నరేంద్ర మోడీ మహానాడుకు పది లక్షల మంది సమీకరణ లక్ష్యంగా కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. వినూత్న రీతిలో ప్రచార సీడీలు రూపొందించారు.
పది లక్షలు లక్ష్యం
Published Fri, Feb 7 2014 2:44 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
నరేంద్ర మోడీ మహానాడుకు పది లక్షల మంది సమీకరణ లక్ష్యంగా కమలనాథులు ఉరకలు తీస్తున్నారు. వినూత్న రీతిలో ప్రచార సీడీలు రూపొందించారు. మహానాడు దిగ్విజయవంతానికి సన్నాహాలు శరవేగంగా సాగుతున్నా, పొత్తుల వ్యవహారం తేలేనా అన్న ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం మరో విడతగా పీఎంకే, డీఎండీకే శ్రేణులతో చర్చకు సన్నాహాల్లో ఉన్నారు. మహానాడుకు బస్సుల్లో మాత్రం జనాన్ని తరలించొద్దంటూ రవాణా శాఖ హుకుం జారీ చేసింది.స
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో తమ సత్తా చాటుకోవడం లక్ష్యంగా కమలనాథులు కసరత్తుల్లో ఉన్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా మెగా కూటమికి వ్యూహ రచనలు చేస్తున్నా, ఫలితం శూన్యం. ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడు పార్టీలు కలసి వచ్చి నా, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే, వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన పీఎంకేలు మాత్రం మెట్టు దిగడం లేదు. ఈ రెండు పార్టీల్ని తమ వెంట తిప్పుకుని, మోడీ నేతృత్వంలో శనివారం జరిగే మహానాడులో కూటమి ని ప్రకటించేందుకు కమలనాథులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించకుండా, దాట వేత ధోరణితో ముందుకెళ్తోంటే, పీఎంకే వర్గాలు అదిగో పొత్తు, ఇదిగో సీట్లు అన్నట్టు కాలయాపన చేస్తుండటం కమలనాథుల్లో ఆందోళనరేకెత్తిస్తున్నది.
ఒక్క రోజే గడవు: మోడీ నేతృత్వంలో వండలూరు వేదికగా జరిగే మహానాడుకు శుక్రవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. దీంతో ఆ రెండు పార్టీలతో మలి విడతగా చర్చలు జరపడంతో పాటుగా, భారీ జన సమీకరణ లక్ష్యంగా కమలం కూటమి కసరత్తుల్లో పడింది. ఎండీఎంకే, ఐజేకే, కొంగునాడుతో కలసి కమలనాథులు మహానాడు సక్సెస్‌కు పరుగులు తీస్తున్నారు. వంద ఎకరాల స్థలంలో జరుగుతున్న మహానాడుకు కనీసం రాష్ర్ట వ్యాప్తంగా పది లక్షల మందిని తరలించాలని కమలనాథులు కంకణం కట్టుకున్నారు.
ఆయా జిల్లాల నుంచి చెన్నై వైపుగా వచ్చే వాహనాల్ని తరలించేందుకు అధికారుల అనుమతులు పొందే పనిలో పడ్డారు. వ్యాన్లు, కార్లకు అనుమతి ఇస్తున్న అధికారులు, బస్సులకు బ్రేక్ వేయడానికి నిర్ణయించారు. మహానాడు వేదిక జాతీయ రహదారిలో ఉండటం, రాజధాని నగర ప్రవేశ మార్గంలో వేదిక ఉండటంతో బస్సులను అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు. వ్యాన్లు, కార్లను పార్కింగ్ చేయడానికి ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ పరిసరాలు, వండలూరు పరిసరాల్లో స్థలాలు ఉన్నా, బస్సుల్ని నిలపడం కష్టతరం అన్న విషయాన్ని అధికారులు గ్రహించారు. దీంతో బస్సుల్లో జనాన్ని తరలించేందుకు వీలు లేదంటూ రవాణా శాఖ అధికారులు నిరాకరించడం కమలనాథుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. బస్సుల్లో అరవై మందికి పైగా తరలించేందుకు వీలుండటంతో, ఎక్కడ జన సమీకరణకు అధికారుల ఆంక్షలు అడ్డు తగులుతాయోనన్న బెంగ వెంటాడుతోంది. మోడీ సభకు, మోడీ పర్యటించే ప్రాంతాల్లో కనివినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నం అయింది.
ప్రచార సీడీ: గుజరాత్‌లో మోడీ అభివృద్ధి గాథ, పీఎం పదవికి ఆయన అర్హుడేనని వివరిస్తూ పలు ప్రచార గీతాల్ని తిరువళ్లూరుకు చెందిన బీజేపీ నేతలు సిద్ధం చేశారు. ఈ ప్రచార సీడీలు గురువారం కమలాలయంలో విడుదల చేశారు. తొలి సీడీని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ విడుదల చేయగా, సీనియర్ నాయకుడు ఇల గణేశన్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా నాయకుడు తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.
కొంగునాడు నేత ఈశ్వరన్ బీజేపీ శ్రేణుల్ని కలుసుకున్నారు. మహానాడులో జన సమీకరణ, ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం మీడియాతో పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, కూటమిలోకి వచ్చే పార్టీలకు తాము ఎలాంటి నిబంధనలు పెట్టలేదని స్పష్టం చేశారు. డీఎండీకే, పీఎంకేలు తమ కూటమిలోకి వస్తాయన్న ఆశాభావంతో ఎదురు చూస్తున్నామన్నారు. మరో మారు ఆ పార్టీ వర్గాలతో చర్చించేందుకు సిద్ధం అవుతున్నామని పేర్కొన్నారు.
Advertisement
Advertisement