కత్తి మొనపై ఎంత దూరం? | Vardelli Murali Special Article On English medium In Government Schools | Sakshi
Sakshi News home page

కత్తి మొనపై ఎంత దూరం?

Published Sun, Apr 19 2020 12:01 AM | Last Updated on Sun, Apr 19 2020 8:22 AM

Vardelli Murali Special Article On English medium In Government Schools - Sakshi

లిటిగెంట్‌ ఫెలోస్‌. ఈ జాతి బ్రిటిష్‌ కాలం నుంచే చిగురేసి మొగ్గ తొడిగింది. నూటాయాభై ఏళ్ల కిందటి సామాజిక స్థితిపై మహాకవి గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకంలో రామ ప్పంతులు పాత్రను వారి జాతిపిత అనుకోవచ్చు. తన మాట వినని వాళ్లనూ, గిట్టని వాళ్లనూ డ్యామేజీ దావా వేస్తానని బెది రిస్తూ గడిపేస్తుంటాడు. గిరీశం మీద మరీ పట్టలేని కోపం వచ్చి నప్పుడు ‘ఆ వెధవని పజ్యండు కోర్‌ట్లంటా తిప్పకపోతే నేను రామప్పంతులును కాదు, చూడు నా తమాషా’ అంటూ శప థాలు కూడా చేస్తాడు. ఇంతకూ ఈ పంతులుగారు లాయర్‌ కాదు. గ్రామకరణం మాత్రమే. కాకపోతే కోర్టుల చుట్టూ తిరిగీ తిరిగీ వాటి గుట్టుమట్లనూ, లా పాయింట్లనూ, వాటిలోని లొసు గుల్నీ బాగా కనిపెట్టేశాడు.

అందువల్ల ‘దొంగ సాక్ష్యాలు లేక పోతే కేసులు ఎట్లా గెలుస్తామ’నే లోకరీతిని వంటబట్టించుకు న్నాడు. దేశంలో న్యాయవ్యవస్థతో పాటు దాని చల్లని ఛాయలో లిటిగెంట్ల వ్యవస్థ కూడా అభివృద్ధి చెందింది. ఇప్పుడది మరింత వ్యవస్థీకృతమై రాజకీయ రంగాన్ని కూడా శాసించే స్థాయికి చేరింది. రకరకాల పార్టీల్లో, వేరువేరు కొంపల్లో నిద్రించే తన స్లీపర్‌ సెల్స్‌ను కనుసైగలతో మేల్కొలిపి తన చేతికి మట్టి అంటకుండా కావలసిన దావాలను కోర్టుల్లో వేయించే రాజకీయ నాయకుడు ఎవరు? సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని సదరు దావాలు గెలిచేలా చూడగలిగే శక్తి ఎవరికి ఉంది?... తెలుగు ప్రజలను ఈ ప్రశ్నలు అడిగితే ‘సిల్లీ క్వశ్చన్స్‌’ అని నవ్వు కుంటారు. రామప్పంతులు టూ ది పవర్‌ ఆఫ్‌ నూటాయాభై ఏళ్లు అనేదాని విలువెంతో ఆయన లిటిగేషన్‌ హార్స్‌ పవర్‌ అంతన్నమాట.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ఏ అంశాల ఆధారంగా కోర్టు కొట్టివే సిందీ, కోర్టుకు వెళ్లిన వారెవరూ, వారిని ప్రేరేపించిన వారెవరు? దాని వెనుక వారికి ఉన్న ప్రయోజనాలు ఏమిటీ అనే విషయా లను ప్రస్తుతానికి పక్కనేపెట్టి వివాద నేపథ్యాన్ని పరిశీలిద్దాము. గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా పడిపోతూ ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు అదే నిష్పత్తిలో పెరగసాగింది. ఈ పరిస్థితి ఇట్లాగే సాగితే ఇంకొన్నేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా అంతరించే పరిస్థితి ఏర్పడవచ్చు. సమాజ హితానికి ఇంతకన్నా చెరుపు ఇంకేమీ ఉండదు.

ప్రాథమిక విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే వుండాలనీ, సంపన్నుల పిల్లలైనా, పేదవర్గాల పిల్లలయినా ఒకే రకమైన స్కూళ్లలో, ఒకే రకమైన వాతావరణంలో చదువుకున్న ప్పుడే వారి మధ్య సమభావన, ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవడుతుందని, సమాజం పట్ల అవగాహన పెరుగుతుందని పలువురు విద్యావేత్తలు, సామాజికవేత్తలు అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగం ఆకాంక్ష కూడా అదే. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని వెల్లడి చేస్తూ ఆరు వాక్యాల్లో రాసుకున్న పీఠిక (Preamble)) కూడా అందరికీ సమాన అవకాశాలకు హామీ ఇచ్చింది. రాజ్యాంగ రచనా కాలం నాటికి భారతీయ సమా జంలో ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలను దృష్టిలో ఉంచుకొని, బలహీన వర్గాల వారు కూడా సమానస్థాయికి చేరుకొని అవ కాశాల కోసం పోటీపడే విధమైన రక్షణలు ఉండాలనే దృష్టి కోణం దీనివెనుక వుంది. ఈ ఆకాంక్షలకు భిన్నమైన వాతావ రణం నేడు నెలకొని ఉన్నది.

ప్రైవేట్‌ పాఠశాలలు పూర్తిగా ఇంగ్లిష్‌ మాధ్యమంపైనే కేంద్రీకరించాయి. కనీసం ఒక భాషగా కూడా తెలుగును బోధించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుకుంటున్న విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్‌ తదితర సబ్జెక్టుల్లో ఇప్పటివరకు కూడా సరైన పద కోశాన్ని మన విద్యావ్యవస్థ అందించలేకపోయింది. తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లిష్‌ చదవడం కంటే కష్టతరమైన కృతక పదజాలంతో సాంకేతిక విషయాలను చదవాల్సి వచ్చింది. ఉన్నత విద్యలోకి ప్రవేశించేసరికి ఆ విషయాలను సహజమైన ఇంగ్లిష్‌లో చదువుకున్న విద్యార్థులతో కృతక పఠనం కారణంగా తెలుగు మీడియం విద్యార్థులు పోటీపడలేక పోయారు. ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు, ఉన్నతోద్యోగాల్లో అవ కాశాలు ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులకే వస్తున్నాయి. అవ కాశాలతోపాటు ఇంగ్లిష్‌కు ఒకరకమైన సామాజిక హోదా– గౌరవం ప్రత్యేకంగా లభిస్తున్న వాస్తవికతను పిల్లల తల్లి దండ్రులు గ్రహించారు. ఇంగ్లిష్‌కు సామాజిక హోదా ఇప్పుడే కాదు. రామప్పంతులు కాలం నుంచీ ఉంది.

గిరీశం గాడు నాలుగు ‘బట్లేరు’ ముక్కలు నేర్చినందువల్ల మధురవాణి దగ్గర తనకంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నాడన్న దుగ్ధ రామ ప్పంతులును ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఇంగ్లిష్‌ సామా జిక హోదా, అది కల్పించే అవకాశాలు ఇప్పుడు ఇంకా పెరి గాయి. అది విశ్వభాషగా మారి కూర్చుంది. ఈ ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఇంగ్లిష్‌లో మాట్లాడగలగడం అదనపు అర్హతగా మారింది. ఈ నేపథ్యంలో ఖరీదైనా సరే తమ పిల్లల్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలోనే చదివించాలన్న ధోరణి తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. అంతో ఇంతో స్తోమత కలిగిన కుటుంబాల పిల్లలు ప్రైవేట్‌ బాట పట్టడంతో ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలినవారంతా నిరుపేద కుటుంబాల పిల్లలే. సామాజిక లెక్కల ప్రకారం చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పిల్లలు. నోరున్నవాళ్లు, పలుకుబడి కలిగినవారి పిల్ల లంతా ప్రైవేటు బాట పట్టడంతో సర్కారు బళ్లను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. కనీస వసతులు లేకుండా ఈ స్కూళ్లు శిథిలమైపోవడం మొదలైంది. టెన్త్‌ క్లాసుతోనే ఈ పిల్లల్లో అత్యధికులు డ్రాపౌట్లుగా మారుతున్నారు.

అందరూ ఇంగ్లిష్‌ మీడియంలో చదివి ఉన్నత స్థానాల్లోకి వెళ్లిపోతే శ్రీమంతులకు నౌకర్లు, డ్రైవర్లు దొరకరనే భయంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం పేద వర్గాల్లో బలపడుతున్నది. అది కూడా నిజమే అనుకోవలసి వస్తున్నది. ప్రైవేట్‌ పాఠశాలల్లో తెలుగును కనీసం ఒక సబ్జెక్టుగా కూడా అమలు చేయకపోయినా ఏనాడూ ఒక్క మాటైనా మాట్లా డనివారు పేదపిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం అనగానే పెద్దపెట్టున గర్జించడం, గాండ్రించడం, ఓండ్ర పెట్టడం మొదలగు శబ్దాలు చేయడం ప్రారంభించారు. దీన్నెట్లా అర్థం చేసుకోవాలి? దురదృష్టవశాత్తు ప్రధాన ప్రతిపక్షం సహా కొన్ని చిన్నాచితకా పార్టీలకు కూడా తెలుగు భాష ఇప్పుడే గుర్తుకొస్తున్నది. కాటుక కంటి నీరు కారుస్తూ కలలోకి వస్తున్నది. ఒకటో క్లాసు పిల్లాడికి బోధన మాధ్యమాన్ని ఎంపిక చేసుకొనే హక్కు లేకపోవడం అప్రజాస్వామికమని తోస్తున్నది.

ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా ఈ సమూహం మొత్తా నికి ప్రతిపక్షనేత నాయకత్వం వహిస్తున్నారని తేటతెల్లమై పోతున్నది. ఆయన నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం లేదు. తెలుగులో ఎల్లో మీడియాగా అపకీర్తి పొందిన కొన్ని పత్రికలు, చానళ్లలో వచ్చే వార్తల ప్రాధాన్యతలను గమనిస్తే చాలు, ప్రతిపక్షనేత సొంత అభిప్రాయాలేమిటో తెలిసి పోతుంది. ‘పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామ భద్రుండట’ అంటాడు బమ్మెర పోతన తన భాగవతం గురించి. ఈ వాక్యాలకు ఒక దుష్ట పేరడీ ‘పలికెడిది పచ్చ మీడియా, పలికించెడివాడు బాబుమియా’. ఇది జనంలో ఒక నానుడిగా స్థిరపడిపోయింది. ఇంగ్లిష్‌ మీడియం జీవోను హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఎల్లో మీడియాలో జరిగిన పండుగ సంబరాలను గమనిస్తే, ఈ శిబిరానికి కష్టజీవుల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడం ఏమాత్రం ఇష్టంలేదని రూఢీగా తెలిసిపోయింది. ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని వ్యతిరేకిస్తూ వీళ్లు చెబు తున్న కుంటిసాకులు హాస్యాస్పదంగానే కనిపిస్తున్నాయి.

ఇంగ్లిష్‌ మీడియం పెడితే, తెలుగు సెక్షన్లు కూడా విడిగా పెట్టాలట. మీడియం ఎంపిక చేసుకొనే స్వేచ్ఛ ఇవ్వాలట. మరి ప్రైవేట్‌ పాఠశాలల్లో కూడా ఇటువంటి ఏర్పాటు ఉండాలన్న డిమాండ్‌ ఎందుకు చేయలేదని పేదవర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. దాదాపు నూరుశాతం పాఠశాలల పేరెంట్స్‌ కమిటీలు తమకు ఇంగ్లిష్‌ మీడియం కావాలని తీర్మానం చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ వాస్తవాన్ని మరుగుపరిచి తెలుగు సెక్షన్‌లకు డిమాండ్‌ చేయడం విడ్డూరం. నూటికి ఇద్దరో ముగ్గురో తెలుగు మాధ్యమాన్ని ఎంపిక చేసుకుంటే ఏం చేయాలి? మండలానికి ఒకటో, అసెంబ్లీ నియోజక వర్గానికి ఒకటో తెలుగు మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేయవలసి వస్తుంది. తెలుగు భాషాసేవ పేరుతో ప్రభువులకు సేవ చేయడానికి ఆమాత్రం సంఖ్యాబలం చాలా? అందరూ ఇంగ్లిష్‌ మీడియంలో చదివేస్తే తెలుగు భాషా, సాహిత్యం అంతరించిపోతుందేమోనన్న భయం కొంతమందిని వెంటాడుతున్నది. వీరి పిల్లలు ఇంగ్లిష్‌లో చదివి ఉన్నతోద్యో గాలు చేస్తుంటే తెలుగు సాహిత్యం కోసం పేద పిల్లలు దీక్ష బూనాలన్నమాట. అయినా తెలుగు మీడియంలో చదవనంత మాత్రాన భాషా, సాహిత్యం అంతరిస్తున్నదని చెప్పడానికి శాస్త్రీయ ఆధారం ఏమున్నది? సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి సోదరులు, కాళోజీ నారాయణరావు, సినారె, పీవీ నర్సింహా రావు, వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటివారు ఉర్దూ మీడియంలో విద్యాభ్యాసం చేసి తెలుగు సాహితీవేత్తలుగా కీర్తి గడించలేదా?

ఈ దేశంలోని శ్రామిక వర్గాల ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని అందుకోకుండా ఇంకెన్నాళ్లు సాకులు చెబుతారు? ఎక్కడో ఒక చోట జగన్‌మోహన్‌రెడ్డి వంటి బలమైన నాయ కులు పేదలకు అండగా ముందడుగు వేస్తే అభాండాలతో ఎంతకాలం అడ్డుకోగలరు? ఏదో ఒక రోజున నవజీవన బృందా వనాన్ని చేరుకోగలమనే ఆశతో, నమ్మకంతో వాళ్లు నడుస్తూనే ఉన్నారు. తరతరాలుగా నడుస్తూనే ఉన్నారు. పల్లేరుకాయల మీద నడిచిన పాదాలతో వాళ్లు నడుస్తూనే ఉన్నారు. పజ్జొన్న అంబలి తాగిన అర్ధాకలితో వాళ్లు నడుస్తూనే ఉన్నారు. మీరు లాక్‌డౌన్‌ కళాపోషణలో వుంటే వాళ్లు మండుటెండల్లో నడుస్తూనే వున్నారు. గమ్యం తెలియకుండా నడుస్తూనే ఉన్నారు. రహదారు లపై వాళ్లే, రైలు పట్టాలపై వాళ్లే. నడుస్తూనే ఉన్నారు. దారి పొడుగునా గుండెనెత్తురులు తర్పణ చేస్తూ ఇంకెన్ని మైళ్లు నడవాలి? అన్నార్తులు, అభాగ్యులుండని ఆ నవయుగమదెంత దూరం?


వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement