జి.మాడుగుల (అల్లూరి సీతారామరాజు జిల్లా)/ కోనేరుసెంటర్ (కృష్ణాజిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన వ్యక్తి నుంచి 1,760 కిలోల గంజాయిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం పాడేరు ఏఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. జూన్1, 2023లో ఎండీఎస్, చెన్నై జోన్ యూనిట్ 13 ఎన్‌సీబీ కేసులో తమిళనాడుకు చెందిన సురేష్ 160 కిలోల గంజాయితో రాగమటన్‌పల్లి వేపనహీళి పోలీస్‌లకు పట్టుబడ్డాడు.
ఈ గంజాయిని పాడేరు ప్రాంత సుందరరావు వద్ద కొనుగోలు చేసినట్టు చెప్పాడు. చెన్నై నుంచి వచ్చిన బృందం పాడేరు వచ్చి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీ సూచనల మేరకు స్థానిక పోలీసులు పెదబయలు మండలం, ఇంజరి పంచాయతీ గిన్నెగరువు గ్రామానికి చెందిన సుందరరావు ఇంట్లో తనిఖీ చేయగా.. 1,760 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుంది. సుందరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ పట్టివేత..
అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు జిల్లాలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న మరో ముగ్గురు వ్యాపారులనూ అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ పి.జాషువా తన కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువ మండలం చత్వా గ్రామానికి చెందిన కొర్రా రాందాస్ అలియాస్ భట్టుభాయ్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ గంజాయి సరఫరా చేయడం మొదలెట్టాడు.
దీనిలో భాగంగా గుడివాడ, అవనిగడ్డ, ఘంటసాల తదితర ప్రాంతాలకు రాందాస్ గంజాయిని సరఫరా చేస్తుంటాడు. మచిలీపట్నంలో గంజాయి అమ్మకాలు సాగిస్తున్న బడుగు నాగరాజును పలుమార్లు పోలీసులు పట్టుకున్నారు. అతని నేర చరిత్రను పరిశీలించిన ఎస్పీ.. నాగరాజుతో పాటు గుడివాడకు చెందిన మందాల కిరణ్‌రాజు, పమిడిముక్కలకు చెందిన చీకుర్తి నాని అలియాస్ బీస్ట్‌పై పీడి యాక్టును అమలుపరిచి జైలుకు పంపారు.
పై ముగ్గురు పట్టుబడిన కేసులో రాందాస్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు తెలుసుకున్న ఎస్పీ జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా మచిలీపట్నంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానాస్పదంగా రాందాస్ కంటబడ్డాడు. వెంటనే పోలీసులు రాందాస్‌ను అదుపులోకి తీసుకుని బ్యాగు సోదా చేయగా పెద్ద మొత్తంలో గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
రాందాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తక్షణం అతని వద్ద గంజాయి కొనుగోలు చేసిన గుడివాడలో ఒకరిని, ఘంటసాలలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వారి నుంచి ఆరు కేజీల గంజాయి స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment