ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడికి పూర్వీకుడైన దిలీప మహారాజు ఒకసారి మృగయా వినోదం కోసం సపరివారంగా అడవికి వెళ్లాడు. క్రూరమృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే గడిపాడు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలోని క్రూరమృగాలను వేటాడుతూ ముందుకు సాగుతున్నారు. నట్టడవిలో నీరు లేక మహారాజు దిలీపుడు సహా ఆయన పరివారానికి గొంతెండిపోయే పరిస్థితి ఏర్పడింది.
వేటకు కొద్దిసేపు విరామమిచ్చి, పరివారమంతా జలాన్వేషణలో పడ్డారు. కొద్ది దూరం ముందుకు వెళ్లి చూడగా, అక్కడ ఒక సరోవరం కనిపించింది. భటులు తామరాకులను దొన్నెలుగా చేసి, వాటిలో నీరు సేకరించి దిలీప మహారాజుకు అందించారు. పరివారంలోని భటులు కూడా సరోవరంలోని నీరు తాగి సేదదీరారు. తర్వాత మరికాసేపు వేట కొనసాగించారు.అడవిలో క్రూరమృగాల సంచారం దాదాపుగా కనుమరుగైపోవడంతో దిలీపుడు ఇక వేట చాలించి, రాజధానికి వెళదామన్నాడు. పరివారానికి పురమాయించి, అప్పటి వరకు వేటాడిన మృగాల చర్మాలను ఒలిపించి, వాటిని రథాల మీదకు చేర్పించాడు. అందరూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు.
దిలీపుడు, ఆయన పరివారం అడవిలో తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, తోవలో బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతున్న ఒక విప్రుడు ఎదురయ్యాడు. ఆయనను చూడగానే, దిలీపుడు తన భద్రగజం పైనుంచి కిందకు దిగి, ఆ విప్రుడికి నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వచనం పలికాడు. ఆయన దిలీప మహారాజు ముఖాన్ని పరికించి, ‘ఈ మహారాజు గుణవంతుడిలా ఉన్నాడు. ఇతనికి ఏదైనా మేలు చేయాలి’ అని తలచాడు.
‘మహారాజా! శుభప్రదమైన ఈ మాఘమాసంలో సరోవరం వరకు వెళ్లి కూడా నువ్వు, నీ పరివారం స్నానం చేయకుండా తిరుగుముఖం పడుతున్నారేం? మాఘ మహాత్మ్యం నీకు తెలియదా?’ అని ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! కొద్దిరోజులుగా వేట సాగిస్తూ అడవిలోనే ఉండిపోయాం. మాఘమాస ఆగమనం గురించి బహుశా పురోహితులు చెప్పే ఉంటారు. నేను మరచి ఉంటాను. మన్నించండి. దయచేసి, నాకు మాఘ మహాత్మ్యాన్ని వివరించండి’ అని వినయంగా అడిగాడు దిలీపుడు.
‘మహారాజా! మీ కులగురువైన వశిష్ఠులవారు తరచు నీ వద్దకు వస్తూనే ఉంటారు కదా, ఆయన వద్ద మాఘ మహాత్మ్యం గురించి తెలుసుకో. ఇప్పుడు నేను సంధ్యవార్చుకోవడానికి పోతున్నాను’ అని చెప్పాడు విప్రుడు.రాజధానికి చేరుకున్న దిలీపుడు మర్నాడు వేకువనే నిద్రలేచి, స్నానాదికాలు కావించుకుని, కొద్దిమంది పరివారంతో వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! ఒక విప్రుని ద్వారా మాఘ మహాత్మ్యాన్ని గురించి విన్నాను. మీ వద్ద ఎన్నో పురాణేతిహాసాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మాఘ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి ఎరుకపరచగలరు’ అని కోరాడు.
‘దిలీపా! మాఘ మహాత్మ్యాన్ని వర్ణించడం నిజానికి నాకు కూడా సాధ్యం కాదు. నీకు సులభగ్రాహ్యంగా ఉండేలా మాఘ మహాత్మ్యాన్ని చెబుతాను. ముందుగా వ్యాఘ్రముఖుడైన గంధర్వుని కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పాడు: వింధ్యపర్వత ప్రాంతంలోను, రేవా నదీ పరివాహక పరిసరాల్లోను ఒకసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. భృగు మహర్షి అంతటి వాడు కూడా ఆ కరవును తట్టుకోలేక అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నాడు.
కైలాస పర్వతానికి సమీపంలోని ఒక కొండ మీద ఆయన తపస్సు చేసుకోసాగాడు.ఒకనాడు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుండగా, ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చాడు. అతడు వ్యాఘ్రముఖుడు. భృగుమహర్షికి నమస్కరించి, అతడు తన దీనగాథను వినిపించాడు.‘మహర్షీ! నాకు ఈ పులిముఖం ఎందుకు కలిగిందో తెలియడం లేదు. నా భార్య రూపవతి, గుణవతి, మహాసాధ్వి. నా వికృతరూపం కారణంగా నాతో పాటు ఆమె కూడా అంతులేని మనోవ్యధ అనుభవిస్తోంది.
తపస్సంపన్నులైన మీరే నా కష్టాన్ని తీర్చగలరు’ అని ప్రాధేయపడ్డాడు.‘నాయనా! పాపం, దారిద్య్రం, దురదృష్టం మనుషులను పీడిస్తాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే, అందుకు మాఘస్నానమే తగిన తరుణోపాయం. అదృష్టవశాత్తు ఇది మాఘమాసం. వెంటనే నువ్వు భార్యా సమేతంగా నిష్ఠగా భక్తిశ్రద్ధలతో మాఘస్నానం ఆచరించు. నీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది’ అని ధైర్యం చెప్పాడు భృగు మహర్షి.
మహర్షి వాక్కుపై నమ్మకంతో ఆ గంధర్వుడు సమీపంలోనే పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో భార్యా సమేతంగా స్నానమాచరించాడు. స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, గంధర్వుడికి వికృతమైన పులిముఖం మాయమై, అందమైన మానవ యువకుడి ముఖం వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ మార్పుతో గంధర్వ దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి.
వారిద్దరూ హుటాహుటిన భృగు మహర్షి చెంతకు చేరుకుని, ఆయన పాదాల మీద పడ్డారు. ‘మహర్షీ! ఎంతో దుష్కరమైన బాధ నుంచి మమ్మల్ని సునాయాసంగా గట్టెక్కించారు. మీ మేలు జన్మజన్మలకు మరువలేము’ అంటూ ఆయనను వేనోళ్ల స్తుతించారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి సాగనంపాడు. -సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment