Sri Rama chandramurti
-
భక్తరామదాసు విగ్రహం ఇదిగో!
నేలకొండపల్లి శ్రీసీతారామచంద్రస్వామి భక్తుడు కంచర్ల గోపన్న (భక్త రామదాసు) విగ్రహం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఆలయ నిర్మాత రామదాసు ఎలా ఉండేవారు, ఆయన ఆహార్యం ఏమిటనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో కళాకారులు తమ ఉహాల మేరకు విగ్రహాలు, చిత్రాలు రూపొందించారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కంచర్ల గోపన్న నివాసంలో కొనసాగుతున్న ధ్యాన మందిరంలోని కాంస్య విగ్రహం, ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉన్న మరో విగ్రహాన్ని కళాకారులు తమ ఊహల మేరకు రూపొందించారు. ఈ క్రమంలో తాజాగా నేలకొండపల్లికి చెందిన పసుమర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో ఆవరణలోని రావిచెట్టు వద్ద ఉన్న ఓ విగ్రహాన్ని గుర్తించారు. దీంతో ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, కోకన్వినర్ కట్టా శ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం అది రామదాసు విగ్రహామేనని చెబుతూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ వద్ద వెలుగుచూసిన ఆ విగ్రహాన్ని ఎస్సై బి.సతీశ్ చేతుల మీదుగా రామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావుకు అప్పగించగా ధ్యానమందిరంలో ఏర్పాటు చేశారు. రామదాసు జయంతి ఉత్సవాల నాటికి ఈ విగ్రహం ప్రతిష్టాపనపై భద్రాచలం దేవస్థానం అధికారులు ప్రణాళిక రూపొందించాలని వారసులు కోరారు. విగ్రహం ఎలా ఉందంటే.. కాసెపోసి కట్టిన ధోవతి, పైబట్ట లేకుండా అర్ధనగ్నంగా.. అంజలి ముద్రతో మొన కిందికి పెట్టిన కత్తి, మీసాలు, తల వెనక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖతో విగ్రహం కనిపిస్తోంది. కుడి, ఎడమ భుజాలపై శంకుచక్రాలు ఉండడంతో వైష్ణవ భక్తునిగా తెలుస్తోంది. కాగా, ఈ విగ్రహం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్న, మాదన్నలది కాదని, వారి మేనల్లుడుభక్త రామదాసుదేనని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేషన్‌కు ఎలా చేరింది? నేలకొండపల్లిలో పాత సెంటర్‌గా పేరున్న రావిచెట్టు బజార్లో చాలా ఏళ్ల క్రితం పోలీస్‌స్టేషన్ ఉండేది. 1997లో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌కు పాత స్టేషన్ నుంచి ఫరి్నచర్, తాజాగా బయటపడిన విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ క్రమంలో విగ్రహాన్ని స్టేషన్ ఆవరణలోని రావి చెట్టు తొర్రలో భద్రపర్చగా ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోలేదు. అయితే, ఆ విగ్రహం పాత పోలీసుస్టేషన్‌కు ఎలా చేరింది? ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఎక్కడా రికార్డులు లేవని చెపుతున్నారు. -
నవ్వు చేటా? లక్ష్మణదేవర నవ్వు
నవ్వు ఎంత గొప్ప మందైనా.. కొన్ని పరిస్థితుల్లో అంతే నిషిద్ధమని పురాణాలు చెబుతున్నాయి. ‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనేందుకు పెద్దలు కూడా పలు ఉదాహరణలు ఇస్తూంటారు. వాటిల్లో ముఖ్యమైనవి.. ద్రౌపది నవ్వు. మయసభలో దుర్యోధనుడు జారిపడినప్పుడు ద్రౌపది నవ్విన నవ్వు.. అతడి అహాన్ని దెబ్బతీసింది. అనంతరం మాయద్యూతానికి, చివరకు కురుపాండవ యుద్ధానికి దారితీసిందని చెబుతారు. లక్ష్మణుడి నవ్వు.. శ్రీరాముడి కొలువులో కల్లోల్లాన్నే సృష్టించింది. ఆ కథ తెలియాలంటే ‘లక్ష్మణదేవర నవ్వు’ అనే పురాణగాథ తెలుసుకోవాల్సిందే. రావణవధ తర్వాత.. శ్రీరాముడు తన భార్య సీతమ్మతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాక జరిగిన కథ ఇది. ఆరుబయట బ్రహ్మాండమైన సభా వేదిక అతిరథులతో నిండిపోయింది. రాముడు రాజుగా కొలువుదీరున్న ఆ సభకు వేలాది వీరులు, సూరులు విచ్చేశారు. గద్దె మీద విభీషణుడు, లంకావాసులు, సుగ్రీవుడు, కిష్కింధాపురవాసులు, ఈశ్వరుడు, ఇంద్రాదులైన దేవతలు, అయోధ్యాపుర ప్రముఖులు కూర్చున్నారు. సభ మొత్తం గంభీరంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడు కిలకిలా నవ్వాడు. ఆ నవ్వుకు అంతా విస్తుపోయారు. ఎవరికివారు తమకు తోచిన అర్థాలను తీసుకోవడం మొదలుపెట్టారు. ‘జాలరివాళ్ల పుత్రిక గంగను నెత్తిన పెట్టుకున్నందుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తనలోని లోపాలను వెతుక్కుంటూ తల దించుకున్నాడు శివుడు. ‘శివుడి పెళ్లిలో కిందపడి నా నడము విరిగింది కదా.. ఆ గూనితో ఇక్కడికి వచ్చినందుకు నన్ను చూసి నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అవమానంగా తల దించుకున్నాడు జాంబవంతుడు. ‘నా అన్న వాలిని రామునిచే చంపించి, అన్న భార్యను నా భార్యగా చేసుకుని కన్నూ మిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నానని నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని తల దించుకున్నాడు సుగ్రీవుడు. ‘నా అన్న రావణాసురుడి ఆయువుపట్లను రహస్యంగా రాముడికి చెప్పి.. రావణవధకు ఓ రకంగా నేనే కారణం అయ్యాను.. ఇప్పుడు లంకారాజ్యానికి రాజునయ్యాను.. నా వెన్నుపోటు తీరుకు నవ్వాడా ఈ లక్ష్మణుడు’ అని మథనపడుతూ తల దించుకుంటాడు విభీషణుడు. ‘ఇంత బలవంతుడినైన నేను చిన్న వాడైన ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి దొరికినందుకు నన్ను చూసే నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని అల్లాడుతూ తల దించుకుంటాడు హనుమంతుడు. ‘కారడవిలో రావణాసురుడి చేత చిక్కిన నన్ను రాముడు తొడమీద కూర్చోబెట్టుకున్నందుకు.. ఒక్క క్షణం కూడా నా భర్తను చూడకుండా ఉండలేను అని చెప్పిన నేను.. ఆరు నెలలు రాముడు లేకుండా రావణలంకలో ఎలా ఉండగలిగానని వెటకారంగా నవ్వాడా ఈ లక్ష్మణుడు?’ అని సీతాదేవి తల దించుకుంటుంది. సీత ఇబ్బందిని మనోగతాన్ని ఎరిగిన రాముడు.. చిన్నబోతాడు. మొత్తానికీ ఆ సభలోని ఒక్కొక్కరూ ఒక్కోలా.. తమ లోపాలను.. తప్పులను.. అసమతుల్యాలను.. అస్పష్టతలను తలచుకుని మరీ అవమానంగా భావిస్తుంటారు. అయితే సభలో నెలకొన్న గందరగోళం గుర్తించిన రాముడు.. ఆవేశంగా తమ్ముడు లక్ష్మణుడ్ని ‘ఎందుకు నవ్వావ్?’ అంటూ నిలదీస్తాడు అందరి ముందే. దాంతో లక్ష్మణుడు తన నవ్వుకు అసలు కారణం చెబుతాడు. ‘మనం అరణ్యాలకు పోయినప్పుడు, ఆ పర్ణశాలలో నేను మీకు, వదినమ్మకు సేవ చేస్తూండగా, ఓ రాత్రి రెండు ఝాముల వేళలో నిద్రాదేవి ఏడుస్తూ నా దగ్గరకు వచ్చింది. సతిరూపంలో వచ్చిన ఆమెను ‘ఎందుకు ఏడుస్తున్నావ్?’ అని అడిగాను. అప్పుడు ఆమె.. ‘నేను నిద్రాదేవిని.. నన్ను మనుషులెవ్వరూ గెలవలేరు. కానీ నువ్వు నన్ను దరి చేరనివ్వడం లేదు’ అంది. దాంతో ఆమెకు నేను ముమ్మార్లు ప్రదక్షిణం చేసి.. ‘నేను మా అన్న, వదినలకు ఈ పర్ణశాలలో కాపలా ఉండాలి. అక్కడ అయోధ్యలో నా భార్య ఊర్మిళ ఒక్కర్తే నాకోసం తపిస్తూ ఉంది. ఆమెను రాత్రింబవళ్లు లేవకుండా ఆవహించు. మళ్లా నేను తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు నన్ను ఆవహిద్దువుగానీ’ అని చెప్పాను. ఆ మాట ప్రకారం.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిద్రాదేవి నన్ను ఈ సభలో ఆవహించినందుకు నాకు నవ్వొచ్చింది’’ అని సమాధానం ఇస్తాడు లక్ష్మణుడు నిద్ర మత్తులో తూలుతూ. పశ్చాత్తాపంతో తక్షణమే రాముడు... లక్ష్మణుడికి పక్క ఏర్పాటు చేయమని ఆజ్ఞాపిస్తాడట. ఏదేమైనా లక్ష్మణుడు నవ్వింది అతడి వ్యక్తిగతం. కానీ నలుగురు గంభీరంగా ఉన్నప్పుడు.. మహా సభ సమక్షంలో అతడు నవ్వడంతో.. ఎవరికి వారు తమ వ్యక్తిగతాన్ని తడుముకుంటూ.. అవమానంగా భావించారు. ఆ నవ్వుకు అర్థం తెలియక అల్లాడారు. అందుకే సందర్భోచితంగా మాత్రమే నవ్వాలని పెద్దలు చెబుతుంటారు. -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
దిలీపుడికి మాఘ మహిమ తెలిపిన విప్రుడు
ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడికి పూర్వీకుడైన దిలీప మహారాజు ఒకసారి మృగయా వినోదం కోసం సపరివారంగా అడవికి వెళ్లాడు. క్రూరమృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే గడిపాడు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలోని క్రూరమృగాలను వేటాడుతూ ముందుకు సాగుతున్నారు. నట్టడవిలో నీరు లేక మహారాజు దిలీపుడు సహా ఆయన పరివారానికి గొంతెండిపోయే పరిస్థితి ఏర్పడింది. వేటకు కొద్దిసేపు విరామమిచ్చి, పరివారమంతా జలాన్వేషణలో పడ్డారు. కొద్ది దూరం ముందుకు వెళ్లి చూడగా, అక్కడ ఒక సరోవరం కనిపించింది. భటులు తామరాకులను దొన్నెలుగా చేసి, వాటిలో నీరు సేకరించి దిలీప మహారాజుకు అందించారు. పరివారంలోని భటులు కూడా సరోవరంలోని నీరు తాగి సేదదీరారు. తర్వాత మరికాసేపు వేట కొనసాగించారు.అడవిలో క్రూరమృగాల సంచారం దాదాపుగా కనుమరుగైపోవడంతో దిలీపుడు ఇక వేట చాలించి, రాజధానికి వెళదామన్నాడు. పరివారానికి పురమాయించి, అప్పటి వరకు వేటాడిన మృగాల చర్మాలను ఒలిపించి, వాటిని రథాల మీదకు చేర్పించాడు. అందరూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలో తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, తోవలో బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతున్న ఒక విప్రుడు ఎదురయ్యాడు. ఆయనను చూడగానే, దిలీపుడు తన భద్రగజం పైనుంచి కిందకు దిగి, ఆ విప్రుడికి నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వచనం పలికాడు. ఆయన దిలీప మహారాజు ముఖాన్ని పరికించి, ‘ఈ మహారాజు గుణవంతుడిలా ఉన్నాడు. ఇతనికి ఏదైనా మేలు చేయాలి’ అని తలచాడు. ‘మహారాజా! శుభప్రదమైన ఈ మాఘమాసంలో సరోవరం వరకు వెళ్లి కూడా నువ్వు, నీ పరివారం స్నానం చేయకుండా తిరుగుముఖం పడుతున్నారేం? మాఘ మహాత్మ్యం నీకు తెలియదా?’ అని ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! కొద్దిరోజులుగా వేట సాగిస్తూ అడవిలోనే ఉండిపోయాం. మాఘమాస ఆగమనం గురించి బహుశా పురోహితులు చెప్పే ఉంటారు. నేను మరచి ఉంటాను. మన్నించండి. దయచేసి, నాకు మాఘ మహాత్మ్యాన్ని వివరించండి’ అని వినయంగా అడిగాడు దిలీపుడు. ‘మహారాజా! మీ కులగురువైన వశిష్ఠులవారు తరచు నీ వద్దకు వస్తూనే ఉంటారు కదా, ఆయన వద్ద మాఘ మహాత్మ్యం గురించి తెలుసుకో. ఇప్పుడు నేను సంధ్యవార్చుకోవడానికి పోతున్నాను’ అని చెప్పాడు విప్రుడు.రాజధానికి చేరుకున్న దిలీపుడు మర్నాడు వేకువనే నిద్రలేచి, స్నానాదికాలు కావించుకుని, కొద్దిమంది పరివారంతో వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! ఒక విప్రుని ద్వారా మాఘ మహాత్మ్యాన్ని గురించి విన్నాను. మీ వద్ద ఎన్నో పురాణేతిహాసాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మాఘ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి ఎరుకపరచగలరు’ అని కోరాడు. ‘దిలీపా! మాఘ మహాత్మ్యాన్ని వర్ణించడం నిజానికి నాకు కూడా సాధ్యం కాదు. నీకు సులభగ్రాహ్యంగా ఉండేలా మాఘ మహాత్మ్యాన్ని చెబుతాను. ముందుగా వ్యాఘ్రముఖుడైన గంధర్వుని కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పాడు: వింధ్యపర్వత ప్రాంతంలోను, రేవా నదీ పరివాహక పరిసరాల్లోను ఒకసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. భృగు మహర్షి అంతటి వాడు కూడా ఆ కరవును తట్టుకోలేక అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నాడు. కైలాస పర్వతానికి సమీపంలోని ఒక కొండ మీద ఆయన తపస్సు చేసుకోసాగాడు.ఒకనాడు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుండగా, ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చాడు. అతడు వ్యాఘ్రముఖుడు. భృగుమహర్షికి నమస్కరించి, అతడు తన దీనగాథను వినిపించాడు.‘మహర్షీ! నాకు ఈ పులిముఖం ఎందుకు కలిగిందో తెలియడం లేదు. నా భార్య రూపవతి, గుణవతి, మహాసాధ్వి. నా వికృతరూపం కారణంగా నాతో పాటు ఆమె కూడా అంతులేని మనోవ్యధ అనుభవిస్తోంది. తపస్సంపన్నులైన మీరే నా కష్టాన్ని తీర్చగలరు’ అని ప్రాధేయపడ్డాడు.‘నాయనా! పాపం, దారిద్య్రం, దురదృష్టం మనుషులను పీడిస్తాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే, అందుకు మాఘస్నానమే తగిన తరుణోపాయం. అదృష్టవశాత్తు ఇది మాఘమాసం. వెంటనే నువ్వు భార్యా సమేతంగా నిష్ఠగా భక్తిశ్రద్ధలతో మాఘస్నానం ఆచరించు. నీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది’ అని ధైర్యం చెప్పాడు భృగు మహర్షి. మహర్షి వాక్కుపై నమ్మకంతో ఆ గంధర్వుడు సమీపంలోనే పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో భార్యా సమేతంగా స్నానమాచరించాడు. స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, గంధర్వుడికి వికృతమైన పులిముఖం మాయమై, అందమైన మానవ యువకుడి ముఖం వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ మార్పుతో గంధర్వ దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి. వారిద్దరూ హుటాహుటిన భృగు మహర్షి చెంతకు చేరుకుని, ఆయన పాదాల మీద పడ్డారు. ‘మహర్షీ! ఎంతో దుష్కరమైన బాధ నుంచి మమ్మల్ని సునాయాసంగా గట్టెక్కించారు. మీ మేలు జన్మజన్మలకు మరువలేము’ అంటూ ఆయనను వేనోళ్ల స్తుతించారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి సాగనంపాడు. -సాంఖ్యాయన -
రావులపాలెంలో భారీ చోరీ
- 3కిలోల వెండి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు రావులపాలెం(తూర్పుగోదావరి జిల్లా) తూర్పుగోదావ రి జిల్లా రావులపాలెం గ్రామం వేణుగోపాలస్వామి ఆలయం వీధిలోని ఒక ఇంట్లో మంగళవారం వేకువజామున చోరీ జరిగింది. వైద్యఆరోగ్యశాఖలో ఎంపీహెచ్‌ఓగా పనిచేస్తున్న కొత్తగుంట శ్రీరామచంద్రమూర్తికి ఇటీవల జరిగిన ప్రమాదంలో కాలు ఫ్రాక్చరైంది. దాంతో అమలాపురం సమీపంలోని కోటుపల్లెలోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఈ నేపధ్యంలో ఇంటికి తాళం వేసిఉండటాన్ని గమనించిన దొంగలు మంగళవారం వేకువజామున తలుపులు పగులగొట్టి బీరువాలోని 3 కిలోల వెండి వస్తువులు, ఆరు కాసుల బంగారు నగలు , ఎల్ఈడీ టీవీ దోచుకెళ్లారు. తలుపులు తెరిచిఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు శ్రీరామచంద్రమూర్తికి సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి జరిగిన చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాదు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించారు.