తెలుగు నెలలలో పదకొండవది మాఘం. పున్నమి చంద్రుడు మఖానక్షత్రంలో ప్రవేశించడం వల్ల ఈ మాసానికి మాఘమాసమనే పేరొచ్చింది. ఎంతో మహిమాన్వితమైన ఈ మాసంలో శ్రీహరి కేవలం స్నానమాత్రం చేతనే ప్రసన్నుడై భక్తులను సర్వపాపాలనుంచి విముక్తి చేసి, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని మాఘమాస మహాత్మ్యం చెబుతోంది.
విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ మాసం ఎంతో పుణ్యప్రదమైనది. అంతేకాదు, ఈ మాసంలో ఉన్నన్ని పర్వదినాలు మరే మాసంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. చదువుల తల్లి సరస్వతీ దేవి ప్రాదుర్భవించిందీ, సూర్యభగవానుడు తన గమన గతిన మార్చుకునే రథ సప్తమీ, భీష్మపితామహుడు స్వచ్ఛంద మరణాన్ని పొందిన భీష్మాష్టమి, మహాపూర్ణిమగా పేరొందిన మాఘపూర్ణిమ పర్వదినం... ఒకటేమిటి ఈ మాసమంతా పర్వదినాల మయమే.
సూర్యోదయంలో శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను ధ్యానిస్తూ గంగాయమునాది పుణ్యతీర్థాలను తలచుకుంటూ స్నానం చేయాలి. మాఘశుద్ధ చతుర్థి, వరగణేశ చతుర్థి ఈరోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గణపతిని పూజించడం వల్ల మహోత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈశ్వరుని మల్లెపూలతో పూజించడం వల్ల సంపదలు కలుగుతాయని స్కాందపురాణం చెబుతోంది.
విశేష ఫలదాయకం ఒంటిపూట భోజనం
మాఘమాసంలో ఒక పూట మాత్రం భోజనం చేసి రెండవపూట ఉపవాసం ఉన్న వారు మరు జన్మలో ఉన్నత కుల సంజాతులవడంతోపాటు, ధనవంతుల ఇంట జన్మిస్తారని పురాణోక్తి.
మాఘపాదివారం
మాఘమాసంలో ఆదివారం తలస్నానం చేసి, సూర్యభగవానుని పూజించి, ఆవుపాల పాయసం నివేదిస్తే సంపదలు కలుగుతాయని ప్రతీతి. మాఘబహుళ చతుర్థి– సంకష్ట హరచతుర్థి ప్రతిమాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఆచరించే వ్రతానికి కష్టాలను పోగొట్టే శక్తి ఉంది. అలాగే మాఘమాసంలో వచ్చే బహుళ చవితినాడు చేసే వ్రతానికి విశేష ఫలాలను ప్రసాదించే శక్తి ఉంది.
మహా మాఘి
మాఘపూర్ణిమనాడు ఉదయాన్నే స్నానం చేసి విష్ణుభగవానుని విధిపూర్వకంగా పూజించాలి. పితరులకు తర్పణలు విడవాలి. రోగులు, వికలాంగులకు నువ్వులు, కంబళి, పత్తి, బెల్లం, నెయ్యి, కుడుములు, పాదరక్షలు, పండ్లు, అన్నం, బంగారం, వెండి మొదలైనవి దానం చేస్తే అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయి. వారికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.
మహా శివరాత్రి
విష్ణుప్రీతికరమైన మాఘమాసంలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం మహాశివరాత్రి ఈ మాసంలోనే వస్తుంది. ఈ దినాన ప్రత్యూష కాలంలో నదిలోగాని, తటాకంలోగాని, కాలువలోగాని, బావిలోగాని కనీసం కుళాయినీటిలోగాని తలారా స్నానం చేసి పరమేశ్వరుని మహన్యాస పూర్వక రుద్రనమక చమకాలతోనూ అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజించాలి.
పితృతర్పణాల అమావాస్య
ఈరోజు పితృదేవతలకు విడిచే తర్పణాలు పితరులకు సంతృప్తినిస్తాయి. కాబట్టి ఈ అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణలు విడిస్తే వారికి ఉత్తమగతులు కలగడం ద్వారా ఇహలోకంలోని వారి వారసులకు శాంతి, సౌఖ్యం లభిస్తాయి.
విశేష ఫలాలనిచ్చే దానాలు
మధుప్రీతికరమైన మాఘమాసంలో వస్త్రాలు, కంబళ్లు, గొడుగులు, తిలలు, ఉసిరికలు, చెరుకు పానకం, దానం చేస్తే చాలా మంచిది. అన్నదానం అనంతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. వీలయిన కొన్నింటినైనా పాటించి, పుణ్యబలాన్ని పొందాలని, ఈ మాఘమాసం అందరికీ శుభఫలాలను ప్రసాదించాలనీ కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment