రాజీవ్‌గాంధీ మన దేశానికి ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. టెలీకమ్యూనికేషన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న కొత్త గాలులకు ఆయన కాలంలోనే భారత్ తెరచాప లెత్తింది. నూతన ఆర్థిక పంథా వైపు అప్పుడే దేశం అడుగులు వేసింది. ఆ తొలి అడుగులే తదనంతర కాలంలో సంస్కరణల ప్రస్థానంగా మారాయన్న సంగతిని అందరూ అంగీకరిస్తు న్నారు. దురదృష్టవశాత్తు చిన్నవయసులోనే రాజీవ్ తీవ్రవాదుల రక్తదాహానికి బలయ్యారు.
భారత క్రీడారంగంలో ఒక అత్యు న్నత పురస్కారాన్ని రాజీవ్ పేరు మీద ఆయన జ్ఞాపకార్థం పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ‘రాజీవ్ ఖేల్‌రత్న’ పేరుతో క్రీడారంగ పురస్కారాలకు తలమానికంగా ముప్ప య్యేళ్లపాటు ఈ అవార్డు కొనసాగింది.
ఏడాది కింద నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులో రాజీవ్ పేరును తొలగించి ధ్యాన్‌చంద్ పేరును చేర్చింది. భారతదేశ క్రీడారంగ కీర్తి పతాకాన్ని దేశదేశాల్లో సమున్నతంగా ఎగరేసిన హాకీ ఎవరెస్ట్ ధ్యాన్‌చంద్. ఈ పేరు మార్పు వల్ల దేశంలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికి, పోరాట పటిమను రగల్చ డానికి ధ్యాన్‌చంద్ పేరే సరైనదని బుద్ధిజీవులందరూ భావిం చారు.
ఈ పేరు మార్పు వల్ల రాజీవ్‌గాంధీకి అవమానం జరిగినట్టుగా ఎవరూ అనుకోలేరు. ఆయన ప్రతిష్ఠ మసకబార లేదు. ఆయన ఘనతలకు మకిలంటలేదు. రాజీవ్‌గాంధీ ప్రత్యే కతలూ, విజయాలు చెక్కుచెదరలేదు. క్రీడారంగ మకుటంపైకి మాత్రం చేరవలసిన రత్నమే చేరింది.
దాదాపుగా ఇటువంటి సన్నివేశమే ఈ వారం ఆంధ్ర ప్రదేశ్‌లో ఆవిష్కృతమైంది. ఎన్టీఆర్ పేరు స్థానంలో రాష్ట్ర ఆరోగ్య విశ్వవిద్యాలయానికి వైఎస్సార్ పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ఒక బిల్లును కూడా ఆమోదించింది.
తెలుగుదేశం పార్టీ అధినాయ కత్వం అంతరాంతరాల్లో మాత్రం ఈ పరిణామం కొంత ఉప శమనాన్నీ, సాంత్వననూ కలిగించింది. ప్రవాహంలో కొట్టుకు పోయేవాడి చేతికి గడ్డిపరక దొరికితే కలిగే ఉపశమనం లాంటిది. ఆ పార్టీలో, దాని అనుబంధ ఎల్లో కూటమిలో సదరు గడ్డిపరక ఎన్నెన్నో భావాల్ని, ఊహల్ని ఎగదోసింది.
ఈ గడ్డిపరకే బ్రహ్మాస్త్రమై మండి రాష్ట్రం రావణకాష్ఠమై కాలుగాక! ధర్నాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలతో జనజీవనం అట్టుడికిపోవుగాక! సప్త సముద్రాలు ఉప్పొంగి విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా పనికిరాకుండా చేయుగాక! జన సమ్మర్దం చెలరేగి తక్షణం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గద్దె దిగును గాక! మన చంద్రన్న అధికారం స్వీకరించాలనీ ఊరూ వాడా ఏకమై అర్జీలు పెట్టుగాక! ఈ రకమైన మంత్రాలు పఠించి వారు గడ్డిపరకను ప్రయోగించారు.
ఒకరో ఇద్దరో మంత్రాలు చదవడం కాదు... వేద పఠనం మాదిరిగా సామూహిక మంత్ర పఠనాలు చేయించారు. పత్రికా కార్యాలయాల్లో, టీవీ చర్చల్లో ఈ సామూహిక మంత్ర పఠన, విలేఖన కార్యక్రమాలు జరి గాయి. ఇతర రాజకీయ పార్టీలను సమీకరించి వారి చేతనూ పఠింపజేశారు. తటస్థుల పేరుతో ఇంకొందర్ని అద్దెకు తెచ్చి చదివింపులు చేయించారు.
మన సినిమాల్లో సతీసావిత్రి, సతీ సక్కుబాయి వంటి నాయికలు మంత్రతుల్యమగు ఇటువంటి శాపనార్థాలను పెట్ట డంలో ప్రసిద్ధి చెందారు. ఈ మంత్ర శాపాలకు ముందు వారు విధిగా ‘నేనే పతివ్రతను అగుదునేనీ’ అంటూ తమ మహత్తును షరతుగా విధించేవారు. ఎల్లో కూటమి ఈ షరతును పెట్టలేదు. ఎందుకో జడుసుకున్నట్టుంది. మంత్రాలకు చింతకాయలే రాల వంటారు. ఇక గడ్డిపరకలు బ్రహ్మాస్త్రాలవుతాయా? అవలేదు.
అక్కడక్కడా ఒక్కపూట ధర్నాలకే శక్తులుడిగిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్‌ను నిజంగా అవమానించింది ఎవరు అనే చర్చ మొదలైంది. అదేదో సినిమాలో ఓ కామెడీ రౌడీ ఉంటాడు. ఆ ముఠా మీద హీరో కాల్పులు జరుపుతాడు. అందరూ పడి పోతారు. ఈ కామెడీ రౌడీ ఒక్కడే నిలబడి ఉంటాడు. ‘అన్నియ్యా! అందర్నీ చంపేశావు, నన్నొక్కడినే వదిలేశావు ఎందుకన్నియ్యా?’ అని అడుగుతాడు కామెడీ రౌడీ.
‘ఒరేయ్! నీకు బాగా కొవ్వెక్కువై తెలియడం లేదు కానీ, నీకు బుల్లెట్ దిగి చాలాసేపైంద’ంటాడు హీరో. ఎన్టీఆర్‌కు అవమానం అనే విషయంలో బుల్లెట్ దిగింది తమకేనన్న విషయం రెండు రోజుల తర్వాత గానీ ఎల్లో కూటమికి అర్థం కాలేదు.
ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుపై శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే వివరణ ఇచ్చారు. డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి స్వయంగా వైద్యుడు. రాజకీయాల్లోకి రాకముందు పేదల వైద్యుడిగా ప్రసిద్ధికెక్కారు. కేవలం ఒక్క రూపాయి ఫీజుతోనే రోగుల్ని పరీక్షించేవారు. అదీ ఇవ్వలేనివారిని ఉచితంగానే చూసే వారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఆరోగ్య రంగంలో అప్పటికి అనూహ్యమైనటువంటి మార్పుల్ని తీసు కొచ్చారు.
ఈ మార్పుల వెనుకనున్న ఆలోచనలకు ఆయన చేసిన పాదయాత్ర పాదు చేసింది. వైద్యరంగం కార్పొరేటీకరణ జడలు విప్పిన రోజులవి. ప్రభుత్వం అనధికారికంగా ఆ రంగాన్ని వదిలివేస్తున్న సమయమది. పెద్ద రోగమొస్తే ఆస్తులమ్ము కోవడం, అవీ లేకుంటే చావు కోసం ఎదురు చూడటం తప్ప మరో దారీతెన్నూ లేని దయనీయమైన కాలం అది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ పాడుకాలపు కృతికర్త మరెవరో కాదు... నారా చంద్రబాబు నాయుడు!
దైన్యాన్ని కళ్లారా చూసిన డాక్టర్ నాయకుని గుండెకు తట్టిన తక్షణ తరుణోపాయం – ఆరోగ్యశ్రీ. ప్రజారోగ్యానికి ఇది సంజీ వని మూలికలా పనిచేసింది. తదనంతర కాలంలో యావత్తు భారతావనికే ఆదర్శంగా నిలబడిపోయిన పథకమిది. అలాగే 108, 104 ఎమర్జెన్సీ సర్వీసులు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం ఏదో ఒక స్థాయిలో అమలుచేయక తప్పని పరిస్థితిని ఈ సర్వీసులు కల్పించాయి.
ఈ కార్యక్రమాల అమలు ద్వారా డాక్టర్ రాజశేఖర రెడ్డి రోగుల పాలిటి ఆత్మబంధువుగా, పేదల పాలిటి పెన్నిధిగా అవతరించారు. అందువల్లనే ఆయన చనిపోయినప్పుడు తెలుగునాట ప్రతి ఇంటి గడపపై శోకదేవత బైఠాయించింది. అందుకే అన్ని వందల గుండెలు పగిలిపోయాయి.
ప్రజారోగ్య రంగానికి డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు వాటికవే చాలు... హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడానికి! కానీ, అంతమాత్రం చేతనే మార్చలేదు. కథ చాలా ఉన్నది. వైఎస్సార్ పేరుతో ఏర్పడిన రాజకీయ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్నది. ఆయన కుమారుడు ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో తిరుగులేని నేతగా ఉన్నారు. ఆయన ఇప్పుడున్న సమాజాన్ని సమూలంగా విప్లవీకరించి సమున్నతంగా నిలబెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందు కోసం వివిధ కీలక రంగాలతోపాటు ప్రజారోగ్య వైద్య వ్యవస్థలో కూడా ఒక మహోద్యమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్రం వచ్చిన డెబ్బయ్యేళ్లలో రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ఇప్పుడు ఒకేసారి 17 కాలేజీలను జగన్ ప్రారం భించారు. 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ‘నాడు–నేడు’ పేరుతో ప్రజారోగ్య వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారు. గ్రామాల్లో కొత్తగా 1032 వైఎస్సార్ విలేజి క్లినిక్స్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్‌ఎమ్, ఆశా వర్కర్ నిరంతరం అందుబాటులో ఉంటారు. 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.
రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నవీక రించారు. ఆ కేంద్రాల్లో గతంలో ‘డాక్టర్ వస్తాడో రాడో’ అనే పరిస్థితి. ‘నర్సు ఉంటుందో ఉండదో’ తెలియని అనిశ్చిత వాతావరణం ఉండేది. అందువల్ల ఖర్చయినా సరే, చిన్న రోగాలకు సైతం జనం ప్రైవేట్ బాట పట్టేవారు. ఇప్పుడు నిర్దేశించిన కార్యక్రమం ప్రకారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇద్దరు డాక్టర్లు, నర్సులు సహా పన్నెండుమంది సిబ్బంది ఉంటారు.
ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలను ఇద్దరు డాక్టర్ల మధ్య విభజిస్తారు. ఒక డాక్టర్ కేంద్రంలో ఓపీని చూస్తుంటే, మరో డాక్టర్ 104 మొబైల్ సిబ్బందితో కలిసి తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తారు. పెద్ద రోగాలతో బాధపడుతున్న వారి గృహాలకు స్వయంగా వెళతారు. మిగిలిన వారిని మొబైల్ దగ్గర పరీక్షించి అవసరమైన మందులు, సలహాలు ఇస్తారు. కొంతకాలం గడిచేసరికి వారికి కేటాయించిన గ్రామాల్లోని రోగులకు సంబంధించిన సమస్త వివరాలు ఆ డాక్టర్‌కు తెలిసిపోతాయి. రోగుల హెల్త్ ప్రొఫైల్ కూడా తయారవుతుంది. ఆచరణలో ఈ ప్రజలందరికీ ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది.
ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉంటే చాలా ప్రమాద కరమైన జబ్బులను మొగ్గదశలోనే గుర్తించి నయం చేసే అవకాశం ఉంటుంది. ప్రజలకు వ్యయ ప్రయాసల భారం తగ్గుతుంది. ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో సైతం ఎగువ మధ్యతరగతి ప్రజలకు కూడా ఒక మంచి ఫిజీషియన్ అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టంగా మారింది. ముక్కు నొప్పి వస్తే ముక్కు డాక్టర్ దగ్గరికీ, మోకాళ్లు నొప్పిచేస్తే... చిప్పలు మార్చివేయాలని సలహాలిచ్చే ఆర్థోల దగ్గరికీ, గ్యాస్‌ట్రబుల్‌తో వెళితే ఇరవై రెండు పరీక్షలు చేసి గుండు గొరిగే పెద్దాసుపత్రుల దగ్గరికీ పరుగెత్తక తప్పడం లేదు. వ్యక్తి ఆరోగ్యాన్ని సమగ్ర దృష్టితో పరీక్షించే ఫిజీషియన్లే దొరక నప్పుడు ఇక ఫ్యామిలీ డాక్టర్ అనే వ్యక్తి ఒక గగన కుసుమం.
ఆ గగన కుసుమాన్ని ఇప్పుడు ప్రతి మారుమూల పల్లెలో, నిరుపేదల ఇంటి ముంగిట్లో పూయించడం కోసం ఒక బృహత్తరమైన ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపైకి ఎత్తుకున్నది. ఈ తరహా ప్రజారోగ్య ఉద్యమం భారతదేశంలో న భూతో! ఏ కార్యక్రమమైనా ఉద్యమ రూపు దాలిస్తేనే ప్రజలకు చేరువవుతుంది. ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతుంది.
ఉద్యమ రూపు దాల్చాలంటే ఆ కార్యక్రమంలోని పాత్రధారు లను ఉత్తేజపరిచే అంశాలు అందుబాటులో ఉండాలి. ఏ ఉద్యమానికైనా తనవైన కొన్ని ప్రతీకలుండాలి. తనదైన కొంత పదజాలం ఏర్పడాలి. తనవైన కొన్ని పేర్లుండాలి. ఉద్యమంలో స్ఫూర్తి నింపగల మూర్తిమత్వం ఉండాలి. ప్రజారోగ్య రంగానికి సంబంధించిన వరకు ఆ మూర్తిమత్వం ఎన్టీఆర్‌లో దొరకదు. వైఎస్సార్‌లో దొరుకుతుంది. అందుకు కారణం ఈ నేపథ్య మంతా!
ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి నంతమాత్రాన ఆయనను అవమానించినట్టు కాదు, ఆయనకు అసలైన అవమానం జీవించి ఉన్నప్పుడే జరిగింది. ఆయన కళారంగంలో ఒక ధ్రువతార. మహానటుడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడని ఆయన అభిమానులు పిలుచుకుంటారు. అది నిజమే! ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. రాజకీయ రంగంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
పేదల సంక్షేమంలో, పాలనా సంస్కరణల్లో తన కాలానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన చనిపోయి 26 సంవత్స రాలవుతున్నది. ఇందులో 14 సంవత్సరాలపాటు ఆయన స్థాపించిన పార్టీయే అధికారంలో ఉన్నది. ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విశేషంగా ప్రభావితం చేసిన రంగాల్లో ఏదైనా సంస్థకో, పథకానికో తెలుగుదేశం పార్టీ ఆయన పేరు పెట్టి ఉండవలసింది. ఆ పని చేయలేదు. ఎమ్‌జీ రామ చంద్రన్‌కు లభించిన ‘భారతరత్న’ పురస్కారం ఎన్టీఆర్‌కు కూడా రావాలని ఆయన అభిమానుల ఆకాంక్ష. చంద్రబాబు రాష్ట్రపతులనూ, ప్రధానమంత్రులనూ నియమించగల స్థితిలో ఉన్నప్పుడు (ఆయనే చెప్పుకున్నట్టు) ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇప్పించగలిగేవారు.
కానీ ఎందుకు ఇప్పించలేదో ఇంతవరకూ ఆయన సంజాయిషీ ఇవ్వలేదు. ప్రజారోగ్య రంగంలో ఎన్టీఆర్ చేసిన కృషి స్వల్పం. హెల్త్ యూనివర్సిటీ మకుటంపైకి ఇప్పుడు అర్హమైన రత్నమే చేరింది. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఇప్పటికే ప్రస్తుత ప్రభుత్వం గౌరవించింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం 14 ఏళ్లలో ఆ పని కూడా చేయలేకపోయింది.
ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీ నుంచి తొల గించడంపై యాగీ చేసి లబ్ధి పొందాలనుకున్న తెలుగుదేశం ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడి చిందెవరు? ఆయన చావుకు కారకులెవరు? ఆయన పార్టీని అక్రమంగా లాక్కున్నదెవరు? ఆయన జెండానూ, బ్యాంకులో ఉన్న నిధులనూ స్వాధీనం చేసుకున్నదెవరు? ఆయనపై చెప్పులు వేయించిందెవరు? ఎన్టీఆర్‌కు నీతి నియమాలు లేవని ‘ఇండియా టుడే’కు ఇంటర్వ్యూలు ఇచ్చింది చంద్రబాబు కాదా? ఎన్టీఆర్ పరువుప్రతిష్ఠలు దిగజార్చేలా నగ్న కార్టూన్లు వేసి దూషణలతో కూడిన రాతలు రాయించింది రామోజీరావు కాదా?
దుర్మార్గులు, కపటులు, మోసగాళ్లని చంద్రబాబు, రామోజీలను ఎన్టీఆర్ విమర్శించలేదా? చంద్రబాబు ఒక మీడియా అధిపతితో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ‘వాడు వీడు’ అని అవాకులు చెవాకులు పేలిన వీడియో బయటకు రాలేదా? ఆ వీడియోపై ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదెందుకు? ఈ రకమైన ప్రశ్నలతో, నాటి పేపర్ల క్లిప్పింగులతో సోషల్ మీడియా నేడు హోరెత్తుతున్నది. ఎన్టీఆర్ పేరుతో బతికి బట్టకడదామనుకున్న ఎల్లో కూటమికి అడుగడుగునా ప్రతిఘటన ఎదురవుతున్నది.
ఎన్టీఆర్ పేరు మార్పుపై సరిగ్గా స్పందిం చలేదని జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతులపై దాడికి దిగబోయిన ఎల్లో కూటమి బొక్కబోర్లా పడింది. వారిని అడుగ డుగునా అవమానించిన ఎల్లో కూటమి, జూనియర్ సినిమాలను దొంగ రివ్యూలతో, తప్పుడు ప్రచారాలతో దెబ్బతీయడానికి ప్రయత్నించిన ఎల్లో కూటమి ధర్మపన్నాలను జనం అసహ్యించు కుంటున్నారు. సినీనటుడు బాలకృష్ణ ట్వీట్‌తో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘పండిత పుత్రః పరమ శుంఠః’ అనే నానుడి మరోమారు రుజువైందని చెప్పుకుంటున్నారు. ఎల్లో కూటమి ఎన్టీఆర్ పేరును జపించినంతకాలం... ఆయన ఆత్మ ఆ కూటమిని శపిస్తూనే ఉంటుంది!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment