ఒకే బాణము, ఒకటే పార్టీ! | Vardelli Murali Article On Ayodhya Ram Temple Bhoomi Puja | Sakshi
Sakshi News home page

ఒకే బాణము, ఒకటే పార్టీ!

Published Sun, Aug 9 2020 12:25 AM | Last Updated on Sun, Aug 9 2020 12:25 AM

Vardelli Murali Article On Ayodhya Ram Temple Bhoomi Puja - Sakshi

హిందువులకు మూడు కోట్ల మంది దేవుళ్లూ– దేవతలు. వారిలో శ్రీరామచంద్రుడు ఎప్పుడూ ప్రత్యేకమే. నరుడిగా పుట్టాడు. నారాయణుడనిపించుకున్నాడు. అతడు జగదానంద కారకుడని త్యాగరాజస్వామి కీర్తించాడు. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఎట్లా వుండాలో, నడవడిక ఏవిధంగా ఉండాలో తన జీవితం ద్వారా లోకానికి బోధించిన ఆదర్శమూర్తి రామచంద్రుడంటారు. శ్రీరాముని గుణగణాలేమిటో చెప్పమని రావణాసురుడు ఒకసారి మారీచుడిని అడిగాడట. అప్పుడు మారీచుడు ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అని బదులిచ్చాడట. అంటే రాముడు ధర్మస్వరూపుడూ, సకల సద్గుణ సంపన్నుడు అని అర్థం. రాముని వర్ణిస్తూ ఎన్నో కథలు, కళారూపాలు, జాన పద గేయాలు, సినిమా పాటలు ప్రాచుర్యంలో వున్నాయి. ‘‘ఒకే బాణమూ, ఒకటే మాట.. ఒక్క భామకే రాముని ప్రేమ. మిన్నే విరిగి పడినా వ్రతభంగమ్ము కానీడమ్మా’’ అనే సినిమా పాట రామతత్వాన్ని మూడు ముక్కల్లో చెప్పింది.

ఈనెల ఐదో తేదీనాడు అయోధ్యలో భవ్యమైన బాల రామాలయ నిర్మాణానికి భారత ప్రధానమంత్రి ఆధ్వర్యంలో భూమిపూజ జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో సోమ నాథ్‌ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాల ప్రారంభానికి హాజ రయ్యేందుకు అప్పటి ప్రధాని పండిత్‌ నెహ్రూ నిరాకరించారు. ఒక మతానికి చెందిన ఆలయ కార్యక్రమానికి ప్రధానమంత్రి హోదాలో హాజరవడం లౌకికత్వానికి విరుద్ధమని ఆయన భావించాడు. అప్పటికి భారత రాజ్యాంగ పీఠికలో సెక్యులర్‌ అనే మాట లేనేలేదు. 1976లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సెక్యులర్, సోషలిస్టు పదాలను పీఠికలో చేర్చారు. ఇప్పుడు రామాలయ నిర్మాణ భూమి పూజకు ప్రధానమంత్రి హాజరవడం, స్వయంగా అన్నీ తానై నిర్వహించడంపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నా విస్తృత ప్రజాభిప్రాయానికి భయపడి మౌనంగా ఉండి పోయారు.
మర్యాదపురుషోత్తమునిగా మన్ననలందుకున్న శ్రీరామ చంద్రుడు అయోధ్య వివాదం కారణంగా శతాబ్దాల తరబడి వివాదాల్లో చిక్కుకోవడం, కొన్ని దశాబ్దాలుగా ఒక రాజకీయ అంశంగా మారడం చరిత్రలో ఒక విచారకరమైన అధ్యాయం. ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఈ అధ్యాయానికి తెరదించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ట్రస్టు ద్వారా ఆలయ నిర్మాణం జరగాలని కోర్టు ఆదేశించినందువల్ల కూడా ప్రధాన మంత్రి హాజరును ఎవరూ పెద్దగా తప్పుపట్టలేకపోయారు. పైగా శ్రీరాముడు పాటించిన ఉన్నత విలువలు,ఆచరించిన ఆదర్శాలు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తినివ్వాలంటే ఈ కార్యక్రమం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గొప్పగా జరగాలని భావించి ఉండవచ్చు.

నెహ్రూ జమానా నుంచి మోదీ హయాం వరకు ఆరేడు దశాబ్దాల కాలంలోనే సెక్యులరిజం, సోషలిజం వంటి అంశా లపై ప్రజల ఆలోచనా రీతుల్లో చోటుచేసుకున్న మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు వేల ఏళ్లనాటి శ్రీరామచంద్రుని విలువలూ, ఆదర్శాలు ఇప్పటి తరా నికి ఏమేరకు ఉపయుక్తం అవుతాయని ప్రశ్నించేవారు తప్ప కుండా ఉంటారు. శూద్రులు సేవకులుగానే ఉండాలి తప్ప తపస్సు చేయడానికి యోగ్యులు కారనే ‘ధర్మ’నియతి ప్రకారం శీర్షాసనం వేసి ఘోరమైన తపస్సు చేస్తున్న శంబూకుని తలను నరికివేస్తాడు శ్రీరాముడు. పద్నాలుగేళ్లపాటు వనవాసాన్ని, ఓపెన్‌ జైలు జీవితాన్ని అనుభవించిన సీతమ్మ తల్లిని అగ్ని పరీక్షకు రాముడు ఆదేశిస్తాడు. ఇటువంటి చర్యలు ప్రజలకు ఏ సందేశాన్నిస్తాయని ప్రశ్నించేవాళ్లు ఇప్పుడే కాదు, ఆరోజుల్లోనూ ఉన్నారు. వారి వాదనల్ని పండితులు చార్వాక వాదమని కొట్టి పడేసేవారు. వాస్తవానికి చారువాక్కు అంటే మంచి మాట అని అర్థం. మంచిమాటలు చెప్పేవాళ్లు చార్వాకులు. కానీ పండితుల ఈసడింపులకు గురైనందువల్ల ఆ మాట ఒక దుష్టపదంగా మిగి లిపోయింది. చార్వాకవాదాలు చేసేవాళ్లను ఇప్పుడు సోషల్‌ మీడియా పండితులు కమ్యూనిస్టులు, సెక్యులరిస్టులుగా బ్రాండింగ్‌ చేశారు. ఆ రెండూ గొప్ప మాటలే అయినప్పటికీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో, మీడియాలో కూడా వార్‌ ఒన్‌సైడే కనుక, చివరికి పాపం అలా మిగిలిపోయారు వాళ్లు.

రామతత్వంలోని మిగిలిన ఆదర్శాల సంగతెలా ఉన్నా ఒకే బాణం, ఒకే మాట భారతీయ జనతా పార్టీని బాగా ప్రభావితం చేసినట్టు కనబడుతున్నది. రామాలయానికి భూమిపూజ జరిగిన ఆగస్టు 5వ తేదీకి సరిగ్గా ఏడాది ముందు అదే తేదీనాడు ఒక దేశం – ఒకే చట్టం అనే తన చిరకాల స్వప్నాన్ని మోదీ ప్రభుత్వం సాకారం చేసుకున్నది. దేశంలో ఎక్కడా పెద్ద వ్యతిరేకత కనిపిం చనీయకుండా 370వ అధికరణాన్ని చాకచక్యంగా రద్దు చేయగలి గింది. కశ్మీర్‌కు ఇప్పుడు ప్రత్యేక హోదా కాదు గదా, రాష్ట్ర హోదా కూడా మిగల్లేదు. భూమిపూజ తర్వాత రెండు రోజులకే ప్రధాన మంత్రి ఒక సెమినార్‌లో మాట్లాడుతూ ఒక దేశం– ఒకే విద్య అని మరో పిలుపునిచ్చారు. ఈమేరకు నూతన విద్యావిధానాన్ని ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. విద్య ఉమ్మడి జాబితా లోని అంశం. రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు, అవసరాలపై విస్తృత మైన చర్చ జరగకుండానే కేంద్రం ఏకపక్ష నిర్ణయం ఎలా తీసు కుంటుందనే ప్రశ్న ఎక్కడా తలెత్తకపోవడం పెద్ద విశేషం. ఇప్పు డున్న విద్యావిధానం రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అమ లులోకి వచ్చింది. ఆదర్శాలెలా ఉన్నా ఆచరణలో ఈ విధానం విద్యను అంగడి సరుకుగా మార్చివేసింది. ఈ చేదు అనుభవం ఫలితంగానే, కొత్త విద్యావిధానాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ప్రైవేట్‌ దోపిడీదార్ల పాలిటి కామధేనువు లాంటి ఇంటర్మీడియట్‌ అదృశ్యం కాబోతున్నది. ఈ కొత్తవిధానం అమలులోకి రావడా నికి ఆటంకాలేమీ కనిపించడం లేదు. ఒక దేశం.. ఒకే చట్టం... ఒకే విద్య... తర్వాత వచ్చే ఆ ఒక్కటి ఏమై ఉంటుంది?

ఈ వరుసలో భాష కూడా ఉంటుందా? భారతీయ జనతా పార్టీకి మాతృసంస్థ లాంటిదైన ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంలో దేశ ప్రజలందరూ హిందీ నేర్చుకోవాలన్న లక్ష్యం కూడా అంత ర్భాగం. అయితే గతంలో నాన్‌–హిందీ రాష్ట్రాల్లో ఈ అభి ప్రాయం పట్ల వ్యక్తమైన వ్యతిరేకత వల్ల ప్రస్తుతానికి బీజేపీ ఈ అంశాన్ని చేపట్టకపోవచ్చు. కానీ, నూతన విద్యావిధానంలో భాగంగా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే (ప్రాంతీయ భాష) చదివించాలన్న అంశాన్ని ముందుకు తెస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లిష్‌ మీడియం వైపు మొగ్గుచూపుతున్న సందర్భం ఇది. ఇంగ్లిష్‌ మీడియంలో ప్రాథమిక విద్యను అభ్యసించిన పిల్లలు ఉన్నత విద్యలో మెరుగైన ప్రమాణాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్న వాస్తవి కత వారి కళ్లముందున్న కారణంగా ఈ పరిణామం ఏర్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తి రంగమో వ్యవసాయ రంగమో కీలకపాత్ర పోషించే దేశాల్లో మాతృభాషలో చదివించినా సరి పోతుంది కానీ, సేవారంగంపై ఆధారపడిన దేశాల్లో ఇంగ్లిష్‌ మీడియం చదువు అత్యవసరమని నిపుణులు భావిస్తున్నారు. మన దేశ జీడీపీలో సేవారంగం వాటా సగానికన్నా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో కేంద్రం మాతృభాషా ఫోకస్‌ వెనుక వ్యూహమేమిటో తేలాల్సి ఉన్నది.

ఒకే చట్టం, ఒకే విద్య తర్వాత ఒకే జాతీయ పార్టీ అనేది బీజేపీ లక్ష్యం కావచ్చు. ఇందులో దాపరికమేమీ లేదు. ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ తన విధానంగా బీజేపీ ఎప్పుడో ప్రకటించు కున్నది. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా పతనమైతే ఇక మిగిలే జాతీయ పార్టీ బీజేపీ ఒక్కటే. మిగిలిన జాతీయ పార్టీలు పేరుకే తప్ప వాటి ఉనికి నామమాత్రమే. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్‌ తన ఉనికిని బలంగా చాటుకునే పరిస్థితిలో ఉన్నది. అందులో జ్యోతిరాదిత్య సింథియా, సచిన్‌ పైలట్ల రూపంలో రెండు రాష్ట్రాల్లో గట్టి ఎదురుదెబ్బలే తగి లాయి. భారత రాజకీయాల్లో మితవాదానికి, వామపక్షానికి నడుమ మధ్యేవాద పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుని యాభై ఐదేళ్ల్లపాటు పరిపాలించగలిగింది. ఈ స్థానంలో కూడా ఎక్కువకాలం వామపక్షానికి దగ్గరైన మధ్యే వాద పార్టీ (లెఫ్ట్‌ ఆఫ్‌ ది సెంటర్‌)గా వ్యవహరించింది. మొన్నటి ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ శివభక్తుని గెటప్‌లో మెతక హిందూత్వ కార్డును ప్రయోగించి బొక్కబోర్లా పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ గడియారం ముల్లు రైట్‌ ఆఫ్‌ ది సెంటర్‌ స్థానంలో నిలబడింది. తన సంప్రదాయ విధానానికి భిన్నంగా ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో పెద్దగా అభ్యంతరాలు లేవనెత్తకుండానే వదిలేసింది. ఇప్పుడు సాక్షాత్తు కాబోయే కాంగ్రెస్‌ సేనాని ప్రియాంకాగాంధీ రామమందిరం భూమి పూజను బహిరం గంగా స్వాగతించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి ‘బీ’ టీమ్‌గా కాంగ్రెస్‌ పార్టీ రూపాంతరం చెందుతున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

‘ఏ’ టీమ్‌ అందుబాటులో ఉన్నప్పుడు ‘బీ’ టీమ్‌ను ఎంచు కునేదెవరు? ఇప్పుడిక జాతీయ స్థాయిలో బీజేపీ విజయయాత్ర ఉచ్చ దశకు చేరుకున్నట్టే. రాష్ట్రాల స్థాయిలో ప్రాంతీయ పార్టీలు సెంటర్, లెఫ్ట్‌ ఆఫ్‌ ది సెంటర్‌ స్థానాలను ఆక్రమించాయి. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రధాన పోటీదారుగా తయారైంది. జాతీయ స్థాయిలో నాయకత్వ లోపం తెలంగాణ కాంగ్రెస్‌కు శాపంగా మారితే ఇక్కడ కూడా రెండో పార్టీగా బీజేపీ ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి.
అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో చాలా కర్కశంగా వ్యవహరించాడనీ, నెత్తుటేర్లను పారించాడని చరిత్ర చెబుతు న్నది. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత, కావేరీ దక్షిణాన కొద్ది ప్రాంతం మినహా ప్రస్తుత అఫ్గానిస్తాన్‌ సహా ఉపఖండమంతా అశోకుని పరిపాలనలోకి వచ్చింది. గెలవడానికి ఇంకేమీ మిగ ల్లేదు. అప్పుడాయన తన శేష జీవితాన్ని బౌద్ధధర్మ ప్రబోధానికి అంకితం చేశారు. అదే తరహాలో జాతీయ స్థాయి ఏకైక విపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కునారిల్లిపోయిన స్థితిలో నరేంద్ర మోదీ రామాలయానికి భూమి పూజ చేసి ప్రసంగించారు. శ్రీరామచంద్రుని ఆదర్శాలతో కూడినదే మహాత్ముడు కలలుకన్న రామరాజ్యమనీ, దానిని స్థాపించడమే తన ధ్యేయమని ప్రక టించుకున్నారు. రామమందిరం పూర్తయ్యే నాటికి ఒక దేశం– ఒకే జాతీయ పార్టీ అనే భావన కూడా స్థిరపడుతుందేమో చూడాలి.

muralivardelli@yahoo.co.in
వర్ధెల్లి మురళి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement