
సమానత్వం పొడగిట్టని అన్యాయమైన పంపిణీ విధానం నేడు ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఈ తరహా పంపిణీ పునాదిపై విరాజిల్లుతున్న ఆర్థిక వ్యవస్థలో సమస్త వృత్తులవారు, సబ్బండ వర్ణాల వారు, వైట్‌కాలర్ నుంచి బ్లూ కాలర్ వరకు ఉండే కర్మచారులందరూ బాధితులే! కొందరు ఎక్కువ బాధితులు, కొందరు తక్కువ బాధితులు. అంతే తేడా! వేగంగా పెరుగు తున్న సంపద అంతరాలను కరోనా మహమ్మారి పూడ్చలేని అగాధాలుగా మార్చివేసింది.
దావోస్‌లో ప్రతియేటా ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు ముందు సంపద పంపిణీలో అంతరాలపై ‘ఆక్స్‌ఫామ్’ అనే స్వతంత్ర సంస్థ ఒక నివేదికను ఆనవాయితీగా విడుదల చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో 99 శాతం మంది ఆదాయాలు కరోనా వేళ గణనీయంగా పడిపోయాయి. ఒక్క శాతం సంపన్నుల ఆస్తులు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. మధ్యతరగతి శ్రేణుల్లో ఉన్న 16 కోట్లమంది కొత్తగా పేదరికంలోకి జారిపోయారు. భూగోళం జనాభాలో 50 శాతంగా ఉన్న 400 కోట్లమంది పేదలు ఉమ్మడిగా సంపాదించిన దానికంటే ఒక్కశాతం మంది సంపన్నులు ఎక్కువ సంపాదించారు.
పేదలు – ధనికుల మధ్య జెట్ స్పీడ్‌తో పెరుగుతున్న అంతరాలను తగ్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాలకు ‘ఆక్స్‌ఫామ్’ విజ్ఞప్తి చేసింది. లేకపోతే ఈ పరిణామం అమానవీయ పర్యవసానాలకు దారితీస్తుందని అది హెచ్చరిస్తున్నది. ఇలా చెబుతున్నది ఒక్క ‘ఆక్స్‌ఫామ్’ మాత్రమే కాదు. ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్తలందరిదీ ఇదే మాట! వారిలో పెట్టుబడిదారీ విధాన ప్రబోధకులున్నారు. సోషలిస్టు ప్రవచ కులూ ఉన్నారు. సంక్షోభం వేళ పేద ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా చూడాలనీ, వారి చేతుల్లో తగినంత నగదును ఉంచే ఏర్పాటు చేయాలనీ వారు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈ నగదు చలామణీలోకి రాకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలు తుందని వారు హెచ్చరించారు.
ప్రపంచవ్యాప్తంగా తరతమ భేదాలతో చాలా ప్రభుత్వాలు ఈ హెచ్చరికలను స్వీకరించాయి. మనదేశంలోనూ కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా కొన్ని చర్యలను చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో అగ్రభాగాన నిలబడింది. ఇప్పటికే అది సుమారు ఒక లక్షా పాతికవేల కోట్ల రూపాయలకు పైగా నగదును పేద ప్రజలకు బదిలీ చేసింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా నిలబడగలిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం మరో విలక్షణమైన కోణాన్ని జోడించింది. మహిళలూ, బలహీన వర్గాల ప్రజలను సాధికారికంగా శక్తిమంతం (ఎంపవర్డ్) చేసే కార్యక్రమాలను ఏకకాలంలో చేపట్టింది. తిండి, గుడ్డకు ఢోకా లేకుండా చూడటమొక్కటే కాదు. దాంతోపాటు సమస్త ప్రజలు విద్య, వైద్యం, విజ్ఞాన, వికాసాలతో కూడిన ఆత్మగౌరవ జీవనాన్ని అందుకోవడానికి దోహదపడే కార్యక్రమాలను ప్రారంభించింది.
కరోనా సంక్షోభం ఫలితంగా అన్ని రాష్ట్రాలూ, అన్ని దేశాలూ ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ది రెట్టింపు సమస్య. రాష్ట్ర విభజనతో రాజధానిని కోల్పోవడం వలన రెవెన్యూలో సింహభాగాన్ని కోల్పోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి చంద్రబాబు ప్రభుత్వం మోపిన అప్పుల భారం వలన ఏటా రూ. ఇరవైవేల కోట్ల వడ్డీల భారం మీద పడింది. అదనంగా మరో అరవై వేల కోట్ల బకాయిల బరువు. ఈ బరువును మోస్తూనే కరోనా సంక్షోభాన్ని ఈదవలసి వచ్చింది. సంక్షోభం మొదటి రెండేళ్లలో రాష్ట్రం ఇరవై రెండు వేల కోట్ల రెవెన్యూను కోల్పోవలసి వచ్చింది. అదే సమయంలో కరోనాను ఎదుర్కోవడం కోసం వైద్యరంగంలో ఎనిమిదివేల కోట్ల ఖర్చును ప్రభుత్వం అదనంగా పెట్టవలసి వచ్చింది. మొత్తం కలిపి రెండేళ్లలో కరోనా మహమ్మారి ముప్పయివేల కోట్ల రూపాయలను భోంచేసింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ సమస్య ముందుకు వచ్చింది. జగన్‌మోహన్‌రెడ్డి స్వభావం చంద్రబాబుకు పూర్తిగా భిన్నమై నది. ఉద్యోగ వ్యవస్థ, వారికిస్తున్న జీతభత్యాల పట్ల చంద్రబాబుకు మొదటి నుంచీ వ్యతిరేకత ఉండేది. ఈ వ్యతిరేకతను ఆయనెక్కడా దాచుకోలేదు కూడా! ‘మనసులో మాట’ పేరుతో ఆయన తన మనోభిప్రాయాలను ఒక పుస్తకంగా కూడా వేసుకున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగ వ్యవస్థ గుదిబండగా మారిందని అందులో ఆయన అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ ఉద్యోగులకు బదులుగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో, తక్కువ వేతనాలిచ్చి పని చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలు శాశ్వతంగా ఉండకూడదు. పనితీరును బట్టి ఉద్యోగులను కొనసాగించాలని అభిప్రాయ పడ్డారు. ఆయన అధికారంలో ఉన్నంతకాలం అదే వైఖరితో కొనసాగారు.
పెట్టిపోతల్లో జగన్‌మోహన్‌రెడ్డి చేతికి ఎముక లేదంటారు. ఆ ఒరవడిలోనే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతాన్ని మధ్యంతర భృతి (ఐఆర్)గా ప్రకటించారు. అప్పటికింకా కరోనా సంక్షోభం చుట్టుముట్టలేదు. మరే ఇతర రాష్ట్రమూ ఐఆర్‌ను ప్రకటించక పోయినప్పటికీ, కొత్త వేతన సవరణ అమలులోకి వచ్చేలోగా ఉద్యోగులు ఇబ్బందిపడకుండా చూసేందుకోసమని ఆయన ప్రకటించారు. ఉద్యోగులందరూ ఈ చర్యను స్వాగతించారు. కరోనా అనంతర ఆర్థిక పరిస్థితులను సమీక్షించుకున్న అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వేతన సవరణ ప్యాకేజీ ఉద్యోగ సంఘాలకు రుచించలేదు. అవిప్పుడు ఆందోళన బాట పట్టాయి.
కొత్త వేతన సవరణ ప్యాకేజీలోని ఐదు అంశాలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్నాయి. 1. ఐఆర్‌గా 27 శాతాన్ని ప్రకటించి అంతకన్నా తక్కువగా 23 శాతం ఫిట్‌మెంట్ ఎలా ఇస్తారు? 2. ఇంటి అద్దె అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ)లను తగ్గించడం సమంజసం కాదు. 3. పెండింగ్‌లో ఉన్న డీఏలను ఇచ్చి, జీతం తగ్గలేదని చెబుతున్నారు. ఈ లెక్క తప్పు. 4. వేతన సవరణ ఇక మీదట పదేళ్లకోసారి అని చెప్పడాన్ని అంగీకరించం. 5. పెన్షన్‌లో అదనపు శ్లాబును పొందే వయోపరిమితిని 70 నుంచి 80 ఏళ్లకు మార్చారు. దీనివల్ల 70–80 ఏళ్ల మధ్యన ఉన్న పెన్షనర్లు నష్టపోతున్నారు.
ఉద్యోగ సంఘాలకున్న ప్రధానమైన ఈ ఐదు అభ్యంత రాలపై వివిధ సందర్భాల్లో ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. వారి వివరణ ప్రకారం 1. మధ్యంతర భృతి (ఐఆర్)ని ఉద్యోగ సంఘాలు జీతంగా పరిగణిస్తున్నాయి. అది తప్పు. పీఆర్‌సీ (వేతన సవరణ) నుంచి పీఆర్‌సీ వరకు వేతన వ్యత్యాసాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. పీఆర్‌సీ వచ్చేవరకు ఉద్యోగుల సౌకర్యార్థం అమలుచేసిన ఏర్పాటు ఐఆర్. దాన్ని జీతంగా పరిగణించి అంతకు మించి రావాలనడం సమంజసం కాదు. 2. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల సవరణ జరిగింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నాయి. 3. వేతన ప్యాకేజీలో ఒకచోట తగ్గి ఒకచోట పెరిగినా... మొత్తంగా పెరిగిందా లేదా అనేది చూసు కోవాలి. ఆ లెక్క ప్రకారం కొత్త పే స్లిప్స్‌లో జీతం పెరుగుదల కనిపిస్తుంది. ఐఆర్‌గా ప్రకటించిన రూ. 18 వేల కోట్లకు అదనంగా పీఆర్‌సీ వల్ల మరో 10 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. 4. పదేళ్లకోసారి పీఆర్‌సీ అనేది కేంద్ర ప్రభుత్వ విధాన ప్రకటన మేరకే! 5. పదవీ విరమణ వయసు 60 నుంచి 62కు పొడిగించినందు వల్ల రెండేళ్లపాటు అదనపు జీతం లభిస్తుంది. సర్వీస్ పెరగడం వల్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. గ్రాట్యుటీ రూపంగా ఇప్పుడిస్తున్న రూ. 12 లక్షలను 16 లక్షలకు పెంచడం జరిగింది. ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్’లో 10 శాతం స్థలాలను ఉద్యోగులకూ, 5 శాతం స్థలాలను పెన్షనర్లకూ 20 శాతం రిబేట్‌పై ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పీఆర్‌సీతో సంబంధం లేకుండా ఈ రెండున్నరేళ్లలో పది పన్నెండు కేటగిరీల ఉద్యోగులకు పెంచిన వేతన వివరాలను కూడా ప్రభుత్వ ప్రతినిధులు ఏకరువు పెట్టారు.
రాష్ట్ర విభజన, కోవిడ్ సంక్షోభాల కారణంగా రాష్ట్ర సొంత ఆదాయం బాగా పడిపోయింది. కానీ ఉద్యోగుల జీతభత్యాల వ్యయం ఆదాయాన్ని మించి పెరిగింది. 2020–21లో రాష్ట్ర సొంత ఆదాయం రూ. 60,688 కోట్లయితే, ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 67,340 కోట్లకు పెరిగింది. పీఆర్‌సీ అమలు తర్వాత ఈయేడు వ్యయం మరింత పెరుగుతుంది. ఆదాయం ఎంత పెరుగుతుందో చెప్పలేము. ప్రభుత్వం చేస్తున్న వార్షిక వ్యయంలో 36 శాతం జీతభత్యాలకే పోతున్నది. ఇది అన్ని రాష్ట్రాలలోకీ అత్యధికం. ఈ ఆర్థిక విషయాలన్నింటినీ ప్రభుత్వం బలంగానే ఉద్యోగ సంఘాల ముందుంచింది. అయితే ఉద్యోగ సంఘాలు ఈ గణాంకాలకు సంతృప్తి చెందలేదు. తమ వాదనకే కట్టుబడి ఉన్నాయి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను సంతృప్తిపరచాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఒక్కటే. పేద ప్రజల సంక్షేమం, వారిని సాధికార శక్తులుగా మలచడం కోసం అమలుచేస్తున్న పలు కార్యక్రమాల్లో కొన్నింటికి కోతవేయడం! ఇది అభిలష ణీయమా? ఈ చర్య వలన నష్టపోయే వర్గానికీ, ఉద్యోగ
వర్గానికీ మధ్య వైరుధ్యం ఏర్పడదా?
వైరుధ్యం ఏర్పడకూడదు. పెరుగుతున్న ఆర్థిక అంతరాల విభజనలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సాధారణ ప్రజల పక్షాన నిలబడవలసినవారే! వారి లాగే పెరుగుతున్న ధరల బాధితులే! విద్య, వైద్యం వంటి అంగడి కోరలకు గాయపడిన క్షతగాత్రులే! కానీ, ప్రైవేట్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, రైతులు, కూలీలు, కార్మికులతో పోల్చినప్పుడు ఎంతోకొంత స్థితిమంతులు, భద్ర జీవులు. ఐటీ రంగంలో జీతాలు ఎక్కువైనప్పటికీ ఉద్యోగ భద్రత తక్కువ. తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లల్ని ప్రభుత్వో ద్యోగులుగా చూసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఉద్యోగంలో ఉన్న భద్రత, గౌరవం, హోదా అలాంటివి. అటువంటి ప్రభుత్వ ఉద్యోగులే జీతభత్యాల కోసం రోడ్డెక్కితే మిగిలిన ప్రజల స్పందన ఎలా ఉంటుంది? ప్రభుత్వోద్యోగులు సమ్మెకు దిగితే సమస్యలనెదుర్కొనేది సామాన్య ప్రజలే కదా! ఆ ప్రజల మద్దతు లేకుండా సమ్మె పోరాటాలు విజయం సాధిస్తాయా?... ఉద్యోగుల కోర్కెలు గొంతెమ్మ కోర్కెలేమీ కాకపోవచ్చు. అవి న్యాయమైనవే! సందేహం లేదు. కానీ న్యాయం ఎప్పుడూ సాపేక్షమే! అటువంటి న్యాయాన్ని సమాజంలోని మిగిలిన అన్నివర్గాలూ కోరుకుంటాయి. సాధారణ ప్రజలు ఉద్యోగులకు మిత్రులే. శత్రువులు కాదు. మిత్రవైరుధ్యం వలన నష్టాలే తప్ప విజయాలు సిద్ధించవు. మిత్రులతో నిరంతర సమన్వయం లేకుండా ఏ ఒక్క వర్గమూ విడిగా సాధించగలిగేదేమీ ఉండదు.
ఉద్యోగ సంఘాల సంఘటిత శక్తి గొప్పదే! కానీ కొన్ని సందర్భాల్లో ఆ శక్తిని నాయకులు తప్పుగా అంచనా వేసుకుంటారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 55కు తగ్గించారు. దానిపై పెద్దయెత్తున ఉద్యోగులు ఉద్యమించారు. ఎన్‌జీవో నేతగా స్వామినాథన్ ఉండేవారు. బలమైన నాయకుడు. ‘చెన్నారెడ్డి వంటి హేమాహేమీలతోనే తల పడ్డాము. ఈ రామారావు మాకో లెక్కా’ అంటూ సమ్మె సందర్భంగా రాజకీయ ప్రసంగాలు చేసేవారు. సుదీర్ఘంగా సాగిన ఆ సమ్మె చివరకు విఫలమైంది. అసలు డిమాండ్‌ను పక్కనపెట్టి సమ్మె కాలాన్ని సెలవుగా పరిగణించాలని విజ్ఞప్తులు చేయవలసి వచ్చింది. రాజకీయ ఉపన్యాసాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. సమ్మె తర్వాత రెండేళ్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్టీ రామారావు మరోసారి గెలవకుండా స్వామినాథన్ నిరోధించ లేకపోయారు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment