పౌర సమాజమా... పారాహుషార్‌! | Sakshi Editorial On TDP Political Alliance And Yellow Media | Sakshi
Sakshi News home page

పౌర సమాజమా... పారాహుషార్‌!

Published Sun, May 12 2024 4:15 AM | Last Updated on Sun, May 12 2024 4:15 AM

Sakshi Editorial On TDP Political Alliance And Yellow Media

జనతంత్రం

అఖిలాంధ్ర జనులారా! అప్రమత్తంగా ఉండండి! గోముఖ వ్యాఘ్రాలు అంబారావాలు చేస్తున్నాయ్, తప్పుదోవ పట్టిస్తున్నాయ్‌. తేనె పూసిన కత్తులు కోలాటమాడు తున్నాయ్, కనికట్టు చేస్తున్నాయ్‌. జన తటాకపు గట్టు మీద మూడు కొంగలు నిలబడి దొంగజపం చేస్తున్నాయ్‌. జాగ్తే రహో!

మతోన్మాదులు – కులోన్మాదులు జెండా గుడ్డలతో కొంగులు ముడేసుకొని అడుగులు వేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి.
నాజీలను మించిన కులోన్మాదులు, ఫాసిస్టులను తల దన్నే మతోన్మాదులు ఉమ్మడిగా, కలివిడిగా ఉన్మత్త ప్రచారపు విషవాయువులను ప్రయోగిస్తున్నారు, తస్మాత్‌ జాగ్రత్త!

విష ప్రచారపు ప్రయోగ వేదికలైన యెల్లో మీడియా కార్ఖానాల్లోంచి రోజుకు లక్ష క్యూబిక్‌ మీటర్ల పాయిజనస్‌ గ్యాస్‌ వెలువడుతున్నది. ఆ గాలి సోకితే జ్ఞానేంద్రియాలు పనిచేయవు, జరభద్రం!

మన జ్ఞానేంద్రియాలు పని చేయకూడదనేదే వారి కోరిక. పని చేస్తే వారి నిజస్వరూపం మనం గుర్తిస్తామన్న భయం.
ఈ మతోన్మాద, కులోన్మాద ఉమ్మడి ముఠాను నడిపించేది అంతా కలిపి పిడికెడు మందే! వారే పెత్తందార్లు. వారే పెట్టుబడిదార్లు. ముఠాలోని మిగిలిన పరివారంలో మతం అనే మత్తుమందుకు బానిసలు కొందరు. కులం అనే దురద రోగపు బాధితులు కొందరు.

ఈ బానిసల్నీ, బాధితుల్నీ వెంటేసుకొని పెత్తందారీ కాలకూట విషకూటమి దండయాత్రకు బయల్దేరింది. ప్రపంచ యుద్ధాల్లో కూడా కొన్ని రకాల కెమికల్‌ వెపన్స్‌ వాడకంపై నిషేధాలుంటాయి. కానీ రోగ్‌ కంట్రీస్‌ ఖాతరు చేయవు. మన హెజెమోనిక్‌ రోగ్స్‌ కూడా అంతే! ప్రచారపు విధి నిషేధాలను ఖాతరు చేయరు, చేయట్లేదు.

మన పెత్తందారీ కూటమి యుద్ధానికి తెగబడింది ఎవరి మీద? ఎవరిని తెగటార్చడానికి భగభగమండే పగతో సెగలుగక్కుతున్నారు?

ఇంకెవరి మీద? పేదసాదల మీద, వారి సాధికారతా స్వప్నాల మీద! బడుగు బలహీన వర్గాల మీద, వారి జీవన వికాసపు ఆకాంక్షల మీద! కోట్ల జతల కనురెప్పల మాటు నున్న కలల మీద ఒకేసారి దాడి చేయడం ఎట్లా?

వారికి ఆలంబనగా నిలబడిన వెన్నెముకను విరి చేయాలి. ఆ వెన్ను ఎముకే... వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.
ఇంకెందుకు ఆలస్యం. బొంబార్డ్‌ ది హెడ్‌ క్వార్టర్స్‌. ప్రజల పక్షాన నిలబడిన ప్రభుత్వాన్ని కూలదోస్తే సరిపోతుంది. ఈ ఎన్నికల్లో కూల్చివేయాలి. పెత్తందారీ కూటమి తలపోత ఇది.

తలపోసినంత మాత్రాన కుదురుతుందా? కోట్లాది మంది జీవితాలను క్రాంతి మార్గానికి మళ్లిస్తున్న సర్కార్‌కు వారు అండగా నిలబడరా? అశేష జనావళి మద్దతున్న జగన్‌ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఎలా ఓడించగలరు?

బలరామదేవుడి ముక్కోపానికి విరుగుడు మంత్రం ఉండనే ఉన్నది కదా ముఖస్తుతి అంటాడు ‘మాయాబజార్‌’ శకుని మామ. ఆ లెక్కన ప్రజాభిమానానికీ విరుగుడు ఉంటుంది కదా! ప్రజల్లో అపోహలు సృష్టించడం, అను మాన బీజాలు నాటడం! అసత్య ప్రచారంతో చీలికలు తేవడం వగైరా. కూటమిలోని శకుని మామలు పాచికలు విసరడంలో ఆశ్చర్యమేమున్నది?

ప్రజలను ఆకట్టుకోగల నినాదం ఈ కూటమికి ఒక్కటి కూడా లేదు. ప్రజలకు మేలు చేసే విధానమూ లేదు. అరువు తెచ్చుకున్న అతుకుల బొంత మేనిఫెస్టో మాత్రం ఉన్నది. అందులోని అంశాలు అరచేతిలో వైకుంఠాన్ని చూపే టక్కు టమారం బాపతు. ఈ గారడీ సంగతి ముందే తెలిసిన జనం దాన్ని బొత్తిగా పట్టించుకోలేదు. క్రెడిబిలిటీ టెస్ట్‌లో కూటమి మేనిఫెస్టో డకౌటయింది.

కూటమి నేతలు కూడా మేనిఫెస్టోను నమ్ముకోలేదు. యెల్లో మీడియా నేతృత్వంలో వెలువడే విషవాయు ప్రచా రాన్నే ఆయుధంగా ఎక్కుపెట్టారు. జగన్‌ పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందంటారు. ఎలా అని అడగ కూడదు. తర్కానికి తావులేదు. సర్వనాశనం అనే మాటను అష్టోత్తర శతనామంలా ప్రతివాడూ నూటా ఎనిమిది సార్లు జపించాలి. అంతే!

జగన్‌ హయాంలో అభివృద్ధి శూన్యమంటారు. దాని పైనా చర్చ ఉండదు. ఆధారాలుండవు. గణాంకాల జోలికి వెళ్లొద్దు. ఫీల్డ్‌ విజిట్‌ చేయొద్దు. రోజూ ఓపికున్నంత సేపు రామకోటి రాసుకున్నట్టుగా ‘అభివృద్ధి లేదు’ అనే మాటను రాసుకోవాలి. పంచాక్షరి మంత్రంలా పవిత్రంగా ఉచ్ఛరించి నెత్తిన నీళ్లు చల్లుకోవాలి.

సర్వనాశనం, అభివృద్ధి శూన్యం అనే రెండు మాటల్ని మన యెల్లో మీడియా, టీడీపీ నేతలు నమలడం మొదలు పెట్టి ఇప్పటికి నాలుగేళ్లు దాటింది. నమలడం, నెమరు వేయడం అనే కార్యక్రమం అప్పటి నుంచి నిరాటంకంగా సాగుతూనే ఉన్నది. చూసేవాళ్లకు రోత పుట్టినా వాళ్లు మాత్రం ఈ పాచిపాటను ఆపలేదు.

ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ మరీ ఘోరం. ఆ పత్రికలు చదవాలన్నా, ఆ ఛానెళ్లు చూడాలన్నా అల్ప ప్రాణులకు జడుపు జ్వరం వచ్చే పరిస్థితిలోకి తీసుకెళ్లారు. అభూతకల్పనలు, అభాండాలు, బట్టకాల్చి మీద వేయడం నిత్యకృత్యంగా మారింది.

‘ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ అనే నల్ల చట్టాన్ని జగన్‌ మోహన్‌రెడ్డి తీసుకొచ్చారట. దాని ఆధారంతో ఆయన అర్ధరాత్రి వేళల్లో గ్రామాలకు కన్నంవేసి కంటికి నచ్చిన భూమినల్లా తవ్వుకొని, మూట కట్టుకొని వెళ్లిపోతారట! ఇదీ వీళ్లు ప్రచారం చేస్తున్న వార్త సారాంశం.

మనిషి జన్మ ఎత్తిన వాడికి కొన్ని లక్షణాలు తప్పని సరిగా ఉంటాయని ఆశిస్తాము. సిగ్గూ–లజ్జ, మానము– మర్యాద, అభిమానం – గౌరవం వంటివి వాటిలో మచ్చుకు కొన్ని! యెల్లో మీడియా, దేశం కూటమి ఈ తరహా లక్షణా లను పూర్తిగా విసర్జించాయి. విలువల్నీ, వలువల్నీ విప్పేసి అవతలపారేశారు. దిగంబర వీరంగాలతో జుగుప్సాకరంగా తయారయ్యారు. నడివీధుల్లో నగ్నంగా నర్తిస్తున్నారు.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అనేది భూయజమానులకు మేలు చేస్తుందనీ, ఇంతకాలం ఈ చట్టాన్ని తేకపోవడమే పొరపాటనీ ఈ దేశంలోని బుద్ధిజీవులందరూ అభిప్రాయ పడుతున్నారు. ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నది.

ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఈ చట్టానికి మద్దతు ప్రకటించింది. ఇప్పటికింకా మూడో వంతు గ్రామా ల్లోనే భూసర్వే పూర్తయింది. అన్ని గ్రామాల్లో సర్వే పూర్త యితే తప్ప మరో రెండేళ్లకు గానీ ఈ చట్టం అమల్లోకి రాదు.

చట్టం లక్ష్యమే యజమానికి భూమిపై సర్వహక్కులు కల్పించడం. ఆ హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం. అందుకు గుర్తుగానే సర్వే పూర్తయిన చోట ఇచ్చే పాస్‌ పుస్తకాలపై సీఎం  బొమ్మను ముద్రిస్తున్నారు. అది ఆ యజ మాని హక్కుకు ప్రభుత్వ గ్యారంటీ. దాని మీద జరిగిన వక్రప్రచారం, చంద్రబాబు నోటి వెంట వచ్చిన బూతులు కూటమి దివాళాకోరుతనానికి రుజువు.

అవ్వాతాతల పెన్షన్ల పంపిణీ విషయంలో కూటమి – యెల్లో మీడియా ఎంత అమానవీయంగా ప్రవర్తించాయో రాష్ట్ర ప్రజలు గమనించారు. వలంటీర్ల విషయంలో ఎన్ని పిల్లిమొగ్గలు వేశాయో గమనించారు.

ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారులకు దక్కకుండా ఈసీపై నెరిపిన ఒత్తిడి రాజ కీయం కూటమి వారి దింపుడు కళ్లెం ఆశల దిగజారుడు తనాన్ని ఎత్తిచూపింది.

ఇసుక సరఫరాపై విషం చిమ్ముతూ గత నాలుగేళ్లుగా చందమామ కథలు నెలనెలా ప్రచారం చేయడాన్ని ఎలా మర్చిపోగలం?

మద్యం వ్యాపారుల మాఫియా కోసం మద్య నియంత్రణపై వెళ్లగక్కిన అక్కసు గుర్తు చేసుకోండి. తను అధికా రంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని చంద్రబాబు అంది స్తారట. ప్రాణాలకు హానికరమైన లిక్కర్‌కు నాణ్యతా ప్రమాణాలేమిటి?

విచ్చలవిడి లాభాల కోసం వ్యాపారులు వేలాది బెల్ట్‌ షాపులు కూడా నడిపి మద్యాన్ని డోర్‌ డెలివరీ చేసినప్పుడు ప్రజల ఆరోగ్యం అద్భుతంగా ఉందట. మద్యాన్ని అందు బాటులో లేకుండా చేసి, బెల్టుషాపులు ఎత్తివేసి నియంత్రిత వేళల్లో మాత్రమే, లాభాపేక్ష లేని ప్రభుత్వ షాపుల్లోనే అమ్ముతుంటే మాత్రం కాలేయాలు, కిడ్నీలు పాడైపోతు న్నాయనే కాకమ్మ కథలను ప్రచారంలో పెట్టిన వైనాన్ని గమనించండి.

పరిశ్రమల విషయంలోనూ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని ఆచరణా త్మకం చేస్తే సహించలేకపోయారు. ఏ వివక్ష లేకుండా, పుట్టిన ప్రతిబిడ్డకూ నాణ్యమైన విద్యను ప్రాథమిక హక్కుగా మార్చితే పెత్తందారీ కూటమి భరించలేకపోతున్నది. ప్రభు త్వంపై యుద్ధం ప్రకటించింది.

పేద వర్గాల ప్రజలు, మహిళలు నిటారుగా నిలబడ టానికి సాధికారతను సంతరించుకోవడానికి ఉపయోగపడే ఒక విప్లవకర ఎజెండాను జగన్‌ ప్రభుత్వం అమలుచేసింది. ఈ ఎజెండా కొనసాగవలసిన అవసరం పేదవర్గాలు, బలహీనవర్గాల ప్రజలకున్నది.

ఈ ఎజెండా కొనసాగితే పెత్తందార్లకు ఆకలి తీరదు. అందుకే కట్టుకథలతో ముందుకు వస్తున్నారు. పేదవర్గాల ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారు. మభ్యపెట్టాలని చూస్తున్నారు. మరోసారి దారుణంగా మోసం చేయాలని కపట నాటకమాడుతున్నారు.

వారు ప్రజలకు మిత్రులు కారు... శత్రువులు. మాన వీయ విలువలు లేశమాత్రం లేనివారు. పేద బిడ్డలు మంచి చదువులు చదివితే ఓర్చుకోలేరు.

మిత్రులారా! ఏదైనా జరగరాని పొరపాటు జరిగి కూటమి గెలిస్తే సర్కారు బడులు మళ్లీ  పాడుబడిపోతాయి. పేద బిడ్డలకు ఇంగ్లిష్‌ మీడియం రద్దవుతుంది. విద్య ప్రైవేట్‌ పరమవుతుంది.

ఈ లక్ష్యం కోసమే కార్పొరేట్‌ విద్యా సంస్థల యజమా నులు కూటమి గెలుపు కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు. అర్థం చేసుకోండి.

ప్రభుత్వ వైద్యరంగం నిర్వీర్యమవుతుంది. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అదృశ్యమవుతాడు. కార్పొరేట్‌ మాఫియా వైద్యరంగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటుంది. ‘రైతు భరోసా’ ఎగిరి పోతుంది. ఆర్‌బీకే సెంటర్లు అదృశ్యమవుతాయి.

అధికార వికేంద్రీకరణకు అద్దం పట్టిన గ్రామ సచివాల యాలు మాయమవుతాయి. వలంటీర్‌ వ్యవస్థను ఎత్తి వేస్తారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ అనేది పేద వర్గాలను బలోపేతం చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేస్తుంది. ఈ పరిణామం పెత్తందారీ వర్గాలకు గిట్టదు.

అందుకే ఈ కూటమి పలుమార్లు వికేంద్రీకరణపై అవాకులు చెవాకులు పేలిన విషయం మరిచిపోరాదు.
సమస్త వనరుల మీద తమ పెత్తనం కోసం పెత్తందార్లు పరితపిస్తారు. అందుకోసం నిరంతరం వేటాడుతూనే ఉంటారు. బలహీనవర్గాలకు అధికారంలో వాటా పెరిగితే ఈ వేటగాళ్ల ఆటలు సాగవు.

అందుకే జగన్‌ ప్రభుత్వ విధానాలపై పెత్తందార్లు యుద్ధం ప్రకటించారు. వారి మాయ నాటకాలకు లొంగి పోతే పేదవర్గాల విజయ ప్రస్థానం ఆగిపోతుంది. సామా జిక విప్లవానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పేద ప్రజల విచక్షణ మీద, ఆలోచనాశక్తి మీద పెత్తందార్లకు చిన్నచూపు. అందుకే మిమ్మల్ని ప్రలోభపెట్టాలని చూస్తున్నారు. మిత్రులారా! మీ చైతన్య స్థాయిని చాటిచెప్పండి. విప్లవకర ఎజెండాను జెండాగా ఎగరేయండి! 


వర్దెల్లిమురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement