విద్యాబోధనలో, పరిశోధనల్లో ప్రపంచ ఖ్యాతి పొంది, దేశంలోని ఉన్నతశ్రేణి విద్యాసంస్థల జాబితాలో మూడో ర్యాంకుతోవున్న ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) ఆదివారం నెత్తురోడింది. ముసుగులు ధరించిన దుండగులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌లు, కర్రలు పట్టుకుని చీకటిచాటున దాదాపు రెండున్నర గంటలపాటు విశ్వవిద్యాలయం ఆవరణలో స్వైర విహారం చేసిన తీరు చూసి దేశం మొత్తం విస్తుపోయింది. వారి చేతుల్లో యాసిడ్ బాటిళ్లు కూడా ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారంటే ఆ గూండాలు ఎంతకు తెగించారో అర్థమవుతుంది. ఆఖరికి ఆడపిల్లల హాస్టల్‌లో సైతం వారి దౌర్జన్యం యధేచ్ఛగా కొనసాగింది. విద్యార్థినులు నిరాయు ధంగావున్నా, దుండగుల చేతుల్లో గాయాలపాలవుతున్నా అందరూ ఏకమై బిగ్గరగా అరుస్తూ ప్రతి ఘటించడానికి చేసిన ప్రయత్నాలు, వారిలో కొందరు వీడియో తీసిన తీరు ఆ పిల్లల మనోస్థైర్యానికి అద్దం పడతాయి.
ఏడేళ్లక్రితం ఇదే ఢిల్లీలో నడుస్తున్న బస్సులో కొందరు దుండగులు నిర్భయపై పాశవికంగా దాడి చేసి, చెప్పనలవికాని హింసకు పాల్పడి, చివరకు ఆమె ప్రాణాలు తీశారు. ఆ సమయంలో ఆమె ఫలానా విధంగా చేసివుండాల్సిందని చెప్పినవారు మొదలుకొని ఆడపిల్ల రాత్రివేళ మరో వ్యక్తితో కలిసి ఎందుకెళ్లిందని ప్రశ్నించినవారి వరకూ అనేకులున్నారు. కానీ శాంతిభద్రతల యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నచోట ఉన్నతశ్రేణి విద్యాసంస్థలోని ఆడపిల్లల హాస్టల్ సైతం గూండాల దౌర్జన్యానికి నిస్సహాయంగా తలవంచాల్సిందేనని ఆదివారంనాటి ఉదంతం రుజువు చేసింది. దాడి సమయంలో ఎంతమంది విద్యార్థినులు పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేసివుంటారో ఊహకందని విషయ మేమీ కాదు. నిజానికి ఆ దుండగుల జాడను గుర్తించాక చాలా ముందే పోలీసు అధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశానని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్ చెబుతున్నారు.
ఫలానా పోలీస్ అధికారి తన వద్ద చదువుకుని వెళ్లాడని, అందువల్ల అతనికి సమాచారం అందించానని మరో అధ్యాపకుడు వెల్లడించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపత్కాలంలో ఆదుకున్నవారు లేరు. విశ్వవిద్యాలయం పాలకవర్గం నుంచి అనుమతి లేనందువల్ల వెంటనే రాలేకపోయామని పోలీసులు ఇస్తున్న సంజాయిషీ సమర్థనీయం కాదు. విపత్కర పరిస్థితులున్నాయని చానెళ్లన్నీ చెబుతున్నా మౌనంగావుండటం దిగ్భ్రాంతికరం. ఆ దాడుల్లో ఎవరి ప్రాణాలైనా పోయివుంటే జవాబుదారీ ఎవరు? దేశ రాజధాని నగరంలోని ప్రఖ్యాత యూనివర్సిటీయే ఈ దుస్థితిలోవుంటే ప్రపంచ దేశాల దృష్టిలో మన ప్రతిష్ట మసకబారదా? దుండగులు తనను గుర్తించి మరీ తల బద్దలు కొట్టారని, చేయి విరగ్గొట్టారని అయిషీ ఘోష్ అంటున్నారు. విద్యార్థినీవిద్యార్థులు మాత్రమే కాదు...అధ్యాపకులు సైతం దుండగుల దౌర్జన్యాన్ని చవిచూడటం ఊహకందనిది. భిన్న విశ్వాసాలున్నవారు అక్కడ చదువుకుంటున్నా, ఆ విశ్వాసాల మధ్య నిత్యం ఘర్షణాత్మక వాతావరణం ఉంటున్నా అర్ధ శతాబ్ది దాటిన ఆ విశ్వవిద్యాలయం చరిత్రలో ఇంతవరకూ అధ్యాపకులపై భౌతికదాడి చేసిన ఉదంతం ఎప్పుడూ లేదు.
తమపై దాడి చేసింది ఏబీవీపీకి చెందినవారేనని గాయపడినవారు చెబుతుంటే, తమ ప్రమేయం లేదని ఆ సంస్థ ఖండిస్తోంది. పైగా అయిషీ ఘోష్ దుండగులతో కలిసి లోనికి వస్తున్న దృశ్యమని చెబుతూ విశ్వవిద్యాలయం, పోలీసులు ఒక వీడియో విడుదల చేశారు. అందులో కనిపిస్తున్నామె వారు ఆరోపిస్తున్నట్టు నిజంగా అయిషీ ఘోష్ అయితే ఆమెతోసహా వామపక్ష విద్యార్థులంతా ఆ దుండగులకు ఎందుకు లక్ష్యంగా మారతారన్న ప్రశ్న తలెత్తుతుంది. మరోపక్క కొన్ని చానెళ్లు వీడియోల ఆధారంగా దుండగులకు ఏబీవీపీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నాయి. అంతే కాదు... ఒకపక్క ఈ దాడి సమాచారం అందుకుని మెయిన్ గేట్ వద్దకొచ్చిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడి, స్వరాజ్ అభియాన్ పార్టీ అధినేత యోగేంద్ర యాదవ్‌ను కిందకు తోసి దౌర్జన్యం చేసినవారు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆ పని చేశారన్నది కూడా తేలవలసివుంది. అసలు దౌర్జన్యం కొనసాగినంతసేపూ వీధి దీపాలు స్విచాఫ్ చేసిందెవరో కూడా తేలాలి. ఆ దీపాల వెలుతురుంటే దుండగులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోకి రావడం, పోవడం అంత సులభమయ్యేది కాదు. రెండురోజులుగా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలున్నా, విద్యార్థి సంఘాల మధ్య అడపా దడపా ఘర్షణలు చోటు చేసుకున్నా విశ్వవిద్యాలయం బాధ్యులు తమకు సంబంధం లేనట్టు చోద్యం చూశారు. వాస్తవానికి గత రెండున్నర నెలలుగా విశ్వవిద్యాలయం ఆందోళనలతో అట్టుడుకుతోంది.
ఫీజులు, మెస్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విశ్వవిద్యాయలం వైస్ చాన్సలర్ జగదీష్ కుమార్‌కూ, పాలకవర్గానికీ దీన్నిమించి పరిష్కరించ వలసిన సమస్య ఏం ఉంటుంది? ఇంతకు ముందు మాటెలావున్నా విశ్వవిద్యాలయంలో ఇంత పెద్ద ఘటన చోటుచేసుకున్న తర్వాతకూడా ఆయనగానీ, రెక్టార్‌గానీ, మరొకరుగానీ పత్తా లేకుండా పోవడంలోని ఆంతర్యమేమిటి? దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాల తరహాలోకాక, దీన్ని విభిన్నంగా తీర్చి దిద్దాలని దీన్ని స్థాపించడంలో ముఖ్యపాత్ర పోషించినవారు భావించారు. దానికి తగినట్టే గ్రామీణ ప్రాంతాలకు చెందిన అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన మెరికల్లాంటివారెందరో ఇక్కడ ఉన్నత చదువులు చదువుకుని భిన్న రంగాలకు వన్నె తెస్తున్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగిన సందర్భాలున్నా అవి హంతకదాడుల వరకూ వెళ్లకపోవడం, ఇక్కడివారు చదువుల్లో ఎప్పుడూ మేటిగా ఉండటం ఈ విశ్వవిద్యాలయం విశిష్టత. ఈ ఉన్నత సంప్రదాయం చెదిరిపోనీయకూడదు. ఆదివారంనాటి ఉదంతం ఒక కొత్త సంప్రదాయంగా మారకుండా, చేదు జ్ఞాపకంగా మాత్రమే మిగ లాలి. అది సాధ్యం కావాలంటే ఉన్నతస్థాయి విచారణ జరిపి, దుండగులు ఏ పార్టీకి, సంస్థకు చెందిన వారైనా కఠినంగా శిక్షించాలి. ఈ విశ్వవిద్యాలయం ప్రతిష్టను నిలబెట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment