మూలికల పేరు చెప్పి, చిట్కాల పేరు చెప్పి రోగాలు మాయం చేస్తామని ప్రచారం చేసుకునేవారికి మన దేశంలో కొదవలేదు. తమకొచ్చిన రోగాలు ప్రాణాంతకమైనవని, నకిలీ వైద్యాన్ని నమ్ముకుంటే ముప్పు కలుగుతుందని తెలియని గ్రామీణ పేద జనం ఎక్కువగా వారి ఉచ్చులో చిక్కుకుని మోస పోతుంటారు. నకిలీ ఔషధాలు అంటగట్టేవారి పనిబట్టడానికి, ప్రజలను వారి బారి నుంచి కాపాడ టానికి మన దేశంలో డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంతోపాటు ఔషధాలు, తాంత్రిక నివార ణల(అభ్యంతరకర వాణిజ్య ప్రకటనలు) చట్టం వంటివి వున్నాయి.
అందినకాడికి సొమ్ము చేసు కోవడానికో, అతిశయించిన ఆత్మవిశ్వాసంతోనో ఎవరైనా తమవద్ద రోగాలు మాయం చేసేందుకు మందులున్నాయని చెబితే ఈ చట్టాల ప్రకారం అది నేరమవుతుంది. వారు శిక్షార్హులవుతారు. కానీ రెండురోజుల క్రితం యోగా గురు బాబా రాందేవ్ తమ సంస్థ కరోనా నివారణకు ఔషధాన్ని రూపొం దించిందని ప్రకటించినప్పుడు దేశంలో చాలామంది అది వాస్తవమే అయివుంటుందనుకున్నారు. బాబా రాందేవ్ పట్ల వారికున్న విశ్వాసం అలాంటిది. కరోనా మహమ్మారిపై అలుముకునివున్న భయాందోళనలు సరేసరి. కానీ ఆ వెనకే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయన ప్రకటనను ఖండించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.
కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు రాత్రింబగళ్లు పరిశో ధనలు చేస్తున్నారు. ఎన్నో ఫార్మా సంస్థలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈ రేసులో విజేత లయ్యేవారికి అంతర్జాతీయంగా వచ్చే గుర్తింపు, ఔషధాన్ని ఉత్పత్తి చేసే సంస్థకు చేకూరే లాభార్జన అంతా ఇంతా కాదు. ఇప్పటికైతే హైడ్రాక్సీ క్లోరోక్విన్, రెమ్‌డెసివిర్ వంటివి కరోనా రోగులకు ఇస్తు న్నారు. అయితే ఇవి ఆ రోగానికి మందులు కాదు. ఆ వ్యాధిబారిన పడినవారి పరిస్థితి దిగజార కుండా ఇవి కాపాడతాయి. ఈ హడావుడిలో తాము రూపొందించిన ఔషధాల కిట్ కరోనా నుంచి అందరినీ కాపాడుతుందంటూ బాబా రాందేవ్ చేసిన ప్రకటన దేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆయన చెబుతున్న ప్రకారం కిట్‌లోని కొరొనిల్, శ్వాసరి ఔషధాలను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు ఏడురోజుల్లో 100 శాతం ఫలితాలొచ్చాయి.
మూడురోజుల పాటు ఈ ఔషధాలు వాడాక 69 శాతంమంది రోగులు పూర్తిగా కోలుకుంటే మిగిలినవారు కోలు కోవడానికి మరో నాలుగు రోజులు పట్టింది. క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా(సీటీఆర్‌ఐ) అనుమతితో రోగులపై ఈ ఔషధాలను ప్రయోగించామని ఆయన వివరించారు. ఈ ఔషధాలను హరిద్వార్‌లోని పతంజలి రీసెర్చ్ సెంటర్, జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సె స్‌లో అభివృద్ధి చేశామని సంస్థ ప్రకటించగా... అటు ఉత్తరాఖండ్, ఇటు రాజస్తాన్ ప్రభుత్వాలు రెండూ దాన్ని ఖండించాయి. అసలు పరీక్షలకు తమ అనుమతి తీసుకోలేదని రాజస్తాన్ ప్రభుత్వం చెప్పగా, దగ్గు మందుపై పరీక్షలు జరుపుతామని తమ నుంచి అనుమతి తీసుకున్నారు తప్ప కరోనా ఔషధమని చెప్పలేదని... అలాగే రోగ నిరోధక శక్తి పెంచే ఔషధమని మాత్రమే దరఖాస్తులో సంస్థ పేర్కొందని ఉత్తరాఖండ్ తెలిపింది. కరోనిల్‌లో వాడిన అశ్వగంధ, తులసి, తిప్పతీగ వంటివి ఎవరికీ తెలియనివి కాదు. అశ్వగంధకు రోగనిరోధక శక్తి పెంపొందించడంలో, నాడీ వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడుతుందన్న పేరుంది. తులసి, తిప్పతీగ వంటివి కూడా వాడకంలో వున్నవే.
ఆయుర్వేద ఔషధాలు ఉత్పత్తి చేయడం బాబా రాందేవ్ ఆధ్వర్యంలోని సంస్థలకు కొత్తగాదు. ఔషధాలకు సంబంధించి దేశంలోవున్న చట్టాలేమిటో, వాటిని మార్కెట్‌లోకి విడుదల చేసేముందు పాటించాల్సిన విధివిధానాలేమిటో ఆయనకు తెలియవనుకోలేం. అవేమీ పాటించకుండా అంత ధైర్యంగా బాబా రాందేవ్ కరోనా నివారణ ఔషధమంటూ ఎలా ప్రకటించారన్నది అంతుబట్టదు. తమ పరీక్షలకు సంబంధించిన డేటాను ఇప్పటికే సంబంధిత సంస్థలకు పంపామని పతంజలి ఆయుర్వేద్ సంస్థ చెబుతోంది. వారి నుంచి ఇంకా అనుమతి వచ్చిన దాఖలా లేదు. ఔషధ ప్రయో గాలకు నిర్దిష్టమైన విధానాలుంటాయి. తాము పరీక్షలు నిర్వహించబోతున్నామని, అందుకు ఫలానా వారిని నమూనాలుగా తీసుకోదల్చుకున్నామని ఎథిక్స్ కమిటీకి తెలియజేయాలి.
ప్రయోగాలు చేసే పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఆ వివరాలన్నీ ఇవ్వాలి. పరీక్షల్లో పాల్గొంటున్న రోగుల్లో ఆడ, మగ వివరాలు, వారి వయసు, వారిలో వున్న వ్యాధి తీవ్రత స్థాయి తదితర వివరాలు నమోదు చేయాలి. ప్రతి దశలోనూ ఔషధాన్ని వినియోగించినప్పుడు కలుగుతున్న మార్పుల్ని స్పష్టంగా నమోదు చేయాలి. ఆ డేటా మొత్తాన్ని సీటీఆర్‌ఐకి పంపాలి. వారి నుంచి అనుమతి లభించాకే ఔషధ ఉత్పత్తి ప్రారంభించి, అందుకు సంబంధించిన వాణిజ్య ప్రకటన ఇవ్వాలి. ఇవేమీ లేకుండా నేరుగా కరోనాకు మందు కనిపెట్టామంటూ హడావుడి చేయడం చట్టప్రకారం చెల్లుబాటు కాదు.
దేశీయ వైద్య చికిత్స ప్రక్రియలకు విశ్వసనీయత లేదనేవారు, వాటిని నమ్మనివారు దేశంలో దండిగానే వున్నారు. ఆ ఔషధాలు వాడేవారిలో వుండే దృఢమైన నమ్మకం వారిని స్వస్థపరుస్తుంది తప్ప, వాటికి నిజంగా రోగాన్ని తగ్గించే శక్తి వుండదని విమర్శకులంటారు. శాస్త్రీయమైన విధానాల్లో పరీక్షలు జరిగి, నిగ్గుతేలేవి కనుక అల్లోపతి ఔషధాలు మాత్రమే నమ్మదగినవని, మిగిలినవన్నీ బూటకమైనవనీ చెబుతారు. చాలా దేశాల్లో హోమియోపతి, యునాని, ఆయుర్వేద వంటి చికిత్సా విధానాలకు చోటు లేదు.
కానీ మన దేశంలో దేశీయ వైద్య చికిత్స ప్రక్రియల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఆ శాఖ కింద ఆయుర్వేదం, యునాని, హోమియోలను ప్రోత్స హిస్తున్నారు. అయితే వ్యాధిని అరికట్టేందుకు రూపొందించే ఏ ఔషధమైనా అన్ని రకాలుగా నిగ్గుదేలి జనం ముందుకు రావాలి తప్ప ఇష్టానుసారం ప్రకటించుకోకూడదు. నిర్దిష్టమైన నియంత్రణ విధానం అనుసరించకపోతే అంతిమంగా దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది.
Comments
Please login to add a commentAdd a comment