఎంకేతో పొత్తు ఖరారైనట్లు వార్తలు అందాయి. రాష్ట్రంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ తిరుచ్చిలో నరేంద్ర మోడీ సభ, ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో విజయబావుటా ఎగురవేసిన తర్వాత పుంజుకుంది. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అనేక ప్రాంతీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించినా వామపక్షాలు జతకలిసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
2జీ స్పెక్ట్రం కేసు, శ్రీలంకలో ఈలం తమిళుల సమస్య తదితరాలతో కాంగ్రెస్‌కు దూరమైన డీఎంకే బీజేపీకి స్నేహ హస్తం ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితిలో ఉంది. ఇదిలా ఉండగా ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో నిర్వహించిన బీజేపీ ఉన్నత స్థాయి సమావేశంలో తమిళనాడులో పొత్తుల అంశంపై ప్రధానంగా చర్చ చేపట్టారు. ఇందులో పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్, అగ్రనేత అద్వానీ, మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కారి, అరుణ్‌జెట్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీఎంకే, పీఎంకేలతో పొత్తు ఖరారైనట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు సైతం బీజేపీ ఆహ్వానం పలుకుతోందని ఆ సమావేశం ప్రకటించింది. తమిళనాడుకు చెందిన ఒక ప్రాంతీయ పార్టీ నేత ఢిల్లీలో కొత్త పొత్తుల పనిలో మునిగితేలుతున్నట్లు సమాచారం. ఆయన చొరవతోనే బీజేపీ ఈ కొత్త పొత్తుల నిర్ణయానికి వచ్చిందని తెలిసింది.
బీజేపీ కోశాధికారి ఖండన
ఢిల్లీ సమావేశంలో తీసుకున్నట్లుగా చెబుతున్న ప్రాంతీయ పొత్తులను బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎస్‌ఆర్ శేఖర్ శుక్రవారం ఖండించారు. పొత్తులపై తమిళ మీడియాలో వచ్చిన కథనాలపై సాక్షి వివరణ కోరగా పొత్తులపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఎండీఎంకే, పీఎంకేలతో పొత్తు ఖరారైనట్లు రాష్ట్ర శాఖకు సమాచారం లేదన్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా అనేక పార్టీలతో చర్చలు జరపడం సహజమని, అంతమాత్రాన పొత్తు కుదిరినట్లు కాదని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ కొత్త కూటమి
Published Sat, Dec 14 2013 2:03 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement