శ్వేతపత్రం విడుదల చేయాలి
♦ హామీల అమలుపై షబ్బీర్‌అలీ డిమాండ్
♦ సర్కారు ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా
సాక్షి, హైదరాబాద్: గత ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు, అమలైన కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు టి.జీవన్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో కలసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసినట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం పూర్తిగా అబద్ధమన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు, ఉత్సవాలు చేయడం తప్ప అభివృద్ధి జరగలేదన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం అంతా రాష్ర్ట అవతరణ ఉత్సవాల ఏర్పాట్లులో మునిగిపోయిందన్నారు. తీవ్రమైన కరువులో ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఉత్సవాల పేరిట కాలయాపన చేస్తున్నారని షబ్బీర్‌అలీ ఆరోపించారు. భౌగోళిక పరిస్థితులు, జనాభా, మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయంగా కొత్త జిల్లాలను ఏర్పాటుచేయాలని కోరారు. దీనికోసం అన్ని పార్టీలను, నిపుణులను సంప్రదించాలని సూచించారు.
ఇళ్లకు నిధులేవీ?: జీవన్‌రెడ్డి
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి నిధులు ఇవ్వకుండా ఎలా పూర్తిచేస్తారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఒక ఇంటికి కేవలం రూ.5.40 లక్షలను కేటాయించారని, వీటితో పూర్తిచేయడం సాధ్యంకాదని అన్నారు. వచ్చే మార్చిలోగా 2 లక్షల ఇళ్లను నిర్మించి పాపాలను కడిగేసుకోవాలని సూచించారు.
రహస్య ఎజెండా: పొంగులేటి
ఆర్డీఎస్ విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలను పెంచడం వెనక టీఆర్‌ఎస్, టీడీపీల రహస్య ఎజెండా ఉందని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. నదీ జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకుండా ఎందుకు జఠిలం చేస్తున్నారని ప్రశ్నించారు.