మహిళలను గౌరవిస్తే 23 సీట్లేనా? | Mekathoti Sucharitha Comments On Chandrababu Naidu TDP | Sakshi
Sakshi News home page

మహిళలను గౌరవిస్తే 23 సీట్లేనా?

Published Sun, Sep 19 2021 2:54 AM | Last Updated on Sun, Sep 19 2021 7:34 AM

Mekathoti Sucharitha Comments On Chandrababu Naidu TDP - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఐదేళ్ల పాలనలో మహిళలను మీరు గౌరవించి ఉంటే.. మీకు 23 సీట్లు మాత్రమే వచ్చేవా?’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడును హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌.. దళిత మహిళనైన నన్ను హోం మంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట? అని నిలదీశారు. ‘హోంమంత్రినైన నన్నే మనుషులు పలకకూడని మాటలతో, సభ్యసమాజం తల దించుకునేలా దూషించే మీరు ఇక సాధారణ మహిళలను ఎలా గౌరవిస్తారో అర్థమవుతోంది’ అంటూ మండిపడ్డారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళను ‘బట్టలిప్పి కొడతా’ అని దూషించిన అయ్యన్నపాత్రుడు వంటి సంస్కారహీనుడి నుంచి ఇంతకంటే గొప్ప మాటలు వస్తాయని ఆశించలేమన్నారు. ఇతని వ్యాఖ్యలపై స్పందించడమంటే అశుద్ధంపై రాయి వేయడమేనన్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టడం వల్లే ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారని.. అలాంటి సీఎంను దూషించడమంటే ప్రజాతీర్పును అగౌరవ పరిచినట్లేనని చెప్పారు. ఎవరు ఏం చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే..

దళిత జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా 
► వాస్తవానికి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించకూడదని అనుకున్నాను. కానీ స్పందించాల్సి వచ్చింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. అని స్వయంగా చంద్రబాబు దళితజాతిని అవమాన పరిచారు. 
► రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేడ్కర్‌ జన్మించిన, ఆత్మాభిమాం ఉన్న జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మీరు మాట్లాడిన భాషను, మేము ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలోనూ మాట్లాడలేము. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. గొప్పతనం అనేది మన ప్రవర్తనను బట్టి వస్తుంది కానీ.. కులం, జాతి వల్ల రాదు. చంద్రబాబు, అయ్యన్నల సంస్కారం ఏమిటన్నది అందరికీ తెలిసింది.

ఐదేళ్లు బాగు చేసి ఉంటే ఎలా ఓడారు?
► మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. అన్నీ బాగా చేసి ఉంటే, ఎందుకు ఓడిపోయారు? టీడీపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై వైఎస్‌ జగన్‌ను జైలుకు పంపేలా కుట్ర చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే.. 151 సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం ప్రజాతీర్పును అవమానించడమే.
► వంగవీటి రంగా హత్య మీ హయాంలో జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారు. శాంతిభద్రతలపై మీరా మాకు చెప్పేది? 
► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో ఆయనపై హత్యాయత్నం జరిగితే.. అప్పుడు విపక్షనేతగా ఉన్న దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి ఆయన్ను పరామర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చవకబారు విమర్శలు చేశారు. ఇదీ.. మీకూ మాకు మధ్య ఉన్న తేడా.

రాజీనామా చేయమనడానికి మీరెవరు?
సామాజిక న్యాయాన్ని చేతల్తో చూపిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ నన్ను రాజీనామా చేయాలని కోరితే.. ఒక్క క్షణంలో చేస్తా.. నన్ను రాజీనామా చేయాలని కోరడానికి మీరెవరు? 
► ఒక వ్యక్తి సంస్మరణ సభకు వచ్చి అయ్యన్న పాత్రుడు ఇలా మాట్లాడటం సభ్య సమాజం ఇష్టపడుతుందని అనుకుంటున్నారా? మల్లెపూలు కట్టుకుని అమ్మే వాళ్లు మనుషులు కారా? 
► మా పని తీరు బాగా లేదని మీరనుకుంటే ప్రశ్నించండి. అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెబుతాం. దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. దాని గురించి అడగండి చెబుతాం. మీ పాలనలో మహిళలకు ఏమేర న్యాయం చేశారో చెప్పండి. 
► చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాడు వనజాక్షిని కొట్టి, ఆమెనే తప్పు పట్టిన చంద్రబాబు ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తారని ఆశించలేం.

విన్నవించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేస్తారా?
► అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని.. బాష మార్చుకోవాలని చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై రౌడీలతో దాడి చేయిస్తారా? జోగి రమేష్‌ సింగిల్‌గానే వెళ్లారు.. కానీ అప్పటికే కరకట్టపై టీడీపీ నేతలు భారీ ఎత్తున పోగయ్యారు. జోగి రమేష్‌  కారు దిగక ముందే కారు అద్దాలు పగలగొట్టారు. ఆయనపై దాడి చేశారు. ఇదీ వాస్తవం. పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారన్నది అవాస్తవం.
► నాడు మీరు (చంద్రబాబు) అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అవన్నీ ప్రజలు చూశారు కాబట్టే, మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకోండి. 
► రాష్ట్రంలో 15 శాతం నేరాలు తగ్గాయని నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. కానీ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాస్కులు ధరించని వాటికి సంబంధించి నమోదైన 80 వేల కేసులను కూడా నేరాలుగా చూపి, రాష్ట్రంలో 64 శాతం కేసులు పెరిగాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుండటం దారుణం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement