సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్, మంత్రులపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు దుర్భాషలాడుతూ చేసిన వ్యాఖ్యలను వివరించి.. పార్టీ పరంగా ఆయనపై చర్య తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకే శుక్రవారం తాను చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పునరుద్ఘాటించారు. కానీ.. రెండు పచ్చ పత్రికలు ఒకే గొంతుకతో కూడబలుక్కుని ‘చంద్రబాబు ఇంటి మీద దండయాత్ర’ అనే శీర్షికతో నీచపు రాతలను అచ్చేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని.. కనీసం పచ్చ పత్రికలు కూడా రాయలేని భాషలో మాట్లాడారని తప్పుపట్టారు. వీటిని పరిశీలిస్తే దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
అది చంద్రబాబు స్క్రిప్టు
► రాజకీయ చరిత్రలో 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, చలించిపోయి అధికారంలోకి వచ్చాక.. వారికి అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్‌ను అయిదున్నర కోట్లమంది రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలంతా గౌరవిస్తున్నారు.
► జనం మెచ్చేలా పాలన చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను, హోం మంత్రి అయిన దళిత మహిళను, మంత్రులను పచ్చ ప్రతికలు కూడా రాయలేని విధంగా, టీవీల్లో చూపించలేని విధంగా అయ్యన్న పాత్రుడు అమ్మనా బూతులు తిట్టారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే.. అయ్యన్న నోరు పారేసుకున్నారు.
► భాష మార్చుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకే శుక్రవారం చంద్రబాబు నివాసం వద్దకు వెళితే నా కారు మీద రాళ్లు వేశారు. కారు దిగకముందే కారు అద్దాలు పగులగొట్టారు. టీడీపీ గుండాలు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన నా మీద దాడి చేశారు.
► చంద్రబాబే తన నివాసం వద్ద నాపై దాడి చేయించారు. బుద్ధా వెంకన్నలాంటి కాల్‌మనీ సెక్స్ రాకెట్ గాళ్లని, పట్టాభి లాంటి పందికొక్కులను, గన్నే నారాయణప్రసాద్ లాంటి రౌడీ షీటర్లను గద్దె రామ్మోహన్, మీరావలీ, నాగూల్ మీరా, బ్రహ్మంలాంటి వాళ్లను పెట్టుకుని రాళ్లతో దాడి చేయించారు. తనపై దాడి చేసిన దృశ్యాలను అన్ని టీవీ ఛానల్స్ చూపించాయి.
టీడీపీపై ఎప్పుడైనా దాడి చేశామా?
టీడీపీ నేతలు ఎన్నిసార్లు నిరసన చేయలేదు.. సీఎం నివాసం, సచివాలయం ‘ముట్టడి‘ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అక్కడ పోలీసులు కూడా ఉంటారు? మీరు ముట్టడికి వెళ్లినప్పుడు వైఎస్సారీసీపీ తరఫున మేము కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ప్రతిఘటించామా? మీపై దౌర్జన్యం చేసి కొట్టామా? వ్యవస్థ ఉంది.. పోలీసులు ఉన్నారు.. నన్ను కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లారు. నిరసన తెలియ చేయడానికి వెళితే నామీద, మా కార్యకర్తలపై దాడి చేస్తారా? చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా మళ్లీ మాపైనే ఎదురు దాడి చేస్తారా? కొంచమైనా మానవత్వం ఉందా?
ప్రతిపక్షం కాదు.. పనికి మాలిన పక్షం
► నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? మీరు కడుపుకు ఏం తింటున్నారు? ప్రతిపక్షం పనికిమాలిన పక్షంగా తయారైంది. అమ్మ ఒడి, రైతు భరోసా, ఇళ్లు.. ఇలాంటి పథకాలకు ఎవరికైనా అర్హత ఉండీ అందకపోతే ఇవ్వాలని అడగండి.
► రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో మీ గూబ గుయ్యిమనేలా ప్రజలు తీర్పు ఉంటుంది.
► మీ భాష మార్చుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే, అక్కడ నిరసన తెలుపుతాం. అయ్యన్నపాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా.. లేక బాగా బూతులు తిట్టారని మీ జాతీయ అధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెడతారా.. అన్నది మీ ఇష్టం.
Comments
Please login to add a commentAdd a comment