నేరమే అధికారమై..! | Vardelli Murali Article Pegasus Spyware Chandrababu TDP | Sakshi
Sakshi News home page

నేరమే అధికారమై..!

Published Sun, Mar 20 2022 12:23 AM | Last Updated on Sun, Mar 20 2022 7:43 AM

Vardelli Murali Article Pegasus Spyware Chandrababu TDP - Sakshi

నేరమే అధికారమై నేరం చేస్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడే అన్నాడొక మహానుభావుడు. నేరమే అధికారమై నేరం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఒకానొక పాపిష్టి ఘటన ఇంకా మన జ్ఞాపకాల్లో సజీవంగానే నిలిచి ఉన్నది. ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ’! అధికార పీఠమెక్కిన నేరస్వరానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన ఆడియో!! ఆ కంఠస్వరం అక్షరాలా ‘ఆయన’దేనని ఆడియోను పరీక్షించిన ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్ధారించింది. అంత చక్కని ఇంగ్లీష్‌ భాషలో ‘ఆయన’ తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆ రోజుల్లోనే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని, తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టి నేరం చేస్తూ దొరికిపోయిన జుగుప్సాకర సన్నివేశం అది. పొరుగు రాష్ట్ర శాసనసభ్యుడిని కొనుగోలు చేస్తూ, ఆడియో – వీడియోల సాక్షిగా నోట్ల కట్టల సూట్‌కేసుతో బుక్కయిన ఒక అసభ్య చిత్రమది.

కొన్ని కోట్లమంది ‘బ్రీఫ్‌డ్‌ మీ’ ఆవాజ్‌ను విని ఉంటారు. ఆ గొంతు ఎవరిదీ అనే అనుమానం ఎవరికీ వచ్చి ఉండే ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చినా ఫోరెన్సిక్‌ నివేదిక దాన్ని పటాపంచలు చేసింది. అయినా ఆ నాయకుడి మీద కేసు పడలేదు. ఆయన ఆదేశాలు పాటించిన వారి మీద మాత్రమే ఇప్పుడు కేసు నడుస్తున్నది. న్యాయస్థానాల్లో వ్యాజ్యాలను విజయవంతంగా నడిపించడంలో, ఇతరేతర సంస్థలను, వ్యవస్థలను మెప్పించడంలో గొప్ప దిట్టగా చంద్రబాబుకు పేరున్నది. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్నీ, పార్టీనీ కబ్జా చేసిన చంద్రబాబు ఆ తర్వాత బాజప్తా న్యాయస్థానం ద్వారానే సైకిల్‌ గుర్తునూ, పార్టీ జెండానూ, పార్టీ బ్యాంక్‌ అక్కౌంట్స్‌నూ స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ స్వయంగా తన చేతుల మీదుగానే పార్టీని నిర్మించారనీ, ప్రభుత్వాన్ని స్థాపించారనీ, పార్టీ పతాకాన్ని డిజైన్‌ చేశారనీ, సైకిల్‌ గుర్తును ఎంపిక చేసుకున్నారనీ తెలుగు ప్రజలందరికీ తెలుసు. అయినా కోట్లాదిమంది కామన్‌సెన్స్‌ను ఓడించి, కోర్టులో గెలవగలిగారు. ఆయన వ్యాజ్య నైపుణ్యం అటువంటిది.

ఒక నాయకుడిపై వచ్చిన ఆరోపణల్ని దర్యాప్తు చేయాలని సాక్షాత్తూ హైకోర్టు కోరినప్పుడు తమ దగ్గర తగినంత సిబ్బంది లేదని సీబీఐ తప్పించుకున్న ఘటన ఇంకోటి ఏదైనా ఉన్నదా? చంద్రబాబు విషయంలో మాత్రమే అలా జరిగింది. అందువల్ల ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు లేకపోవడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు. హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేయించిన ‘ఐటి గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను ముందుపెట్టి, కోట్లాది మంది ఓటర్ల సమస్త సమాచారాన్ని అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ తస్కరింపజేశారనీ ఆధారాలతో సహా వెల్లడైంది. ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేశారన్న అధారాలు కూడా దొరికాయి. వాటిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ప్రతిపక్ష నేతలు, ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్నీ దొంగిలించడం కోసం అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ పలుమార్లు ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లి, ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. మరో ఇద్దరు ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ సామర్ధ్యాన్ని పరిశీలించి వచ్చారని సమాచారం.

ఆ సాఫ్ట్‌వేర్‌ మరేదో కాదు పక్కా పెగసస్‌ అనేదానికి మరో తిరుగులేని రుజువు ఇప్పుడు దొరికింది. గురువారం నాడు బెంగాల్‌ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ సందర్భానుసారం పెగసస్‌ ప్రస్తావన తెచ్చారు. పెగసస్‌పై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన నేపథ్యంలో ఈ ప్రస్తావన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ఈ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించేందుకు ఇజ్రాయెల్‌ సంస్థ తమ పోలీస్‌ విభాగాన్ని కూడా సంప్రదించిందనీ, విషయం తన దృష్టికి రావడంతో తాను తిరస్కరించాననీ ఆమె చెప్పారు. అయితే అప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించారని కూడా ఆమె కుండబద్దలు కొట్టారు. చంద్రబాబుతో ఆమెకు విరోధమేమీ లేదు. గడచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్రంలో ఆమె ప్రచారం కూడా చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న కీలక నేత కావడం, చంద్రబాబుతో స్నేహ సంబంధాలు కలిగి ఉండడం మూలంగా ఆమె ప్రకటనకు విశ్వసనీయత చేకూరింది.

ఇజ్రాయెల్‌ గూఢచార సంస్థ ‘మొసాద్‌’ అవసరాల కోసం ఎన్‌ఎస్‌ఓ అనే రక్షణ పరికరాల ఉత్పత్తి సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్‌ చేసింది. ప్రపంచ దేశాల గూఢచార సంస్థలన్నింటిలోకి సమర్థత ప్రాతిపదికన ‘మొసాద్‌’ అగ్రస్థానంలో ఉన్నది. ఎంతో విస్తృత ప్రచారమున్న సీఐఏ, కేజీబీ వగైరా సంస్థలన్నీ మొసాద్‌ ముందు దిగదుడుపే! మొసాద్‌ చేతికి ఈ సాఫ్ట్‌వేర్‌ అందిన తర్వాత ఇరుగు–పొరుగు మధ్యప్రాచ్య (మిడిల్‌ ఈస్ట్‌) దేశాల్లో వందలాదిమంది జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ఎన్‌జీవోల ప్రతినిధులు హత్యలకు గురికావడం, ప్రమాదాల్లో మరణించడం సంభవించిందని అంచనా. గ్రీకు పురాణాల్లో దివ్య మహిమలు గల రెక్కలగుర్రం పేరు – పెగసస్‌. అంతటి శక్తిమంతమైనదన్న ఉద్దేశంతో ఈ సాఫ్ట్‌వేర్‌కు ఆ పేరు పెట్టి ఉంటారు.

పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌కు నిజంగానే ఊహాతీతమైన మహిమలున్నాయి. ఎవరి ఫోన్‌ నంబర్‌ను అయినా సరే, తమ సర్వర్‌లో ఫీడ్‌ చేసుకున్న తర్వాత ఆ నెంబర్‌కు ఒక ఎస్‌ఎమ్‌ఎస్‌నో, వాట్సప్‌ మెసేజ్‌నో, ఒక మెయిల్‌నో పంపిస్తారు. మీరు దాన్ని ఓపెన్‌ చేసినా, చేయకపోయినా పెగసస్‌ అప్లికేషన్‌ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. ఒక ఫోన్‌కాల్‌తో కూడా ఇన్‌స్టాల్‌ చేయవచ్చు, మీరు ఫోన్‌ ఎత్తకపోయినా సరే! ఇక అక్కడి నుంచి మీ ప్రతి కదలికా... అవతలి వారికి తెలిసిపోతుంది. తమ ఫోన్‌ ట్యాప్‌ అవుతున్నదని అనుమానం వచ్చిన వాళ్లు ఫోన్లో మాట్లాడకుండా వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడాలనుకోవచ్చు. చేతిలో ఫోన్‌ పట్టుకుని వెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఫోన్లో ఇన్‌స్టాల్‌ అయిన సాఫ్ట్‌వేర్‌ దాని పనిని అది చేస్తుంది. మీ ఎదుటి వ్యక్తి ఫోటోను తీస్తుంది. మీ మాటల్నీ, అతడి మాటల్నీ రికార్డు చేస్తుంది. వాట్సప్‌ మెసేజ్‌లు, ఈ–మెయిల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లూ, ఫేస్‌ బుక్‌ వగైరా అన్నిరకాల సమాచారాన్నీ సంగ్రహిస్తుంది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ దగ్గరున్న సోర్స్‌ కోడ్‌కు వెళ్తుంది. అక్కడ్నుంచి క్లయింట్‌కు చేరుతుంది. అంటే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన క్లయింట్లు ఈ దేశ ప్రముఖుల రహస్యాలనూ, ప్రజల సమాచారాన్నీ విదేశీ సంస్థ గుప్పెట్లో డబ్బులిచ్చి మరీ పెడుతున్నారన్నమాట! ఈ లెక్కన చంద్రబాబు కూడా ఈ పని చేశారు. ఆయన ఏటా 35 కోట్ల రూపాయల చొప్పున చెల్లించి మూడేళ్లపాటు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని తెలుస్తున్నది.

ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని కుట్రపూరితంగా తెలుసుకోదలిచినా, అతడి కదలికలను కనిపెట్టే ప్రయత్నం చేసినా... భారత రాజ్యాంగం 21 (ఎ) అధికరణం, ఇండియన్‌ టెలిగ్రాఫిక్‌ యాక్ట్, ఐటీ యాక్ట్, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (1872)ల ప్రకారం అది పెద్ద నేరం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. టెలిగ్రాఫిక్‌ యాక్ట్‌ ప్రకారం ఒక వ్యక్తి టెలిఫోన్‌ను ట్యాప్‌ చేయాలి అంటే అతడు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడనీ, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో భాగస్థుడనీ స్పష్టమైన సమాచారం ఉండాలి. ఐటీ యాక్ట్‌ ప్రకారం రాష్ట్ర డీజీపీ కేంద్ర హోంశాఖకు లేఖ రాసి, ఫోన్‌ ట్యాపింగ్‌ అనుమతిని తీసుకోవాలి. అందుకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ నుంచి సదరు లేఖ టెలికామ్‌ నోడల్‌ ఏజెన్సీకి చేరుతుంది. అప్పుడు అనుమానిత వ్యక్తి డేటాను రికార్డు చేసి రాష్ట్ర పోలీసు శాఖకు పంపిస్తారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి మనదేశంలో పాటించే విధానం ఇది. ఇక్కడ కేంద్రంతో సంబంధం లేకుండా ఇజ్రాయెల్‌ సంస్థ ద్వారా పెగసస్‌ గూఢచర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నడిపించినట్టు అర్థమవుతున్నది. ఇది దేశద్రోహం కంటే పెద్ద నేరమవుతుంది.

నేరమే అధికారమై, ప్రజల్ని నేరస్థుల్ని చేసి వేటాడుతుంటే ఊరక కూర్చున్న ప్రతివాడూ నేరస్థుడేనంటారు విప్లవకవి వరవరరావు. ఇక్కడ నేరమే అధికారమై, ప్రత్యర్థుల్ని నేరస్థులుగా ముద్రవేసి వేటాడిన దుర్దినాలను ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ రంగం దాటి వచ్చింది. అధికారం కోల్పోయినా నేరస్వభావం మారలేదు. ప్రత్యర్థులపై ముద్రలు వేసి గగ్గోలు పుట్టించాలని చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న ఎకో సిస్టమ్‌ ఇప్పటికీ సర్వశక్తులూ ఒడ్డుతూనే ఉన్నది. దాని ఉపాంగమైన మీడియా సింఫనీ నిర్విరామంగా సాగుతూనే ఉన్నది. అధికార పీఠం మీద ఉన్నప్పుడు రచించిన అవినీతి పురాణం డజన్ల కొద్దీ అధ్యాయాలతో ఒక పుస్తకంగానే వెలుగు చూసింది. రాజధాని పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భూములతో గేమింగ్, రాజధాని నిర్మాణం పేరుతో స్విస్‌ ఛాలెంజ్‌ కుంభకోణం, విశాఖపట్నంలో సృష్టించిన భూకంపం, సదావర్తి సత్రం నిలువు దోపిడీ, అస్మదీయులకు కారుచౌకగా భూ నజరానాలు, మద్యం సిండికేట్ల నుంచి పిండుకున్న ముడుపుల గుట్టలు, అగ్రిగోల్డ్‌ ఆస్తుల నిలువు దోపిడీ – బాధితులకు పంగనామాలు, ఇసుక మాఫియా పిండుకున్న ‘తైలం’, పోలవరాన్ని ఏటీఎమ్‌గా వాడుకోవడం, నీరు – చెట్టు పేరుతో నిత్యశఠగోపం, గ్రానైట్‌ ఫలహారానికి స్కెచ్‌లు, బరైటీస్‌ దందాల బిందాస్, విదేశీ బొగ్గును భోంచేయడం... ఇలా ఇదో గాథాసప్తశతి! బృహత్కథా మంజరి!!

తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత దాని చుట్టూ ఒక ఎకో సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తన పార్టీతోపాటు ఇతర పార్టీల్లోని కొన్ని స్వార్థపూరిత శక్తులు, సొంత ప్రయోజనాల కోసం పనిచేసే మీడియా పెద్దలు, వివిధ సంస్థల్లో, వ్యవస్థల్లో కీలక పదవుల్లో ఉండే తనవారు ఈ సిస్టమ్‌లో భాగం. చంద్రబాబుకు అవసరమైనప్పుడు వీరంతా ఎవరి పాత్రను వారు పోషిస్తారు. చూసేవాళ్లకు అంతా యాదృచ్ఛికమనే భావన కలుగుతుంది. కానీ అంతా ఒక పకడ్బందీ స్క్రిప్ట్‌ ప్రకారమే నాటక ప్రదర్శన జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన నేరాలకు, ఘోరాలకు మూల్యం చెల్లించవలసిన సమయమిది. రచ్చబండ వద్ద నిలబెట్టి ప్రశ్నించవలసిన తరుణమిది. కానీ, తెలుగుదేశం, దాని మిత్రకూటమి ఎజెండాను పక్కదారి పట్టించే పనిలో బిజీగా నిమగ్నమైంది.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పరిపాలనా సంస్కరణలు, విద్య – వైద్యరంగాల్లో మొలకెత్తిన విప్లవం, వ్యవసాయరంగంలో కనిపిస్తున్న సుస్థిరాభివృద్ధి నాగేటి చాళ్లు, పేదవర్గాల ప్రజల్లో పరుచుకుంటున్న కులాతీత సాధికార చైతన్యం... ఇవన్నీ గొప్ప సామాజిక – ఆర్థిక పరిశోధనాంశాలు. దేశవ్యాప్తంగా ఈ మార్పుల మీద చర్చ జరగడం ఒక చారిత్రక అవసరం. కానీ తెలుగుదేశం నడిపించే మీడియాలో ఈ నిశ్శబ్ద విప్లవానికి ఏనాడూ సెంటీమీటర్‌ చోటు లభించదు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పులుముకున్న అవినీతి అరాచక పాలన బురదను మరిచిపోవడానికి అధికార పార్టీపై బురదను కుమ్మరించే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో చేపట్టారు. దాని లక్ష్యం సుస్పష్టం. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి యాభై శాతం ఓట్లు పడ్డాయి. దాని ఓటింగ్‌ బలం ఇంకొంత పెరిగిందని ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దాని ఓటింగ్‌ బలాన్ని ఓ ఐదారు శాతం మేరకు తగ్గించగలగాలి. అందుకోసం దుష్ప్రచారాల దండోరా! లేకపోతే... వైఎస్‌ వివేకా హత్య ఎప్పుడు జరిగింది? ఆ హత్య జరిగిన తర్వాత రెండున్నర నెలలపాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పోలీసులే దర్యాప్తు జరిపారు. వైఎస్‌ జగన్‌ను ఇరుకున పెట్టగలిగే ఏ ఒక్క ఆధారం దొరికినా చంద్రబాబు వదిలేవాడేనా? రెండున్నరేళ్ల తర్వాత ఈ కొత్త పాటేమిటి? కొత్త ప్రచారం ఏమిటి? మొదట్లో తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోసిన వివేకా కూతురు హఠాత్తుగా ప్లేటు మార్చడం ఏమిటి? ఆమెకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం టిక్కెట్టిస్తారన్న ప్రచారం ఎందుకొస్తున్నది? ఇదంతా ఒక స్కీమ్‌లా కనిపించడం లేదా?

మిగిలిన దుష్ప్రచారాలన్నీ ఈ తరహావే! ఒక్కో ఆరోపణను సాంగోపాంగంగా తర్కించి పరిశీలిస్తే తేలేది బోగస్‌ కథనాలే! ఈ ప్రచారాల ద్వారా అధికార పార్టీ ఓట్లను తగ్గించడం వ్యూహంలో ఒక భాగం. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కలిసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చూడటం రెండో భాగం. వ్యూహంలో రెండో భాగాన్ని మొన్ననే పవన్‌ కల్యాణ్‌ నిర్ధారించారు. చంద్రబాబు పవన్‌ మీద తనకున్న ఒన్‌ సైడ్‌ లవ్‌ను ప్రకటించిన మూడు మాసాలకు పవన్‌ స్పందించారు. ఆ ప్రేమను స్వీకరిస్తూ, ఓట్లు చీలకూడదని సందేశాన్నిచ్చారు. పాలక పార్టీ మీద తొడగొట్టినంత తీవ్రంగా దాడి చేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39 శాతం ఓట్లు వస్తే జనసేనకు వచ్చింది ఏడు శాతమే. మరి కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి? ఓట్ల శాతం ప్రకారం పవన్‌ పార్టీ కూరలో కరివేపాకే కదా! మరి కరివేపాకులే తొడలు కొడితే బాలయ్య బాబులు ఏం చేయాలి? విశాల ప్రజానీకం దైనందిన జీవితాల్లో వస్తున్న మార్పులే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి తప్ప కరివేపాకులు, కలగూరగంపలు చేయగలిగిందేమీ ఉండదు.


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement