ఇంద్రధనుసుపై కుట్ర! | Vardhelli Murali Article On Opposition Conspiracy On Ap Govt | Sakshi
Sakshi News home page

ఇంద్రధనుసుపై కుట్ర!

Published Sun, May 23 2021 12:38 AM | Last Updated on Sun, May 23 2021 2:59 AM

Vardhelli Murali Article On Opposition Conspiracy On Ap Govt - Sakshi

‘ఇప్పటివరకూ నడిచిన మానవ సమాజ చరిత్రంతా వర్గపోరా టాల చరిత్రే’నని జర్మన్‌ తత్వవేత్తలు కార్ల్‌మార్క్స్, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌లు ప్రకటించారు. వారు రచించిన కమ్యూనిస్టు మేని ఫెస్టో అనే కరపత్రం 1848లో అచ్చయింది.

సమాజంలోని ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను కాపాడ టానికే రాజ్యం (State) పనిచేస్తున్నదని వారు అభిప్రాయ పడ్డారు. రాజ్యమంటే... ప్రభుత్వం, దాని ఉపాంగాలు, కోర్టులు, పోలీస్‌ వగైరా టెంటకిల్స్‌ అన్నీ. ఇవన్నీ కూడా ఆధి పత్య వర్గాల ప్రయోజనాలకోసమే పనిచేస్తాయని మార్క్సిజం చెబుతుంది. రాజ్యం, దాని యంత్రాంగం చేతిలో సమాజంలోని మెజారిటీ ప్రజలైన కష్టజీవులు, కార్మికులు, ఉద్యోగులు ఇతర పేదవర్గాల వారు అన్యాయానికీ, అణచివేతకు గురవుతారు. వీరంతా సమష్టిగా పోరాడి ఆధిపత్య వర్గాన్ని అధికారం నుంచి కూలదోసి శ్రామికవర్గ నియంతృత్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసు కుంటారు. ఈ ప్రభుత్వం సోషలిస్టు సమాజ స్థాపనకు పాదు చేస్తుంది. సోషలిస్టు సమాజపు అత్యున్నత దశనే కమ్యూనిజం అంటారు. సమాజం ఆ దశకు చేరుకున్న తర్వాత రాజ్యం, దాని యంత్రాంగాలతో పని వుండదు. రాజ్యం అంతరించిపోతుంది. ఇది రాజ్యం, దాని యంత్రాంగంపై మార్క్సిస్టుల మౌలిక అవగాహన.

కమ్యూనిస్టు మేనిఫెస్టో అచ్చయిన తర్వాత సరిగ్గా వందేళ్లకు భారత రాజ్యాంగం ముసాయిదా సిద్ధమైంది. నాటి రాజ్యాంగ సభలో రచనా సంఘానికి నాయకత్వం వహించిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఈ రాజ్యాంగ ముసాయిదా సిద్ధంచేసి, ప్రజాభిప్రాయం కోసం 1948 జనవరిలో విడుదల చేశారు. కొన్ని మార్పుచేర్పుల అనంతరం 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగ సభ ఆమో దించింది. ఐరోపా సమాజాన్ని కార్ల్‌మార్క్స్‌ ఎంత విస్తృతంగా అధ్యయనం చేశారో, అంతే విస్తారంగా భారతీయ సమాజాన్ని డాక్టర్‌ అంబేడ్కర్‌ అర్థం చేసుకున్నారు. పెట్టుబడిదారీ వర్గం లాభాలకోసం, ప్రయోజనాలకోసం అణచివేతకు, దోపిడీకి గురవుతున్న కార్మికవర్గాన్ని విముక్తం చేయాలని కార్ల్‌మార్క్స్‌ కలలుగన్నారు. భారతదేశంలో ఆధిపత్య వర్గాలు, అణచివేతకు గురవుతున్న వర్గాలు కూడా వర్ణవ్యవస్థ–కులవ్యవస్థల్లో ఘనీ భవించిన వాస్తవికతను అంబేడ్కర్‌ గమనించారు. ఈ అణచి వేతకు సమ్మతిని తెలియజేసే ధర్మ శాస్త్రాలు–కర్మసిద్ధాంతాల ప్రభావాన్ని కూడా ఆకళింపు చేసుకున్నారు. మన సమాజంలోని అణచివేతకు గురవుతున్న కులాలు కేవలం ఆర్థిక దోపిడీయే కాకుండా ఆత్మగౌరవ దోపిడీకి కూడా తరతరాలుగా గురవుతు న్నారని అంబేడ్కర్‌ భావించారు. పీడితవర్గం తన విముక్తికోసం హింసాయుత విప్లవ పోరాటాలకు సిద్ధం కావాలని కార్ల్‌మార్క్స్‌ పిలుపునిచ్చారు.

కమ్యూనిస్టు మేనిఫెస్టో తర్వాత వందేళ్ల కాలగమనంలో వచ్చిన మార్పులు, భారతీయ సమాజంలోని ప్రత్యేక లక్షణాల దృష్ట్యా ప్రజాస్వామ్య ప్రక్రియలోనే పీడిత కులాలు విముక్తం కావాలని అంబేడ్కర్‌ ఆలోచించారు. ఇందుకోసం రాజ్యాంగ రచనా అవకాశాన్ని ఒక ఆయుధంగా ఆయన మలుచుకున్నారు. రాజ్యాంగ సభలోనే పలుమార్లు ఆయన అభిప్రాయాలకు ఆలో చనలకు వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. వాదోపవాదాలు జరి గాయి. చరిత్ర గమనంపై సంపూర్ణ అవగాహన–అభ్యుదయ భావాలూ కలగలసి వున్న పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి వారు రాజ్యాంగ సభలో కీలకపాత్ర పోషించిన కారణంగా అంబే డ్కర్‌ లక్ష్యం కొంత సులువైంది. సామాజిక ఆర్థిక పురోగతికీ, వంచిత వర్గాల విముక్తికీ దోహదం చేయగల రాజ్యాంగం మనకు సిద్ధమైంది.

రాజ్యాంగ లక్ష్యాలను, రాజ్యాంగ రచయితల ఉద్దేశాలనూ ఒక పేజీలో గుదిగుచ్చి రాజ్యాంగ ప్రవేశిక (Preamble)ను తయారుచేశారు. మన రాజ్యాంగం తాత్విక పునాదిని అర్థం చేసుకోవడానికి ప్రవేశిక ఉపయోగపడుతుంది. ఈ దేశ ప్రజ లందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడం రాజ్యాంగ లక్ష్యంగా ప్రవేశిక ప్రకటించింది. సమాజంలో సమా నత్వం,స్వేచ్ఛ, సోదరభావం వెల్లివిరియడం రాజ్యాంగం మరో లక్ష్యమని ప్రకటించింది. రాజ్యాంగ అధికరణాలకు సంబంధించి ఎప్పుడైనా సందిగ్ధ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రవేశిక ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుందంటారు. జస్టిస్‌ కృష్ణయ్యర్, జస్టిస్‌ చిన్నపరెడ్డి వంటి న్యాయమూర్తులు ఈవిధంగా ప్రగతి శీలమైన తీర్పులను అనేకం వెలువరించారు. కొందరు యథా తథవాద న్యాయమూర్తులు అధికరణాలకు యాంత్రిక భాష్యం చెబుతూ భిన్నమైన తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

భారత రాజ్యాంగం ఆదేశించినట్టుగా ప్రజలందరికీ సంపూర్ణంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందుబాటులోకి రాలేదు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం ఇంకా సంతృప్త స్థాయిలో నెలకొనలేదు. ఆధిపత్యవర్గం అనేది ఒకటి ఇంకా కొనసాగడం, ఆ వర్గానికి యధాతథ స్థితిలో ఉండే స్వార్థప్రయో జనం ఇందుకు కారణం. ఆర్థిక–సామాజిక అంతరాలు మరింత విస్తరిస్తున్న కారణంగా రాజ్యాధికారం ఆధిపత్య వర్గాల చేతు ల్లోనే ఇంకా కేంద్రీకృతమై ఉన్నది. అందువల్ల రాజ్య సంబం ధమైన అన్ని విభాగాల్లోనూ, సంస్కృతి, సంప్రదాయాల్లోనూ, ఆలోచనల్లోనూ ఆధిపత్య భావజాలమే పెత్తనం చేస్తున్నది. ఇందుకు చట్టసభలూ, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, ఫోర్త్‌ ఎస్టేట్, కవులు, రచయితలూ, మేధావులు... ఎవరూ మినహా యింపు కాదు. ప్రగతిశీల ఆలోచనాపరులు, స్వచ్ఛమైన ప్రజా స్వామ్యప్రియులు అన్నిరంగాల్లోనూ ఎప్పుడూ ఉంటారు. కాక పోతే అల్పసంఖ్యాకులు కావడం వల్ల, ఆధిపత్య భావజాలంతో పోటీపడి నెగ్గే పరిస్థితి లేదు.

రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు  అనుగుణంగా ప్రజలందరి సమాన పురోగతికి ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వాలు గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ లేకపోలేదు. కాకపోతే ఆధిపత్యవర్గాల ప్రభావం వల్ల ఒకడుగు ముందుకువేస్తే రెండడుగులు వెనక్కు అన్న చందంగా సమతావాద ప్రస్థానం మిగిలిపోయింది. సరిగ్గా రెండు సంవత్సరాల కిందట ఆంధ్రప్రదేశ్‌లో అఖండ ప్రజాభి మానంతో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నది. ఈ దేశంలోని పీడిత వర్గాలు, అణచివేతకు గురవుతున్న వర్గాలన్నింటికీ ఒక ఆశాదీపంగా కని పిస్తున్నది. ఎన్నికల మేనిఫెస్టోకు ఆ పార్టీ అధినేత ఆపాదించిన పవిత్రత, అందులోని హామీలను అమలుచేస్తున్న తీరు ఈ దేశ రాజకీయాల్లో నిస్సంశయంగా ఒక కొత్త శకాన్ని ఆవిష్కరిం చాయి. వెనుకబడిన, బలహీనవర్గాల ప్రజల ఆర్థికాభ్యున్నతితో పాటు, వారి ఆత్మగౌరవ ఉద్దీపనకు కూడా వైఎస్‌ జగన్‌ ప్రణా ళికలు రచించి ఆచరణలో పెట్టారు. ఆరకంగా బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనల్ని సంపూర్ణంగా అమలుచేస్తున్న ఏకైక నాయకునిగా వైఎస్‌ జగన్‌ మిగిలిపోయారు.

మూగకు గొంతివ్వడానికి ఐదేళ్లలోపు మూగ–చెవిటి పిల్ల లందరికీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కాక్లియర్‌ ఇంప్లాంటేషన్లు చేస్తున్నది. చీకటిలో చూపునిచ్చినట్టుగా కంటి సమస్యలను మొగ్గలోనే తుంచేసే కంటి వెలుగు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఉడిగిన వయసుకు ఊతకర్ర మాదిరిగా అవ్వతాత లందరికీ ఒకటో తేదీన సూర్యోదయంతోపాటు సగౌరవంగా పెన్షన్‌ డబ్బులను ఇంటివద్దనే అందజేస్తున్నారు. ప్రస్తుతం 2,250 రూపాయల పెన్షన్‌ వచ్చే జనవరి నుంచి 2,500కు పెంచుతూ బడ్జెట్‌ కేటాయింపులు కూడా చేశారు.

తరతరాలుగా రెట్టింపు అణచివేతకు గురవుతున్న శ్రామిక మహిళల శిరస్సుల మీద మకుటధారణ చేసినంత ఘనమైన కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పుడామె పేరు మీద సొంతింటిని ప్రభుత్వం సమ కూర్చుతున్నది. ఇల్లంటే ఏదో మురికివాడ ఇల్లు కాదు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, కేబుల్‌ కనెక్షన్లు, విశాలమైన బీటీ రోడ్లతో ఓ ఆదర్శ కాలనీ ఇల్లు. ఇంటి నిర్మాణం జరిగిన వెంటనే కనీసపక్షం ఆరేడు లక్షల ఆస్తి ఆమె చేతిలో ఉంటుంది. పిల్లల చదువులో నిర్ణయాధికారం ఆమెదే. అమ్మఒడి పేరుతో జగన్‌ ప్రభుత్వం ఏటా పదిహేను వేల రూపాయలు ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. కన్నబిడ్డల చదువు సంధ్యలు ఆమె ఆకాంక్షల మేరకు నెరవేరబోతున్నాయి. పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు జమానా వరకున్న బ్యాంకు బకాయిలు రూ. 27 వేల కోట్లను వాయిదాల ప్రకారం చెల్లించి ప్రభుత్వం వారికి ‘ఆసరా’గా నిలబడింది. పిల్లలు పెద్దవాళ్లయి పోయి, పనిచేసే శక్తి తగ్గిపోతూ, అస్వతంత్ర ఆర్థిక స్థితిలో ఉండే 45–60 ఏళ్ల మహిళలకు ప్రభుత్వం ‘చేయూత’నివ్వడం గొప్ప మానవీయ కార్యక్రమం. ఆత్మగౌరవాన్ని ఇనుమ డింపజేసే చర్య. ఈ కార్యక్రమాన్ని బలహీనవర్గాల వారితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా ప్రభుత్వం వర్తింపజేసింది.

కృత్రిమ వ్యవసాయ సంక్షోభాన్ని సృష్టించిన గత పాలకుల పుణ్యమా అని మన రైతులు చితికిపోయారు. ఆ చితికిన రైతును ఇప్పుడు మీసం మెలేసి బతికిన రైతుగా నిలబెట్టడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతు భరోసా, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, అందుబాటులో నాణ్యతా ప్రమాణాల పరీక్ష కేంద్రాలు, ధరల స్థిరీకరణ నిధి వగైరాలన్నీ రైతు జీవితాన్ని గౌరవపూర్వకంగా నిలబెట్టేవే.

విద్యా – వైద్య రంగాల్లో మనదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విప్లవాత్మక కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రారం భించింది. మరో ఒకటి రెండేళ్లలోనే ఈ కార్యక్రమాల పూర్తి ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. మారుమూల పల్లెలో ఉన్నా సరే, నెలకు రెండుసార్లు ప్రభుత్వ డాక్టర్‌ ప్రతి ఇంటి గడపనూ తొక్కబోతున్నాడు. అనారోగ్యాన్ని ఆదిలోనే గుర్తించి నయం చేసే వెసులుబాటు కలుగబోతున్నది. ఇంటింటి ఆరోగ్య డైరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉండబోతున్నది. నాడు– నేడు పేరుతో ఇప్పటికే ప్రభుత్వ ఆరోగ్యరంగం పరుగును ప్రారం భించింది. ప్రభుత్వ విద్యారంగం సరికొత్త జవజీవాలను సంతరించుకుంటున్నది. నాడు–నేడు పేరుతో సర్కారు బళ్లు ముస్తాబవుతున్నాయి. ఇప్పటివరకు మూడో వంతు స్కూళ్ల రూపుమారింది. ప్రతి పిల్లవాడికి పైసా భారం లేకుండా ఉన్నత విద్య వరకూ ప్రభుత్వమే బాసటగా నిలబడుతున్నది. పేద బిడ్డలందరికీ ఇంగ్లిష్‌ మీడియంలో చదివే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రానున్న రోజుల్లో ఒక గొప్ప గేమ్‌ చేంజర్‌ కాబోతున్నది. 

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవన్నీ రాబోయే రోజుల్లో గొప్ప సామాజిక మార్పులను తీసుకుని వచ్చే కార్యక్రమాలు. కేవలం సంక్షేమ చర్యలు కావు మానవీయ అభివృద్ధికి నమూ నాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా చెబుతు న్నట్టుగా ‘అభివృద్ధి అంటే రెండు మూడు భవనాలు కట్టడం కాదు, అభివృద్ధి అంటే ప్రజలందరికీ నిన్నటికంటే ఈరోజు బాగుండటం, రేపు మరింత బాగుంటుందన్న నమ్మకం కల గటం’. శ్రీశ్రీ చెప్పినట్టు ‘కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల్‌’ ... ఈ అభి వృద్ధిలో భాగం కాబోతున్నాయి. సబ్బండ వర్ణాలు, కులాలతో కూడిన ఇంద్రధనుస్సు ఒకటి అధికార కేంద్రం మీదుగా ఆకా శంలో పరుచుకుంటున్నది. ‘అలగా’ జనాలంతా హరివిల్లుగా మెరిస్తే ఆధిపత్య వర్గాలు ఊరుకుంటాయా మరి?

లోక కల్యాణంకోసం యజ్ఞాలు చేస్తే త్రేతాయుగం నాటి రాక్షసులే సహించలేదు. ఇప్పుడు ఇంత పెద్దఎత్తున జరుగుతున్న జనకల్యాణోత్సవాన్ని ఎందుకు సహిస్తారు? ఆధిపత్యవర్గాల భావజాలం అన్ని వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. మీడియా అదే మాట్లాడుతుంది. కోర్టులు ఆ ధోరణిలోనే ఆలోచిస్తాయి. ఎంపీ స్థాయి వ్యక్తులు న్యూస్‌చానళ్లను వేదికలుగా చేసుకుని పచ్చిబూతులు మాట్లాడతారు. అటువంటి వ్యక్తులకు కేవలం ఏడాది కిందట హృద్రోగం కారణంగా మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు బెయిల్‌ ఇస్తే మీడియా విరుద్ధమైన కథనాలు అల్లుతుంది. కొన్ని కోర్టుల్లో కామన్‌సెన్స్‌ను సవాల్‌చేసే తీర్పులు వినవలసి వస్తుంది. ఇప్పటికే పూర్తయిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ కోవిడ్‌ కల్లోలం ఎంతకాలం ఉంటుందో తెలియదు. మూడో వేవ్‌ రాదనే గ్యారంటీ లేదు. అదెంతకాలం ఉంటుందో తెలియదు. మళ్లీ ఎన్నికలు పెట్టే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ప్రజాప్రతినిధులు లేకుండా స్థానిక సంస్థలు ఇంకెంత కాలం వేచివుండాలో తెలియదు. 

ఈరోజున ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై జరుగుతున్న దాడి ఈ దేశచరిత్రలో కనీవినీ ఎరుగనిది. పీడిత ప్రజలను సాధికార శక్తులుగా మార్చడానికి ప్రయత్నించడమే ఆ ప్రభుత్వం చేసిన పాపం. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను పవి త్రంగా భావించడం, అంబేడ్కర్‌ ఆశయాలను అనుసరించమే ఆ ప్రభుత్వం చేసిన నేరం. ఐక్యరాజ్య సమితి ప్రబోధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌లను రూపొందించ డమే ఆ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను శిరోధార్యంగా భావించడమే ఆ ప్రభుత్వం చేసిన ఘోరం. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన ఈ పొరపాట్లకు గాను ఆధిపత్య వర్గాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. అందువల్లనే సబ్బండ వర్ణాలతో ఏర్పడిన ఇంద్రధనుసుపై కుట్రపన్నాయి. ఆ ఇంద్రధనుసును ఆవిష్కరించినందుకు ఏపీ ప్రభుత్వ పెద్దపై భయంకరమైన కుట్రకు తెరతీశాయి.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement