సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశ ఎన్నికల చరిత్రలో మేనిఫెస్టోను ఒక ప్రజాశాసనంగా విడుదల చేసిన ఘనత పాట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)ది మాత్రమేనని ఆ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు పీఎంకే కూడా ఒక సాధారణ మేనిఫెస్టో విడుదల చేయడం లేదు, ఇది ప్రజల ఆకాంక్షలకు అద్దమని అభివర్ణించారు.రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూటములుగా ఏర్పడగా, ఒంటరిపోరుతో ధైర్యంగా రంగంలోకి దిగిన పీఎంకే శుక్రవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. వినూత్న రీతిలో మేనిఫెస్టో తొలి ప్రతిని మహిళా జర్నలిస్టు లక్ష్మీ సుబ్రమణియన్‌కు అందజేశారు.
రాందాస్ మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరిలోనే పీఎంకే తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగిన అన్బుమణి రాందాస్ ఆనాటి నుంచి ప్రజలను కలుస్తూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారని తెలిపారు. ఇలా ప్రజలతో మమేకమై ప్రభుత్వం నుంచి వారు ఏమి ఆశిస్తున్నారో తెలుసుకుని మేనిఫెస్టో సిద్ధం చేశామని చెప్పారు. ఇది కేవలం మేనిఫెస్టో, ఎన్నికల హామీలతో కూడిన బడ్జెట్ ఎంతమాత్రం కాదని అన్నారు. బడ్జెట్ రూపకల్పనలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారమని అన్నారు. తమిళనాడు ప్రగతి తమ మేనిఫెస్టోలో స్పష్టంగా గోచరిస్తుందని తెలిపారు.
చేనేతలు, పారిశ్రామిక వేత్తలు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు ఇలా ఏ ఒక్క కేటగిరిని విస్మరించలేదని అన్నారు. అన్బుమణి అందరినీ కలుసుకుని వారితో చేసుకున్న ఒప్పందం నుంచే తమ మేనిఫెస్టో ఆవిర్భవించిందని తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తొలుత సిద్ధం చేసిన మేనిఫెస్టోలో 96 అంశాలు మాత్రమే ఉండగా, ఈ తాజా మేనిఫెస్టో 144 అంశాలకు పెరిగిందని తెలిపారు. సంపూర్ణ మద్య నిషేధం, అవినీతి నిర్మూలన, వికలాంగుల సంక్షేమం, ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, మానవ హక్కుల పరిరక్షణ ఇలా అన్ని అంశాలను సృజించామని అన్నారు.
అలాగే ఉచిత, నాణ్యమైన, విధిగా విద్యాభ్యాసం చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే ఆకర్షణీయమైన ఉచితాల జోలికి పోకుండా ఆ నిధులను విద్యా ప్రయోజనాలకు వెచ్చిస్తామని తెలిపారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ద్వారా కోటి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని క్షేత్రస్థాయిలో చూపిస్తామని, మొత్తం 386 గ్రామపంచాయతీలకు సమ ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. విద్యుత్‌లోటును తీర్చి ప్రకాశవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
వీధి కుళాయిల్లో సైతం మినరల్ వాటర్ లభించేలా చర్యలు చేపడతామని అన్నారు. అన్ని అధికారాలు ప్రజలకే ఉండేలా పరిపాలనలో మార్పులు తీసుకువస్తామని తెలిపారు. పథకం అమలును సమీక్షించేందుకు వీలుగా అసెంబ్లీలో ఓ యాక్షన్ టేకన్ రిపోర్టు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న పీఎంకే ప్రభుత్వానికి ఇది ఒక కార్యాచరణ ప్రణాళికగా ఆయన అభివర్ణించా రు. పీఎంకే ప్రభుత్వం వల్ల అన్ని కోర్కెలు నెరవేరాయనే భావన ప్రజలకు కలుగుతుందనే ధీమాను వ్యక్తం చేశారు.
మద్యంబాబులకు జైలు శిక్ష: అన్బుమణి
తమ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే తొలి సంతకం సంపూర్ణ మద్య నిషేధంపైనేనని పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ హామీ ఇచ్చారు. మద్యం అమ్మకాలపై వెంటనే ఉక్కుపాదం మోపి సమూలంగా నిర్మూలిస్తామని తెలిపారు. చాటుమాటుగా మద్యం తాగేవారి గురించి ఫిర్యాదు చేసిన వారికి రూ.10వేలు బహుమానం, తాగిన వారికి ఆరు నెలల జైలు శిక్ష అని చెప్పారు.
తమ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి మద్యం నిషేధం పోరాటం చేస్తూ కేసులు కూడా పెట్టించుకుందని అన్నారు. అధికారంలో ఉన్నపుడు కిమ్మన కుండా ఉన్న జయలలిత నేడు ఎన్నికల వేళ మద్యం నిషేధం పాటపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఎన్నికలు అమ్మ వర్సెస్ అన్బుమణి అని సవాల్ చేశారు.
పీఎంకే మేనిఫెస్టో విడుదల
Published Sat, Apr 16 2016 2:39 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement