అపరాధి అంతరంగం | Vardelli Murali Article on Chandrababu And ESI Medicine Scam | Sakshi
Sakshi News home page

అపరాధి అంతరంగం

Published Sun, Jun 14 2020 2:35 AM | Last Updated on Sun, Jun 14 2020 2:36 AM

Vardelli Murali Article on Chandrababu And ESI Medicine Scam - Sakshi

సుప్రసిద్ధ జాతీయ రాజకీయ నాయకులు, ప్రధాని మోదీ కంటే సీనియర్, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం నాటి సుప్రభాత వేళ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాసిన ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. నాలుగు దశాబ్దాల పైచిలుకు అనుభవం కారణంగా లేఖ విడుదలలో ఆయన చక్కని టైమింగ్‌ను కనబరిచారు. ఎందుకంటే లేఖ విడుదలైన మూడు గంటల్లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఫైబర్‌నెట్, చంద్రన్న కానుకల్లో జరిగిన కుంభకోణాలపై చర్చ జరిగి సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆ మరుసటి రోజు ఈఎస్‌ఐ నిధుల దుర్వినియోగం కుంభకోణం లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పక్కా ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో ‘న భూతో న భవిష్యతి’ అన్న చందంగా జరిగిన అవినీతి పురాణాలపై చట్టపరమైన కదలికలు ప్రారంభమయ్యాయి. అధికార యంత్రాంగం లోనూ, రాజకీయ శ్రేణుల్లోనూ, రాజ్యాంగబద్ధ వ్యవస్థల్లోనూ చంద్రబాబు కొన్ని స్లీపర్‌ సెల్స్‌ను ఏర్పాటుచేసి పెట్టుకున్నారు. చట్టపరమైన కదలికలు ప్రారంభమైన వెంటనే సంబంధిత స్లీపర్‌సెల్స్‌ యాక్టివేట్‌ అయ్యాయి. ఆయనకు ఉప్పందింది. లేఖ సిద్ధమైంది. విడుదల చేయడానికి ముందు రాత్రి బహుశా ఆయన నిద్రకు దూరమై ఉంటారు. ‘ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ’ అని ఎదురుచూసి ఉంటారు. ఎందుకంటే సదరు లేఖ అలాంటిలాంటి లేఖ కాదు. చట్టపరమైన చర్యలకు రాజకీయ దురుద్దేశ ముసుగు వేసే తంత్రాంగం ఆ లేఖలో పొందుపరచబడి ఉన్నది. అంతేకాదు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏడాది పాలనపై అది ఒక శాపనార్థ పత్రం. ఒక యుద్ధప్రకటన.

ఆ లేఖలో వున్న సారాంశం ఏమిటంటే, ‘కరువు కాటకాల విలయనాట్యంతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎక్కడా సాయం దొరక్క రైతులంతా వరసగా నిలబడి ఉరితాళ్లను బిగించుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా జనం పిట్టల్లా రాలి పోతున్నారు. రాజకీయ కక్షతో ప్రజావేదికను కూల్చివేసిన ఫలి తంగా ఐదుకోట్లమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కనీసం మద్యం కూడా దొరకని దుర్భర పరిస్థితులతో జనం మరణయా తన అనుభవిస్తున్నారు. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలతో రాష్ట్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా వున్నది. ప్రశ్నించిన వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు. కనుక ప్రజలందరూ ఏకమై ఈ పరిపాలన మీద తిరుగుబాటు చేయాలి. నాయకత్వం వహించడానికి తెలుగు దేశం పార్టీ సిద్ధంగా ఉన్నది.’’ ఇలా సాగిన అభియోగ పత్రం వెనుక చంద్రబాబు ఆలోచన ఏమైవుంటుంది. ఈ యుద్ధ ప్రక టన వెనుక వ్యూహం ఏమిటి? పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఈ నాలుగేళ్లు పోరాడి వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరాలకు చేరుకుంటాయన్న నమ్మకమా? ముమ్మాటికీ కాదు. అనుభవం కారణంగా అంతటి రాజకీయ అపరిపక్వత ఆయనకు లేదు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకీ, తెలుగుదేశం పార్టీకి మధ్యన 10 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది. కొత్త ప్రభుత్వం ఏడాది పరిపాలన తర్వాత ఈ అంతరం బాగా పెరిగినట్టు క్షేత్రస్థాయి సమాచారం సూచిస్తున్నది.

గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వర్గాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనుక సమీకృతమౌతున్న పరిణామం ఈ ఏడాది కాలంలో స్పష్టంగా కనిపించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించి టీడీపీ మరింత అభాసుపాలైంది. ఇంగ్లిష్‌ మీడియం విద్యాబోధనను వ్యతిరేకించి పేదవర్గాలన్నిటికీ దూరమైంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలు, పేదవర్గాల ప్రజలను సాధి కార శక్తులుగా మలిచేందుకు తీసుకున్న చర్యలు, చేపట్టిన జన రంజక సంక్షేమ కార్యక్రమాలు, గ్రామస్థాయికి తీసుకొని వచ్చిన పరిపాలనా సంస్కరణల కారణంగా సమాజంలో విప్లవాత్మక మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులు రాజ కీయ కూర్పులో కూడా ప్రతిఫలించే అవకాశం ఉంది. ఒక అంచనా ప్రకారం వచ్చే ఎన్నికల నాటికి, ఒకవేళ ఏవైనా ప్రతి కూల పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినా కూడా అధికార పార్టీ బలం 55 శాతానికి ఒక్క ఓటు కూడా తగ్గదు. మూడో ప్రత్యా మ్నాయం ఏదైనా ఏర్పడి తన ఓటు బ్యాంకుకు మరింత గండి కొట్టకపోతే, అధికార పార్టీకి తానే గట్టిపోటీదారునని నాలుగేళ్ల తర్వాత కూడా ఓటర్లకు నమ్మకం కలిగించగలిగితే, అధికార పార్టీని వ్యతిరేకించే శక్తులన్నింటినీ తన వెనుక సమీకరించు కోగలిగితే తెలుగుదేశం పార్టీ బలం గరిష్టంగా 30 శాతం దాకా వెళ్లొచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడి వున్న ఇంతటి భారీ వ్యత్యా సాన్ని అంచనా వేయడానికి జ్యోతిష్యం తెలిసినవాడో, రాజకీయ పండితుడో, సెఫాలజిస్టో కానవసరం లేదు. అనుభవం ఉంటే చాలు. ఆ అనుభవం చంద్రబాబుకు దండిగా వున్నది. అందు వల్ల నాలుగేళ్లు కార్యకర్తలను ఉత్సాహపరిచి పోరాటాలు చేయడం ద్వారా మళ్లీ అధికారంలోకి రాగలమన్న వెర్రి భ్రాంతి ఆయనకు వుండే అవకాశం లేదు. 

చంద్రబాబు ముందు ఇప్పుడు రెండు లక్ష్యాలున్నాయి. ఆ లక్ష్యాలకు అనుగుణంగానే ఆయన పావులు కదుపుతున్నారు. అందులో మొదటిది తన ప్రభుత్వ పదవీకాలంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై చట్టపరమైన చర్యలు ప్రారంభమైతే, వాటిపై రాజకీయ దురుద్దేశం, కక్షసాధింపు అనే ముసుగులు వేయాలి. తద్వారా వీలయినంత సానుభూతిని సంపాదించు కోవాలి. సాధ్యమైనంత వరకు అటువంటి చట్టపరమైన చర్యలు ముందుకు కదలకుండా అడ్డుకోవాలి. ఈ రకమైన వ్యూహానికి మీడియా వాద్య సహకారం ఉండనే ఉంటుంది. చంద్రబాబు వ్యతిరేకులు ఆయనకొక మునిశాపం ఉందని చెబుతారు. అదేమిటంటే ఎప్పుడైనా ఆయన నిజం మాట్లాడితే ఆయన తల వేయి ముక్కలవుతుందట. అదేవిధంగా బాబు అభిమానులు, మద్దతుదారులు తమ నాయకునికి ఒక వరం ఉందని చెప్పు కుంటారు. ఆయన ఎప్పుడైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన వలసి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి ఏదో ఒక సహకారం అందుతుందట. జరుగుతున్న పరిణామాలన్నిటినీ గమనిస్తున్నప్పుడు ఆ శాపాన్ని నమ్మినట్టే, ఈ వరాన్ని కూడా నమ్మాలనిపిస్తున్నది. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకరరెడ్డిల అరెస్ట్‌ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, అనుబంధ మీడియా వ్యవహారమంతా మొదటి లక్ష్యంలో భాగంగా స్క్రిప్టు ప్రకారమే నడుస్తున్నదని స్పష్టమవుతున్నది. 

అచ్చెన్నాయుడు అరెస్ట్‌ వ్యవహారాన్ని తీసుకుందాము. ఆయన కార్మికశాఖ మంత్రిగా ఉన్న కాలంలో మందుల కొనుగోళ్ల పేరుతో 151 కోట్ల రూపాయలు దుర్వినియోగ మయ్యాయని విచారణ జరిపిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ శాఖ నిర్ధారించింది. దాదాపు ఇదేరకమైన స్కామ్‌ జరిగిన తెలంగాణలో ఇప్పటికే ఆ శాఖ అధికారులు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఏపీలో ఈ స్కామ్‌కు సాక్షాత్తు మంత్రివర్యుడే లిఖితపూర్వక ఆదేశాల సాక్షిగా తెరతీయడం విషాదం. రాష్ట్రంలోని 14 లక్షలమంది చిరుద్యోగుల కష్టార్జితం ఈఎస్‌ఐ నిధులు. ఇరవైవేల రూపాయలలోపు నెలజీతం పొందే ప్రైవేట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల్లోంచి వారి ఆరోగ్య అవసరాల నిమిత్తం కొంత మినహాయించి ఈఎస్‌ఐకి నిధులు సమకూర్చు తున్నారు. అటువంటి పేద కుటుంబాల సొమ్ముకు కూడా కక్కుర్తిపడతారా? ఇది పేదల రక్తాన్ని పీల్చుకోవడం కాదా? పూర్వం ధన్‌బాద్‌ బొగ్గు గనుల ప్రాంతంలో మాఫియా ముఠాల సమాంతరపాలన నడిచేది. కార్మికులు నెల జీతం తీసుకొని మాఫియా చెక్‌పోస్టుల దగ్గర రౌడీమామూళ్లు సమర్పించిన తర్వాతనే ఇంటికి వెళ్లనిచ్చేవారు. ఆ దందాకూ దీనికీ తేడా ఏముంది? పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్‌ చేస్తే అభినం దించాలా? ఆందోళన చేయాలా?

బీసీ నేతను అరెస్ట్‌ చేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బీసీ న్యాయవాదులు జడ్జీలుగా పనికిరారంటూ కొలీజియంకు ఉత్తరం రాసిన పెద్దమనిషి ఈయన. మరి ఈఎస్‌ఐకి నిధులు సమకూర్చుతున్న చిరుద్యోగుల్లో అత్యధికులు బీసీలు కాదా? అన్న ప్రశ్నకు వీరి దగ్గర సమాధానం ఉండదు. అచ్చెన్న పాత్రధారి మాత్రమేనని మూలవిరాట్టు వేరే ఉన్నారనే ప్రచారం ఒకటుంది. విచారణ అచ్చెన్న పరిధిని దాటి ఎక్కడ ముందుకు వెళ్తుందోనన్న తత్తరపాటు ప్రతిపక్షనేతలో కనిపించింది. వార్త తెలియగానే కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. కుదరకపోవడంతో బీసీని అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు. సాయంత్రానికల్లా అచ్చెన్న చేయించుకున్న పైల్స్‌ ఆపరేషన్‌ను ప్రచారంలో పెట్టారు. రిమాండ్‌ ఖైదీని కలవడానికి అనుమతించరని తెలి సినా హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన గుంటూరు వచ్చి ఆస్పత్రి ముందు చాలాసేపు తచ్చాడారు. ఇక జేసీ బ్రదర్స్‌ ఘనకార్యం జగమెరిగిన సత్యం. వారి అరెస్ట్‌ను రాజకీయ కక్షసాధింపు అనే కోటాలో చేర్చారు. ఆ విధంగానే ప్రసార సాధనాల్లో ప్రచారంలో పెట్టారు. ఈ ప్రయాస మొదటి లక్ష్యం ముందుగానే చెప్పుకున్నట్టు తమ అవినీతి గతంపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిరోధించడమైతే–రెండో లక్ష్యం రాజకీయం. వచ్చే ఎన్నికల్లో అధికారం కల్ల. కానీ, కనీసం ఇప్పుడు తనకు లభించిన ప్రతిపక్షనేత పాత్రనైనా తన వారసునికి కట్టబెట్టాలంటే ఇరవై సీట్లయినా గెలవాలి. గెలవాలి అంటే  మరో ప్రత్యామ్నాయ పార్టీ కానీ కూటమి కానీ తన పార్టీని మించి బలపడకూడదు. కూడదు అంటే ఇప్పటికే జారిపోతున్న శ్రేణులు మరింత జారిపోకూడదు. అందుకోసం ఓ సమర శంఖాన్ని పూరించాలి. ఆ పూరణే ఈ బహిరంగ లేఖ. ఆ లేఖను విడుదల చేయవలసిన సూర్యోదయం కోసం ఆ రాత్రంతా ఆయన చట్టపరమైన చర్యల టెన్షన్‌తో జాగరణం చేసి వుంటారు. ఈ పటాటోపమంతా గెలుపు కోసం కాదు, ప్రతిపక్ష పాత్రతో పరువు దక్కించుకోవడం కోసమే. 

ఎన్నికలకు నాలుగేళ్ల ముందే చంద్రబాబు రణభేరి లేఖను తయారు చేసుకున్న నిద్రలేని రాత్రిని చూస్తుంటే పురాణాల్లో రావణాసురుడు తన జీవితంలోని చివరి రాత్రి పడిన అంతర్మథనం సూర్యోదయం కోసం ఎదురుచూసిన వైనం గుర్తుకొస్తున్నది. శ్రీరామునితో యుద్ధం వద్దని సన్నిహితులు చాలామంది రావణాసురునికి హితువు చెబుతారు. సీతాదేవిని శ్రీరామునికి అప్పగించమని వేడుకుంటారు. శంకర ప్రసాదిత వరసంపన్నుడైన రావణుడు వినిపించుకోడు. వారధి దాటిన యుద్ధం వాకిట్లోకి వస్తుంది. రాజగురువు వంటి తాత మాల్యవం తుడు వారిస్తాడు. తమ్ముడు విభీషణుడు ప్రాధేయపడతాడు. సహధర్మచారిణి మండోదరి కంటతడిపెడుతుంది. రావణుని అహం కారం ఆవగింజంత కూడా కరగదు. యుద్ధంలో రామ బాణాల ధాటికి రాక్షససేన హాహాకారాలు చేస్తుంది. అరివీర భయంకరుడైన సోదరుడు కుంభకర్ణుడు హతుడవుతాడు. దేవత లనే ఓడించిన కుమారుడు మేఘనాథుడు కూడా కూలిపోతాడు. ఊహించని రావణుడు హతాశుడవుతాడు. తానే యుద్ధానికి బయలు దేరుతాడు, రావణుని చివరి రెండు రోజుల యుద్ధాన్ని, అంతర్మథ నాన్ని బాపు తీసిన ‘సంపూర్ణ రామాయణం’ సినిమా లో ఎస్వీ రంగారావు అద్భుతంగా అభినయించి చూపెట్టారు. రాముని శరపరంపర ధాటికి రావణుని రథసారథి విగతు డవుతాడు. విల్లు విరిగిపోతుంది. విరథిగా రావణుడు నిలబడి పోతాడు. నిరాయుధుడిని చంపడం ధర్మం కాదు ‘నేడు పొమ్ము, రేపు రమ్ము’ అని శ్రీరాముడు వదిలేస్తాడు. అవమానభారంతో ఒంటరిగా, రాజమందిరంలో రావణాసురుడు దహించుకుపో తుంటాడు. ‘ప్రతీకారంతో నా ఎద ప్రజ్వరిల్లుతున్నద’ని ఆర్తనా దాలు చేస్తాడు. అప్పుడు రావణుని అంతరాత్మ నిద్రలేచి హిత బోధ చేస్తుంది. ‘ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతాదేవిని సగౌరవంగా రామునికి అప్పగించు. లొంగిపో, ప్రాణాలు దక్కు తాయన’ని చెబుతుంది. రావణుడు ఆలోచిస్తాడు. యుద్ధం చేసి నా ఓటమి అనివార్యం. అర్థమవుతూనే ఉన్నది. కానీ, సంధి చేసుకుంటే పోయిన వాళ్లెవరూ తిరిగి రారు. పరువు మాత్రం పోతుంది. యుద్ధం చేసి ఓడిపోయినా కనీసం పరువైనా మిగులు తుంది. ఇక వెంటనే యుద్ధానికి బయల్దేరడానికి ఉద్యుక్తుడవు తాడు. ఇంకా తెల్లారలేదు. ‘ఆహా... ఇంకా ప్రభాతమవదేమీ’ అంటూ అసహనంతో తిరుగుతుంటాడు. ‘‘ఓరీ భాస్కరా! ఉద యించూ... ఉదయించూ...’’ అని పలవరిస్తాడు. ఆ సమరనాద మంతా విజయం కోసం కాదు. పరువుకోసం మాత్రమే!


వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement