జయను విడుదల చేయాలని చేస్తున్న నిరాహారదీక్షలో అన్నాడీఎంకే నేతల ప్రసంగంలో పీఎంకే నేత రాందాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆగ్రహించిన పీఎంకే నేతలు, అన్నాడీఎంకే
తిరువళ్లూరు: జయను విడుదల చేయాలని చేస్తున్న నిరాహారదీక్షలో అన్నాడీఎంకే నేతల ప్రసంగంలో పీఎంకే నేత రాందాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆగ్రహించిన పీఎంకే నేతలు, అన్నాడీఎంకే నేతలతో స్వల్ప ఘర్షణ పడ్డారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో సమస్య సద్దుమణిగింది. తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్ ప్రాంతంలో జయలలితను విడుదల చేయాలని కోరుతూ అన్నాడీఎంకే నేతలు నిరాహారదీక్షను ఉదయం 8 గంటల నుంచి నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా జయకు మద్దతుగా పలువు రు నేతలు ప్రసంగం చేశారు.
ఈ ప్రసంగంలో పీఎంకే అధ్యక్షుడు రాందాస్, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు ఏకవచనంతో సంభోదించా రు. దీంతో ఆగ్రహం చెందిన పీఎంకే నేతలు అన్నాడీఎంకే నేతలు నిరాహారదీక్ష చేస్తున్న స్థలం వద్దకు చేరుకుని జయకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరిని ఒకరు తోసుకుంటూ దాడులకు ప్రయత్నించడంతో పోలీసులకు ఇరు వర్గాలను శాంతింప చేయడం కష్టతరంగా మారింది. విషయాన్ని డీఎస్పీ చంద్రశేఖర్‌కు తెలపడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పీఎంకే నేతలను అక్కడి నుంచి పంపించి వేశారు. పీఎంకే, అన్నాడీఎంకే నేతల మధ్య దాదాపు మూడు గంటల పాటు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.