రాయలవారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణ కవి మోస్ట్ పాపులర్. ఆయనకు వికటకవిగా పేరు. తెనాలి రామలింగడు అనే పేరుతో ఆయన మీద అనేకానేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి సందర్భానికి కూడా పనికివచ్చే ఒక చిన్న కథను ఒకసారి గుర్తు చేసు కుందాము. కృష్ణదేవరాయల వారు హాస్యప్రియుడు. సమయస్ఫూర్తి, సరస సంభాషణా చతురత కలిగిన రామకృష్ణుడంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. మిగిలిన కవులకు, కొలువులోని ఉన్నతోద్యోగులకు ఇది కంటగింపుగా ఉండేది. రామకృష్ణ కవి మీద అడపాదడపా చాడీలు చెబుతుండేవారు. కుట్రలు చేస్తుండే వారు. తన తెలివితేటలతో వాటి నుంచి ఎప్పటికప్పుడు రామకృష్ణుడు బయటపడేవారు.
ఒక రోజు రాజుగారిని కలవడానికి తెనాలి రామకృష్ణుడు బయల్దేరాడు. రాజాశ్రయంలో అతని ప్రభ వెలుగుతున్న రోజు లవి. అపాయింట్‌మెంట్ లేకపోయినా సరే భటులు అతడిని ఆపేవారు కాదు. వినయంగా నమస్కరించి లోపలికి పంపించే వారు. ఈసారి ఎందుకనో తేడా కొట్టింది. భటుడు నిర్లక్ష్యపు చూపు విసిరాడు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డు కున్నాడు. మొదట ఖంగుతిన్న రామకృష్ణ కవి వెంటనే తేరుకొని తనకు అపాయింట్‌మెంట్ ఉన్నదని చెప్పాడు. అయితే నేనొక సమస్యనిస్తాను, దాన్ని పూరించి పద్యం చెప్పమన్నాడు భటుడు. ఇప్పుడు మనం చూస్తున్న అవధాన ప్రక్రియల్లో ఈ సమస్యాపూరణం కూడా ఒకటి. భటుడు సమస్యాపూరణం అడగటమేమిటని సందేహిస్తూనే సరే, అడగ మంటాడు రామకృష్ణ కవి.
‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే సమస్య నిస్తాడు భటుడు. ఒక ఏనుగుల గుంపు దోమ గొంతులోకి దూరిందట. ఆ వాక్యాన్ని అలాగే ఉంచి మిగతా పద్యం చెప్పాలి. ఆ సమస్య ఎక్కడి నుంచి భటుడికి చేరి వుంటుందో రామకృష్ణ కవికి అర్థమైంది. దాని వెనుక ఉన్న కుట్ర కథ కూడా అర్థమైంది. భటుడికి భారీగా లంచం ఎరవేసిందెవరో కూడా కనిపెట్టగలి గాడు. బాగా కోపమొచ్చింది. భటుణ్ణి బండ బూతులు తిడు తూనే సమస్యను పూరించి వెళ్లిపోయాడు.
‘గంజాయి తాగి దుష్టుల సంజాతము చేత, కల్లు చవి గొన్నావా .......కొడక, ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్’ అని పూరణ రూపంలోనే కవి ప్రశ్నించాడు. ‘ఏనుగులు దోమ గొంతులోకి పోవడమేమిట్రా! గంజాయి దమ్ముకొట్టి, మద్యం సేవించి డ్యూటీ కొచ్చినావా’ అని కళ్లెర్ర జేశాడన్నమాట. విషయం తెలుసుకున్న రాయలవారు ఇదే సమస్య మీద మహాభారత కథతో పద్యం చెప్పమని కోరగా ఒక అందమైన పద్యం చెబుతాడు. అదంతా వేరేకథ.
రాజుల దగ్గరనే కాదు, రాజకీయ నాయకుల దగ్గర కూడా భటులుంటారు. హీరోల దగ్గరే కాదు కాదు, విలన్‌ల దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్లను బంటులని పిలుస్తున్నాము. ఉచ్చనీచాలెంచకుండా స్వామి కార్యం నెరవేర్చడమే ఈ బంటుల తక్షణ కర్తవ్యం. తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర కూడా కొందరు బంట్లున్నారు. ఆంబోతుల్ని ఊరిమీద వదిలేసే చందంగా అధికారంలో ఉన్నప్పుడు వీరిని జిల్లాల మీద వదిలేసే వారు. ఈ ఆంబోతులు ఎవరి చేన్లోనైనా దూరవచ్చు. మేత మేయవచ్చు. తొక్కేయవచ్చు. సర్వాధికారాలుంటాయి. బదులుగా బాస్ ఎవరిపేరు చెబితే వారి మీదకు కాలుదువ్వడం, కొమ్ము విసరడం లాంటి విద్యల్ని ఆంబోతులు ప్రయోగించాలి. బంట్లు కూడా అంతే.
అయ్యన్న పాత్రుడు అనే బంటు రెండు రోజుల కింద కాలు దువ్వాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీదనే చిల్లర కామెంట్లు విసిరాడు, మంత్రులను, పోలీసు అధికారులను, ఎమ్మెల్యేలను కూడా వదల్లేదు. ఆ వేదిక మీద చంద్రబాబు కూడా ఉన్నారు. ఆ సమయంలో బంటును ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన హావ భావాలున్నాయని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. నర్సరావు పేటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్న వాడిన భాష పత్రికల్లో రాయడానికి అభ్యంతరకరమైనది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన ఒక్క కామెంట్ చేసినందుకే ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేంద్రమంత్రిని సైతం జైలుకు పంపించారు. అటువంటప్పుడు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే యథేచ్ఛగా తిట్లవర్షం ఎలా కురిపించగలిగాడు? బాస్ కట్టిన తావీజు మహిమ.
తెనాలి రామలింగడి కథలో ఉన్నట్టే, ఇక్కడ కూడా కుట్ర నేపథ్యం ఉన్నది. గంజాయి దమ్ము ఉన్నది. మద్యం దందా ఉన్నది. లంచాలు మేయడం ఉన్నది. ఒక్కొక్కటే బయటకొస్తున్న అయ్యన్న ఘనకార్యాల చిట్టాను చూస్తుంటే ఔరా అనిపిస్తున్నది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో ఉన్న లేటరైట్ ఖనిజ నిక్షేపాలను అయ్యన్న కొడుకు తవ్విపోసి వందల కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నాడని ఆధారాలతో కూడిన ఆరోపణలున్నాయి. అయ్యన్న కొడుకు నిర్వాకంలో లోకేశ్‌బాబు కూడా భాగస్వామేనని నర్సీపట్నం ప్రాంతంలో చెప్పుకుంటారు.
ఈ మైనింగ్ కోసం రెండు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి వందలాది అత్యంత విలువైన అటవీ వృక్షాలను కొట్టి వేయిం చారనీ, ఎటువంటి అనుమతుల్లేకుండానే సుందరకోట నుంచి అక్రమ రోడ్డును వేసుకొని ఖనిజాన్ని తరలించారన్న ఆరో పణలకు ఆధారాలున్నాయి. మన్యంలోని దట్టమైన అడవుల్లో వందల ఎకరాల్లో గంజాయి పండించి స్మగ్లింగ్ చేయించడంలో అయ్యన్న దిట్ట అని ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడే చెప్పారు. గతంలో ఒకసారి తన మాట వినలేదని ఒక మహిళా అధికారిని బట్టలూడదీసి కొడతానని బహిరంగంగానే అయ్యన్న బెదిరించారు. చంద్రబాబు జమానాలో విశాఖ మన్యం ఇలాఖా అయ్యన్న ఇష్టారాజ్యంగా మారింది. ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిపోయింది. అందుకు కృతజ్ఞతగానే నర్సరావుపేట సభలో అయ్యన్న పూనకాన్ని ప్రదర్శించారని అనుకోవచ్చు. ఇది సహజమైన పూనకం కూడా కాదు. ఇందులో ఎమోషనల్ ఎలి మెంట్ కనిపించలేదు. బాబు ఇషారా అందగానే అయ్యన్న విషం కక్కడం మొదలుపెట్టాడని సాక్షుల కథనం.
ఈ సభ జరగడానికి కేవలం రెండు గంటల ముందే స్థానిక సంస్థల కౌంటింగ్‌కు సంబంధించిన తీర్పు వెలువడింది. ఆదివారం కౌంటింగ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయ బోతున్నది. మీడియా స్థలాన్ని, సమయాన్ని ఈ వార్త రోజంతా ఆక్రమించకూడదు. తెలుగుదేశంలో మిగిలిన శ్రేణుల నైతిక బలం దెబ్బతినకూడదు. ఇదీ లక్ష్యం. అప్పటికప్పుడు సిద్ధమైన వ్యూహం ప్రకారమే అయ్యన్న పూనక ప్రదర్శన జరిగింది.
ముఖ్యమంత్రిపైనే తిట్ల వర్షం కురిపించిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చోవు కదా! వాళ్లూ కౌంటర్ విమర్శలు చేశారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటిముందు నిరసన తెలపడానికి వెళ్లాడు. వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాన్ని ముందే ఊహించింది. బాబు ఇంట్లో ఉన్న పార్టీ మందను ఉసిగొల్పింది. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. కార్యకర్తలకు గాయాల య్యాయి. ఎల్లో మీడియా అండతో ఈ ఎపిసోడ్‌కు తాము కోరు కున్న ట్విస్టును తెలుగుదేశం పార్టీ ఇచ్చుకున్నది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై దాడి చేయడానికే జోగి రమేశ్ బృందం వచ్చిందనే ప్రచారాన్ని లేవ దీశారు. ఎల్లో మీడియా, అనుంగు సోషల్ మీడియా శోకాలు పెట్టడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే. నిరసన తెలపడానికి వచ్చినవారిపై దాడిచేసి కొట్టింది తెలుగుదేశం వారే. ఇప్పుడు లబలబలాడుతున్నదీ తెలుగుదేశం వారే. ఆదివారం నాడు ఎల్లో మీడియాలో ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంటుంది. సాయం త్రానికైనా సద్దుమణుగుతుందో లేదో చూడాలి.
తమ పార్టీకి మింగుడుపడని సన్నివేశాలు ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలుగు దేశం పార్టీ చేస్తున్నది. గత రెండేళ్లలో కనీసం డజన్ సంద ర్భాలను ఉదాహరణగా చూపెట్టవచ్చును. 2019 నవంబర్ 14 రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనబడి నాడు – నేడు కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన గావించే విప్లవాత్మక కార్యక్రమం ఇది. ఒకపక్క ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుండగానే గుంటూరులో దుర్గ గుడిని కూల్చివేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. అక్కడ జరిగిందేమి టంటే రోడ్డు విస్తరణ కోసం ప్రజల సమ్మతితో, పోలీసుల అనుమతితో గుడిని కొంచెం పక్కకు జరిపి నిర్మించారు.
గడిచిన సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే పిఠాపురంలోని ఓ ఆలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయని బీభత్సమైన ప్రచారం జరిగింది. విచారణలో అది తప్పుడు వార్తని తేలింది. ‘దిశ’ పోలీస్ స్టే్టషన్లను ప్రారంభించిన తర్వాత వరసగా నాలుగు రోజులపాటు ఆలయాల మీద దాడులు జరిగాయని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేశారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజున, జగనన్న విద్యాకానుక ప్రారంభానికి రెండు రోజుల ముందు బీసీలకు, 56 కార్పొరేషన్లు ప్రకటించిన మరునాడు ఇటువంటి వార్తల్నే వ్యాప్తిలో పెట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల నాలుగు నెలలైంది. ఎన్నికల ముందు జనం ముందుంచిన మేనిఫెస్టోను దాదాపుగా అమలు చేసింది. మరో రెండున్నరేళ్లలో జరగబోయే ఎన్నికల కోసం జనంలోకి వెళ్లేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరకలెత్తుతున్నది. ఈ పద్ధతిలో ముఖాముఖి పోటీపడగల స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. మబ్బుల చాటు నుంచి యుద్ధం చేసే ఇంద్రజిత్తు వ్యూహాన్ని ఆశ్రయించబోతున్నది. అది వ్యవస్థల మాటున దాక్కొని దాడులు చేయాలని చూస్తున్నది. మీడియా భుజాలపై తుపాకులు పెట్టి కాల్పులు జరపాలని ఆలోచిస్తున్నది. విషప్రచారాలతో కూడిన ఒక కృత్రిమ సుడిగాలిని సృష్టించే సన్నాహాల్లో ఉన్నది. కవ్వింపులకు, రెచ్చగొట్టే చర్యలకు దిగబోతున్నది. ఈ రెండున్నరేళ్లు అరాచక – అప్రజాస్వామిక చర్యలకే అది బరితెగించబోతున్నది. చైతన్యవంతులైన ప్రజలు ఆ పార్టీ పోకడలను అర్థం చేసుకుంటున్నారు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
గంజాయి తాగి, మందు కొట్టినవా?
Published Sun, Sep 19 2021 12:58 AM | Last Updated on Sun, Sep 19 2021 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment