ఇప్పుడు రజనీకాంత్ వంతు
‘న్యాయం’కు వ్యతిరేక వ్యాఖ్య
కోర్టులో పిటిషన్
పీఎంకే తరపున దాఖలు
సాక్షి, చెన్నై : నిన్నగాక మొన్న సినీ రచయిత వైరముత్తును కోర్టుకు లాగితే నేడు కథానాయకుడు రజనీకాంత్‌ను టార్గెట్ చేశారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారంటూ పీఎంకే తరపున రాణిపేట ముని సిఫ్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖ లు అయింది. ఇటీవల న్యాయ లోకానికి వ్యతిరేకంగా సినీ రచయిత వైరముత్తు తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వైరముత్తుకు కోర్టు సమన్లు సైతం జారీ చేసింది. ఈ విచారణ ఓ వైపు సాగుతున్న సమయంలో ఇటీవల రజనీకాంత్ న్యాయమూర్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పీఎంకే నాయకుడు, న్యాయవాది జానకీరామన్ రాణిపేట మునిసిఫ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రజనీకాంత్‌పై పోలీసులు చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టుకు ఆ నాయకుడు విజ్ఞప్తి చేశాడు. ఇటీవల చీటికి మాటికీ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే వాళ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని పిటిషన్లను పరిశీలించిన న్యాయస్థానం ప్రచా రం కోసం దాఖలు చేస్తున్నట్టుందని అక్షింతలు వేయడంతో పాటుగా జరిమానాలు విధించిన సందర్భాలూ ఉన్నా యి.
ఈ పరిస్థితుల్లో అశేషాభిమాన లోకాన్ని కలిగి ఉన్న దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్‌కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలై ఉండటంతో ఆయన అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. జానకీరామన్ దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో సెప్టెంబరు పన్నెండో తేదీన చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ న్యాయలోకాన్ని, న్యాయమూర్తుల్ని కించపరిచే విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేశారని వివరించి ఉన్నారు.
దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టినా, ప్రజలు చెడ్డవాళ్లుగా మారినా, న్యాయమూర్తులు నిజాయితీతో వ్యవహరిస్తే దేశం బాగుంటుందని రజనీకాంత్ స్పందించడం బట్టి చూస్తే, న్యాయమూర్తులను ఆయన ఏ మేరకు కించపరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయంగా తొలుత రాణిపేట పోలీసులకు, తదుపరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, వారెవ్వరు చర్యలు తీసుకోని దృష్ట్యా కోర్టును ఆశ్రయించినట్టు తన పిటిషన్లు వివరించి ఉన్నారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిశీలించి, తదుపరి విచారణకు పరిగణించాల్సి ఉంది. దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.