మేరే పాస్ మ్యానిఫెస్టో హై!
ఎన్నికల కోసం చంద్రబాబు సకల శస్త్రాలు, అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అదనపు సైన్యాల కోసం రాయబారాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన దగ్గర రామోజీరావు అనే ఓ మీడియా మాంత్రికుడున్నారు. అదే తరహా శిష్య పరమాణువుల్లాంటి ఇంకో ఇద్దరు ముగ్గురు మాంత్రికులున్నారు. ఇంకా చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ అనే సినీనటుడున్నారు. ఆ నటుడి బిల్డప్ కోసం ఓ మిలటరీ ట్రక్కు కూడా ఉన్నది. ఇటువంటి టక్కుటమారాలు చంద్రబాబు దగ్గర చాలా ఉన్నాయి. మరి జగన్‌మోహన్‌రెడ్డి దగ్గర ఏమున్నది?
‘మేరే పాస్ మ్యానిఫెస్టో హై’ అంటున్నారాయన. ఎన్నికలకు ముందు అన్ని పార్టీలూ మ్యానిఫెస్టోలను ప్రకటిస్తాయి కదా! ఇందులో ప్రత్యేకత ఏముంటుంది? తాజా వాగ్దానాలతో కూడిన సరికొత్త మ్యానిఫెస్టో కాదు. అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పాత మ్యానిఫెస్టో గురించి ఈ చర్చ. ‘ఇదిగో మేమిచ్చిన హామీలు... ఇదీ మేము అమలుచేసిన తీరూ– తెన్నూ’ అంటూ పాత మ్యానిఫెస్టోను ప్లకార్డులా పట్టుకొని ఆ పార్టీ బృందాలు ముందుకు కదలబోతున్నాయి.
ఈ పని చేయడానికి ఏ పార్టీకైనా చాలా గుండె బలం కావాలి. భారత రాజకీయాల్లో ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ ఇటువంటి సాహసానికి పూనుకున్న దాఖలాలు లేవు. చంద్రబాబుకూ, ఆయన పార్టీకీ అటువంటి ఆలోచన కూడా ఉండదు. అలవిగాని హామీలిచ్చి, గద్దెనెక్కిన తర్వాత తదుపరి ఎన్నికల సమయానికి పాత మ్యానిఫెస్టోను మార్కెట్లో కనబడకుండా చేయడం తెలుగుదేశం ప్రత్యేకత.
మొన్నటి ఎన్నికల సమయానికైతే దాన్ని పార్టీ వెబ్‌సైట్ నుంచి కూడా ఆ పార్టీ మాయం చేసింది. ఆరొందల హామీలతో కూడిన బృహత్కథామంజరి సదరు ఎన్నికల ప్రణాళిక! అంత గ్రంథాన్ని కూడా గుటకాయస్వాహా అన్నారు. తాను చేసిన వాగ్దానాలను గుర్తుచేసుకోవడం అంటే చంద్రబాబుకు తగని భయం. పాత మ్యానిఫెస్టో ఫోబియా ఉందాయనకు! కొత్తగా ఎన్నికల ముందు తయారుచేసే మ్యానిఫెస్టోల్లో ఇసుమంత కూడా సృజనశీలత లేకపోవడం తెలుగుదేశం ప్రత్యేకత.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన అనంతరం తెలుగుదేశం పార్టీ తయారుచేసిన ఎన్నికల ప్రణాళికలన్నీ కాపీ, పేస్ట్ వంటకాలే. రాబోయే ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టో నుంచి చిన్న టీజర్ అంటూ మొన్నటి మహానాడులో ప్రదర్శించిన పాచి పదార్థం హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును రాష్ట్రమంతటా వెదజల్లింది.
జగన్ ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలను సైతం నిస్సిగ్గుగా పేర్లు మార్చి ప్రకటించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కనుక వారి మ్యానిఫెస్టో నుంచి ఓ రెండు స్కీములు తీసుకున్నారు. ఒకవేళ బీజేపీ గెలిచి వుంటే ఈ స్కీములను కచ్చితంగా తీసుకునేవారు కాదు. అప్పుడు బీజేపీ మ్యానిఫెస్టోనే కాపీ కొట్టేవారు. సినిమా ప్రపంచాన్ని కొంతకాలంపాటు ఫార్ములా జాడ్యం వెంటాడిన విషయం మనకు తెలిసిందే.
ఏదైనా ఒక సినిమా హిట్ అయితే, అందులో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని ఫైట్లున్నాయి, ఎన్ని మిల్లీమీటర్ల సెంటిమెంట్, ఎన్ని సెంటీమీటర్ల కామెడీ ట్రాక్ ఉన్నాయో లెక్కలేసుకుని సినిమాలు తీసేవాళ్లు. కానీ ఆత్మ లాంటి కథ సంగతి మాత్రం పట్టించుకునేవారు కాదు. చంద్రబాబు కూడా ఈ తరహా సక్సెస్ ఫార్ములా మ్యానిఫెస్టోల రూపకల్పనకు అలవాటుపడ్డారు.
కనుక ఈ మ్యానిఫెస్టోలకు ప్రజా జీవితంతో సంబంధం ఉండదు. ప్రజల అవసరాలేమిటో, వారి ఆకాంక్షలేమిటో, వాటినెలా నెరవేర్చాలో అనే ఆలోచనా, వివేచన ఈ మ్యానిఫెస్టోల్లో ఉండదు. తమకు అధికారం కావాలి, అందుకోసం ఎన్ని వాగ్దానాలైనా చేయాలి. ఎంత పెద్ద పుస్తకమైనా అచ్చేయాలి. మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి దాచేయాలి. ఇదీ చంద్రబాబు ‘సైకిల్’.
మానవ సంబంధాల్లోంచి ఏరుకొని మట్టి పరిమళాలద్దిన అక్షరాలతో జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల మ్యానిఫెస్టోను రాసుకున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ని గుర్తు చేసుకోవచ్చు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అంటాడు తిలక్.
ప్రజల కోసం తన అక్షరాలను అంకితం చేసిన తీరిది. జగన్‌మోహన్‌రెడ్డి తయారుచేసుకున్న మ్యానిఫెస్టో కూడా అంతే! తన సుదీర్ఘ పాదయాత్ర, ఓదార్పు యాత్రల్లో ఆలకించిన జనకోటి గుండెచప్పుళ్ళ సందేశం మ్యానిఫెస్టోలోని అక్షరాల్లో నిక్షిప్తమై ఉన్నది. ఆ అక్షరాలకు అందుకే జవాబుదారీతనం ఉన్నది. ఆ బాధ్యతతోనే పాత మ్యానిఫెస్టోను జనం ముందుకు వైఎస్సార్‌సీపీ తీసుకొస్తున్నది. ‘ఇదిగో ఇచ్చిన హామీలు 99 శాతం నెరవేర్చాము. మాకు ఎన్నికల పరీక్షలో 99 శాతం మార్కులు వేయండ’ని పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి.
మద్యనిషేధం, ఓపీఎస్ అనే రెండు విషయాల్లో చేయ గలిగిన మేరకు చేసినప్పటికీ, చెప్పినంతగా చేయనందున రెండు అరమార్కులు తగ్గించి, 99 శాతం వేయండని పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి. ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా అక్కడక్కడా ఒకటో రెండో హామీలు ఇంకా మిగిలిపోయే ఉండవచ్చు. చేను కోసిన తర్వాత పరిగె మిగలడం సహజం. తమ ఇళ్ల స్థలాల హామీ అలాగే ఉండిపోయిందని జర్నలిస్టు సోదరులు గొణుగుతూనే ఉన్నారు. ఇటువంటి పరిగె ఇంకెక్కడైనా మిగిలిందేమో లోతుగా పరిశీలించే శక్తి ప్రజలకు ఉంటుంది.
కనుక ఆ పార్టీ వారు అడుగుతున్నట్టు 99 శాతం కాకపోయినా 95 శాతమో, 90 శాతమో మార్కులు వేసేందుకు జనం సిద్ధంగా ఉన్నారని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. 86 శాతం మార్కులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేసి జనం నమ్మకాన్ని నిలబెట్టున్నందువలన ఆ మాత్రం ఇంక్రిమెంటు సహజంగానే ఉండవచ్చు.
గత ఎన్నికల్లో టీడీపీ వారు పాత మ్యానిఫెస్టోను దాచిపెట్టినప్పటికీ జనం గుర్తుపెట్టుకుని 13 శాతం (23 సీట్లు) మార్కులే వేశారు. ఈసారి అమల్లో ఉన్న మ్యానిఫెస్టోను కాపీ కొడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయినందు వలన ఇక భవిష్యత్తులో ఎన్నికల పరీక్ష రాయకుండా డీబార్ శిక్ష పడినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
అమలుచేసిన మ్యానిఫెస్టోను జనం ముందు పెట్టి తీర్పు చెప్పవలసిందిగా జనాన్ని అభ్యర్థిస్తూ దేశ రాజకీయాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఒక కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈసారి వైసీపీ ఎన్నికల విజయం తర్వాత మిగిలిన పార్టీల మీద ఆయా రాష్ట్రాల ప్రజలు మ్యానిఫెస్టో అమలుపై వివరణ కోరవచ్చు. ఇక ముందు ఏ పార్టీ కూడా ఈ జవాబుదారీతనాన్ని తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు.
దాదాపు యాభయ్యేళ్ల కింద విడుదలైన సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా ‘దీవార్’ చాలామంది చూసి ఉంటారు. ఆ సినిమా మర ఫిరంగిలా పేల్చిన డైలాగ్ ‘మేరే పాస్ మా హై’! ఇప్పటికీ ఆ డైలాగ్ జనంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. ఇకముందు రాజకీయ పార్టీలు పాత మ్యానిఫెస్టోలను దాచిపెట్టకుండా ‘మేరే పాస్ మ్యానిఫెస్టో హై’ అని ధైర్యంగా జనం తీర్పు కోరే పరిస్థితులు ఏర్పడితే స్వాగతించవలసిందే.
మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా ప్రకటించి ఒక కొత్త ట్రెండ్‌కు జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకోసం శ్రీకారం చుడుతున్నారు? చేసిన హామీలను అమలుచేసి జవాబుదారీతనానికి టార్చ్ బేరర్‌గా నిలవాలని ఆయన ఎందుకు భావిస్తున్నారు? ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచీ చేస్తున్న రాజకీయ ప్రసంగాల్లో ఒక తాత్విక భూమిక మనకు కనిపిస్తుంది.
ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడం అత్యవసరమని తన ప్రతి ప్రసంగంలో చెప్పేవారు. ఉన్నత లక్ష్యాలతో ఏర్పడిన రాజ్యాంగం ఆధారంగా మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటైంది. దేశంలోని సకల జనులకూ సామాజిక – ఆర్థిక న్యాయం జరగాలనీ, భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ సమానంగా ఉండాలనీ, సమాన హోదా అందరికీ సిద్ధించాలనీ, సౌభ్రాతృత్వంతో అందరూ సమస్కంధులుగా నిలబడగలగాలనీ పేర్కొన్న రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు మాత్రం నెరవేరలేదు.
పైపెచ్చు అసమానతలు పెరిగిపోయాయి. ఇందుకు కారణం రాజకీయ వ్యవస్థ మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం లభించడం, సమాన అవకాశాలు లభించడం వల్ల ఈ వర్గాల ప్రయోజనాలు దెబ్బ తింటాయి. అందువల్ల పేదలను మరింత పేదలుగా మార్చే విధానాలు మన దేశంలో అమలవుతున్నాయి.
ఈ విధానాల్లో పూర్తిస్థాయి మార్పులను విజయవంతంగా తీసుకురాగలగాలి. అదే ‘ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్’ అవుతుంది. ప్రస్తుతం మనం పెత్తందారీ వర్గ ప్రయోజనాల పరిధిలోనే జరిగే ఫిరాయింపులనూ, అధికారం నిలబెట్టుకోవడాన్నీ, మ్యానిపులేషన్స్‌నూ ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్‌గా భ్రమిస్తున్నాం. అసలైన ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ వ్యవస్థాగతమైన ప్రక్షాళనలోనే ఉన్నది.
అయితే అదంత సులభసాధ్యం కాదు. పెత్తందారీ వర్గాల తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవలసి వస్తుంది. అవసరమైతే భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి రావచ్చు. అందుకు సిద్ధపడే మనోధైర్యం కావాలి. ప్రక్షాళన జరగాలంటే పరిపాలనలో పారదర్శకత పెరగాలి. అందుకు రాచమార్గం పాలనా వికేంద్రీకరణ. పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన ఇంగ్లిషు విద్య, మెరుగైన వైద్యం లభించాలి. కుల, మత, లింగ వివక్ష లేకుండా అందరికీ అవకాశాలు సమానంగా ఉండాలి.
ధనికుల పిల్లలతో పోటీపడగల నైపుణ్య శిక్షణ పేద పిల్లలకు అందజేయగలగాలి. చిన్న రైతులకు కూడా వ్యవసాయాన్ని లాభసాటి చేయగల విధానాలను అనుసరించాలి. మహిళను సాధికారశక్తిగా మలచాలి. చిన్నతరహా పరిశ్రమలకు ఊతమిచ్చి మధ్యతరగతి పేదవర్గాల నుంచి నయా సంపన్నశ్రేణిని సృష్టించాలి. రాష్ట్ర సహజ బలాలను (వ్యవసాయం, సముద్ర తీరం) గుర్తించి పూర్తిస్థాయిలో వినియోగించుకోగలగాలి.
కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఈ మార్గాలన్నింటిలో అడుగులు వేయడమే కాదు, పరుగులు తీయవచ్చని జగన్ సర్కార్ నిరూపించింది. ఈ పరుగులకు కరదీపికగా దారి చూపింది మాత్రం కచ్చితంగా ‘నవరత్న’ ఖచితమైన మ్యాని ఫెస్టోనే! ఇటువంటి మ్యానిఫెస్టోను అమలు చేయడం పెత్తందార్ల ప్రయోజనాలకు వ్యతిరేకం కనుక వాళ్లు కత్తి కట్టడంలో ఆశ్చర్యం లేదు. ఈ పెత్తందారీ కుట్రలపై పేదల్ని జాగృతం చేయడంలో కూడా జగన్ సర్కార్ విజయం సాధించినట్టే కనిపిస్తున్నది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
ది హోలీ మ్యానిఫెస్టో!
Published Sun, Jun 11 2023 3:06 AM | Last Updated on Sun, Jun 11 2023 3:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment