ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను పీఎంకే సిద్ధం చేసింది. 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన పీఎంకే
సాక్షి, చెన్నై : ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థుల జాబితాను పీఎంకే సిద్ధం చేసింది. 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసిన పీఎంకే అధినేత రాందాసు, ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ప్రయత్నాల్లో పడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ కూటములను మారుస్తూ వచ్చిన పీఎంకే అధినేత రాందాసు, ఈ సారి గతంలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కూటములను మారుస్తూ రావడంతో బలహీన పడడంతో, ఇక తమ బలాన్ని చాటుకునేందుకు ఒంటరి పయనానికి సిద్ధ పడ్డారు. అదే సమయంలో కొన్ని సామాజిక వర్గాల పార్టీల్ని కలుపుకుని ఓ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు.
తన కూటమి సీఎం అభ్యర్థిగా తనయుడు అన్భుమణి రాందాసును ప్రకటించేశారు. అన్ని పార్టీల కన్నా ముందుగా ఎన్నికల ప్రచారంలో పీఎంకే పరుగులు తీస్తోంది. ప్రజాకర్షణకు అన్భుమణి తీవ్రంగానే కుస్తీలు పడుతూ వస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల తరహాలో తమతో కలసి రావాలని బీజేపీ, పీఎంకే చుట్టూ తిరుగుతూ వస్తోంది. బీజేపీతో దోస్తీ కట్టడం కన్నా, తమతో చేతులు కలపాలని, అన్భుమణిని సీఎం అభ్యర్థిగా అంగీకరించాలన్న మెళికను రాందాసు పెట్టి ఉన్నారు.
దీంతో కమలం వర్గాలు ఆలోచనలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు తమతో కలిసి వచ్చినా, రాకున్నా, సరే తమ పయనం ఆగదన్నట్టుగా అభ్యర్థులు జాబితాను రాందాసు సిద్ధం చేశారు. తమకు బలం ఉన్న అన్ని నియోజవకవర్గాల్లో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసి పోటీకి రంగంలోకి దించనున్నారు. బీజేపీ నిర్ణయంతో తమకు పని లేదన్నట్టుగా ముందుగా 120 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి ఉన్నారు. ఆశావహుల్ని వచ్చిన దరఖాస్తుల మేరకు కొందర్ని, పార్టీ కోసం శ్రమిస్తూ వస్తున్న నాయకుల్ని ఆయా సీట్లకు ఎంపిక చేశారు. ఈ జాబితా తదుపరి మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టనున్నారు. తొలి జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు తగ్గ కసరత్తులతో రాందాసు ముందుకు సాగుతున్నారు.