maghamasam
-
దిలీపుడికి మాఘ మహిమ తెలిపిన విప్రుడు
ఇక్ష్వాకు వంశంలో శ్రీరాముడికి పూర్వీకుడైన దిలీప మహారాజు ఒకసారి మృగయా వినోదం కోసం సపరివారంగా అడవికి వెళ్లాడు. క్రూరమృగాలను వేటాడుతూ కొన్ని రోజులు అడవిలోనే గడిపాడు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలోని క్రూరమృగాలను వేటాడుతూ ముందుకు సాగుతున్నారు. నట్టడవిలో నీరు లేక మహారాజు దిలీపుడు సహా ఆయన పరివారానికి గొంతెండిపోయే పరిస్థితి ఏర్పడింది. వేటకు కొద్దిసేపు విరామమిచ్చి, పరివారమంతా జలాన్వేషణలో పడ్డారు. కొద్ది దూరం ముందుకు వెళ్లి చూడగా, అక్కడ ఒక సరోవరం కనిపించింది. భటులు తామరాకులను దొన్నెలుగా చేసి, వాటిలో నీరు సేకరించి దిలీప మహారాజుకు అందించారు. పరివారంలోని భటులు కూడా సరోవరంలోని నీరు తాగి సేదదీరారు. తర్వాత మరికాసేపు వేట కొనసాగించారు.అడవిలో క్రూరమృగాల సంచారం దాదాపుగా కనుమరుగైపోవడంతో దిలీపుడు ఇక వేట చాలించి, రాజధానికి వెళదామన్నాడు. పరివారానికి పురమాయించి, అప్పటి వరకు వేటాడిన మృగాల చర్మాలను ఒలిపించి, వాటిని రథాల మీదకు చేర్పించాడు. అందరూ తిరుగు ప్రయాణం ప్రారంభించారు. దిలీపుడు, ఆయన పరివారం అడవిలో తిరుగు ప్రయాణం సాగిస్తుండగా, తోవలో బ్రహ్మతేజస్సుతో వెలుగొందుతున్న ఒక విప్రుడు ఎదురయ్యాడు. ఆయనను చూడగానే, దిలీపుడు తన భద్రగజం పైనుంచి కిందకు దిగి, ఆ విప్రుడికి నమస్కరించాడు. విప్రుడు ఆశీర్వచనం పలికాడు. ఆయన దిలీప మహారాజు ముఖాన్ని పరికించి, ‘ఈ మహారాజు గుణవంతుడిలా ఉన్నాడు. ఇతనికి ఏదైనా మేలు చేయాలి’ అని తలచాడు. ‘మహారాజా! శుభప్రదమైన ఈ మాఘమాసంలో సరోవరం వరకు వెళ్లి కూడా నువ్వు, నీ పరివారం స్నానం చేయకుండా తిరుగుముఖం పడుతున్నారేం? మాఘ మహాత్మ్యం నీకు తెలియదా?’ అని ప్రశ్నించాడు.‘విప్రోత్తమా! కొద్దిరోజులుగా వేట సాగిస్తూ అడవిలోనే ఉండిపోయాం. మాఘమాస ఆగమనం గురించి బహుశా పురోహితులు చెప్పే ఉంటారు. నేను మరచి ఉంటాను. మన్నించండి. దయచేసి, నాకు మాఘ మహాత్మ్యాన్ని వివరించండి’ అని వినయంగా అడిగాడు దిలీపుడు. ‘మహారాజా! మీ కులగురువైన వశిష్ఠులవారు తరచు నీ వద్దకు వస్తూనే ఉంటారు కదా, ఆయన వద్ద మాఘ మహాత్మ్యం గురించి తెలుసుకో. ఇప్పుడు నేను సంధ్యవార్చుకోవడానికి పోతున్నాను’ అని చెప్పాడు విప్రుడు.రాజధానికి చేరుకున్న దిలీపుడు మర్నాడు వేకువనే నిద్రలేచి, స్నానాదికాలు కావించుకుని, కొద్దిమంది పరివారంతో వశిష్ఠాశ్రమానికి చేరుకున్నాడు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! ఒక విప్రుని ద్వారా మాఘ మహాత్మ్యాన్ని గురించి విన్నాను. మీ వద్ద ఎన్నో పురాణేతిహాసాలు తెలుసుకున్నాను. ఇప్పుడు మాఘ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలని వచ్చాను. దయచేసి ఎరుకపరచగలరు’ అని కోరాడు. ‘దిలీపా! మాఘ మహాత్మ్యాన్ని వర్ణించడం నిజానికి నాకు కూడా సాధ్యం కాదు. నీకు సులభగ్రాహ్యంగా ఉండేలా మాఘ మహాత్మ్యాన్ని చెబుతాను. ముందుగా వ్యాఘ్రముఖుడైన గంధర్వుని కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పాడు: వింధ్యపర్వత ప్రాంతంలోను, రేవా నదీ పరివాహక పరిసరాల్లోను ఒకసారి తీవ్రమైన కరవు ఏర్పడింది. భృగు మహర్షి అంతటి వాడు కూడా ఆ కరవును తట్టుకోలేక అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నాడు. కైలాస పర్వతానికి సమీపంలోని ఒక కొండ మీద ఆయన తపస్సు చేసుకోసాగాడు.ఒకనాడు భృగు మహర్షి అక్కడ తపస్సు చేసుకుంటుండగా, ఒక గంధర్వుడు భార్యాసమేతుడై వచ్చాడు. అతడు వ్యాఘ్రముఖుడు. భృగుమహర్షికి నమస్కరించి, అతడు తన దీనగాథను వినిపించాడు.‘మహర్షీ! నాకు ఈ పులిముఖం ఎందుకు కలిగిందో తెలియడం లేదు. నా భార్య రూపవతి, గుణవతి, మహాసాధ్వి. నా వికృతరూపం కారణంగా నాతో పాటు ఆమె కూడా అంతులేని మనోవ్యధ అనుభవిస్తోంది. తపస్సంపన్నులైన మీరే నా కష్టాన్ని తీర్చగలరు’ అని ప్రాధేయపడ్డాడు.‘నాయనా! పాపం, దారిద్య్రం, దురదృష్టం మనుషులను పీడిస్తాయి. వీటిని నివృత్తి చేసుకోవాలంటే, అందుకు మాఘస్నానమే తగిన తరుణోపాయం. అదృష్టవశాత్తు ఇది మాఘమాసం. వెంటనే నువ్వు భార్యా సమేతంగా నిష్ఠగా భక్తిశ్రద్ధలతో మాఘస్నానం ఆచరించు. నీ మనోవాంఛ తప్పక నెరవేరుతుంది’ అని ధైర్యం చెప్పాడు భృగు మహర్షి. మహర్షి వాక్కుపై నమ్మకంతో ఆ గంధర్వుడు సమీపంలోనే పర్వతం నుంచి ప్రవహిస్తున్న నదిలో భార్యా సమేతంగా స్నానమాచరించాడు. స్నానం ముగించి ఒడ్డుకు రాగానే, గంధర్వుడికి వికృతమైన పులిముఖం మాయమై, అందమైన మానవ యువకుడి ముఖం వచ్చింది. ఆశ్చర్యకరమైన ఈ మార్పుతో గంధర్వ దంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి. వారిద్దరూ హుటాహుటిన భృగు మహర్షి చెంతకు చేరుకుని, ఆయన పాదాల మీద పడ్డారు. ‘మహర్షీ! ఎంతో దుష్కరమైన బాధ నుంచి మమ్మల్ని సునాయాసంగా గట్టెక్కించారు. మీ మేలు జన్మజన్మలకు మరువలేము’ అంటూ ఆయనను వేనోళ్ల స్తుతించారు. భృగు మహర్షి వారిని ఆశీర్వదించి సాగనంపాడు. -సాంఖ్యాయన -
పర్వదినాల పుణ్యమాఘం
తెలుగు నెలలలో పదకొండవది మాఘం. పున్నమి చంద్రుడు మఖానక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ మాసానికి మాఘమాసమనే పేరొచ్చింది. ఎంతో మహిమాన్వితమైన ఈ మాసంలో శ్రీహరి కేవలం స్నానమాత్రం చేతనే ప్రసన్నుడై భక్తులను సర్వపాపాలనుంచి విముక్తి చేసి, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని మాఘమాస మహాత్మ్యం చెబుతోంది. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ మాసం ఎంతో పుణ్యప్రదమైనది. అంతేకాదు, ఈ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు మరే మాసంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. చదువుల తల్లి సరస్వతీ దేవి ప్రాదుర్భవించిందీ, సూర్యభగవానుడు తన గమన గతిన మార్చుకునే రథ సప్తమీ, భీష్మపితామహుడు స్వచ్ఛంద మరణాన్ని పొందిన భీష్మాష్టమి, మహాపూర్ణిమగా పేరొందిన మాఘపూర్ణిమ పర్వదినం... ఒకటేమిటి ఈ మాసమంతా పర్వదినాల మయమే. సూర్యోదయంలో శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను ధ్యానిస్తూ గంగాయమునాది పుణ్యతీర్థాలను తలచుకుంటూ స్నానం చేయాలి. మాఘశుద్ధ చతుర్థి, వరగణేశ చతుర్థి ఈరోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించడం వల్ల మహోత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈశ్వరుని మల్లెపూలతో పూజించడం వల్ల సంపదలు కలుగుతాయని స్కాందపురాణం చెబుతోంది. విశేష ఫలదాయకం ఒంటిపూట భోజనం మాఘమాసంలో ఒక పూట మాత్రం భోజనం చేసి రెండవపూట ఉపవాసం ఉన్న వారు మరు జన్మలో ఉన్నత కుల సంజాతులవడంతోపాటు, ధనవంతుల ఇంట జన్మిస్తారని పురాణోక్తి. మాఘపాదివారం మాఘమాసంలో ఆదివారం తలస్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, ఆవుపాల పాయసం నివేదిస్తే సంపదలు కలుగుతాయని ప్రతీతి. మాఘబహుళ చతుర్థి– సంకష్ట హరచతుర్థి ప్రతిమాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఆచరించే వ్రతానికి కష్టాలను పోగొట్టే శక్తి ఉంది. అలాగే మాఘమాసంలో వచ్చే బహుళ చవితినాడు చేసే వ్రతానికి విశేష ఫలాలను ప్రసాదించే శక్తి ఉంది. మహా మాఘి మాఘపూర్ణిమనాడు ఉదయాన్నే స్నానం చేసి విష్ణుభగవానుని విధిపూర్వకంగా పూజించాలి. పితరులకు తర్పణలు విడవాలి. రోగులు, వికలాంగులకు నువ్వులు, కంబళి, పత్తి, బెల్లం, నెయ్యి, కుడుములు, పాదరక్షలు, పండ్లు, అన్నం, బంగారం, వెండి మొదలైనవి దానం చేస్తే అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయి. వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. మహా శివరాత్రి విష్ణుప్రీతికరమైన మాఘమాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది. ఈ దినాన ప్రత్యూష కాలంలో నదిలోగాని, తటాకంలోగాని, కాలువలోగాని, బావిలోగాని కనీసం కుళాయినీటిలోగాని తలారా స్నానం చేసి పరమేశ్వరుని మహన్యాస పూర్వక రుద్రనమక చమకాలతోనూ అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజించాలి. పితృతర్పణాల అమావాస్య ఈరోజు పితృదేవతలకు విడిచే తర్పణాలు పితరులకు సంతృప్తినిస్తాయి. కాబట్టి ఈ అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణలు విడిస్తే వారికి ఉత్తమగతులు కలగడం ద్వారా ఇహలోకంలోని వారి వారసులకు శాంతి, సౌఖ్యం లభిస్తాయి. విశేష ఫలాలనిచ్చే దానాలు మధుప్రీతికరమైన మాఘమాసంలో వస్త్రాలు, కంబళ్లు, గొడుగులు, తిలలు, ఉసిరికలు, చెరుకు పానకం, దానం చేస్తే చాలా మంచిది. అన్నదానం అనంతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. వీలయిన కొన్నింటినైనా పాటించి, పుణ్యబలాన్ని పొందాలని, ఈ మాఘమాసం అందరికీ శుభఫలాలను ప్రసాదించాలనీ కోరుకుందాం. -
మాఘమాసం ముంచుకొస్తుంది
28 నుంచి ప్రారంభం రత్నగిరిపై భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు దేవస్థానం అధికారులు, పండితుల సమావేశంలో నిర్ణయం ఫిబ్రవరి మూడో తేదీన రథసప్తమి, ఏడున భీష్మ ఏకాదశి 11న మాఘపౌర్ణిమ, 22న బహుళ ఏకాదశి అన్నవరం : పవిత్ర మాఘమాసం ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతుండడంతో సత్యదేవుని ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ప్రధానంగా ఫిబ్రవరి ఏడో తేదీన భీష్మ ఏకాదశి పర్వదినం సందర్బంగా సత్యదేవుని దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మాఘమాస ఏర్పాట్లపై చర్చించేందుకు దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు మంగళవారం దేవస్థానం అధికారులతో సమావేశమయ్యారు. మాఘమాసంలో జరిగే వివాహాలకు హాజరయ్యే వారి కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చలు జరిపారు. సమావేశంలో దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, వేదపండితులు, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, గొర్తి సుబ్రహ్మణ్య ఘనాపాఠీ, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, స్పెషల్గ్రేడ్ వ్రతపురోహిత సూపర్వైజర్లు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, ఆలయ సూపరింటెండెంట్ కే కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మాఘమాసంలో వచ్చే పర్వదినాలు...దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు ఫిబ్రవరి మూడో తేదీ రథసప్తమి రోజు న ఉదయం తొమ్మిది గంటలకు కొండదిగువన పవర్హౌస్ వద్ద సూర్యనమస్కారాల కార్యక్రమం నిర్వహిస్తారు. · ఏడో తేదీ భీష్మ ఏకాదశి రోజున సత్యదేవుని సన్నిధికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేయనున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు సత్యదేవుని సుప్రభాతసేవ, 2 : 30 గంటలకు వ్రతాల నిర్వహణ ప్రారంభిస్తారు. ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెండి పల్లకీపై సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగిస్తారు. రాత్రి ఏడు గంటల నుంచి కొండదిగువన గరుడ వాహనం మీద స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. · పదో తేదీ మాఘపౌర్ణమి రోజున తెల్లవారు నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు, వ్రతాల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఆరోజు శుక్రవారం పర్వదినం కావడంతో శ్రీవనదుర్గ ఆలయంలో చండీ హోమం, పౌర్ణమి కావడంతో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. · 22న బహుళ ఏకాదశి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు, వ్రతాల నిర్వహణ ప్రారంభిస్తారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆలయప్రాంగణం చుట్టూ వెండి రథంపై సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగిస్తారు. రాత్రికి గ్రామంలో సత్యదేవుడు, అమ్మవార్లను పల్లకీలో ఊరేగిస్తారు.